logo

20 టన్నులకుపైగా గోమాంసం స్వాధీనం

గంజాం జిల్లా జగన్నాథపూర్‌ కూడలి సమీపాన 16వ నెంబరు జాతీయ రహదారిపై ఓ కంటెయినర్‌లో అక్రమంగా రవాణా అవుతున్న 20 టన్నులకుపైగా గోమాంసాన్ని ఛత్రపురం భజరంగదళ్‌ కార్యకర్తలు, స్థానికులు ఆదివారం పట్టుకున్నారు.

Published : 01 Jul 2024 05:49 IST

ప్యాకెట్‌లలో గోమాంసం. చిత్రంలో కంటెయినర్‌ చోదకుడు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: గంజాం జిల్లా జగన్నాథపూర్‌ కూడలి సమీపాన 16వ నెంబరు జాతీయ రహదారిపై ఓ కంటెయినర్‌లో అక్రమంగా రవాణా అవుతున్న 20 టన్నులకుపైగా గోమాంసాన్ని ఛత్రపురం భజరంగదళ్‌ కార్యకర్తలు, స్థానికులు ఆదివారం పట్టుకున్నారు. ఖుర్దా నుంచి ఓ కంటెయినర్‌లో గోమాంసం ఆంధ్రవైపు అక్రమంగా రవాణా అవుతున్నట్లు సమాచారం అందడంతో గంజాం జిల్లా గంజాం, హుమ్మా, ఛత్రపురంల వద్ద శనివారం అర్ధరాత్రి నుంచి జాతీయ రహదారిపై కార్యకర్తలు కాపలా కాశారని ఛత్రపురం భజరంగదళ్‌ నాయకుడు రామకృష్ణ రెడ్డి విలేకరులకు చెప్పారు. మార్గమధ్యంలో కంటెయినర్‌ను అడ్డుకునేందుకు కార్యకర్తలు ప్రయత్నించగా, చోదకుడు వేగంగా వాహనాన్ని నడిపారన్నారు. దీంతో అనుమానం వచ్చి వాహనాన్ని వెంబడించి, ఆదివారం ఉదయం జగన్నాథపూర్‌ సమీపాన అడ్డుకున్నామన్నారు. చోదకుడు కార్యకర్తలపై పదునైన ఆయుధంతో దాడికి ప్రయత్నించాడని రెడ్డి ఆరోపించారు. ఈ అక్రమ రవాణాకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండు చేశారు. గోమాంసం ఖుర్దా నుంచి విశాఖపట్నం (ఆంధ్ర) రవాణా చేస్తున్నట్లు కంటెయినర్‌ చోదకుడు విలేకరులకు తెలిపాడు. భజరంగదళ్‌ కార్యకర్తల సమాచారం మేరకు ఛమ్మాఖండి ఠాణా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గోమాంసం ప్యాకెట్లు, కంటెయినర్‌ను స్వాధీనం చేసుకున్నామని, చోదకుడ్ని అదుపులోకి తీసుకుని, దర్యాప్తు చేస్తున్నామని ఛత్రపురం ఎస్డీపీవో గౌరహరి సాహు విలేకరులకు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని