logo

ఆటో, బైకును ఢీకొన్న బొలెరో

జిల్లా కేంద్రానికి సమీపంలోని ఎల్పీజీ ప్లాంటు వద్ద ప్రధాన రహదారిపై ఓ ఆటో, బైకును బొలెరో ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాయగడ నుంచి కెరడ వైపు వెళుతున్న ఓ బొలెరో, ఇదే మార్గంలో వెళుతున్న ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొంది.

Published : 01 Jul 2024 05:02 IST

ఇద్దరి మృతి, 10 మందికి గాయాలు 

ప్రమాదంలో నుజ్జయిన ఆటో

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రానికి సమీపంలోని ఎల్పీజీ ప్లాంటు వద్ద ప్రధాన రహదారిపై ఓ ఆటో, బైకును బొలెరో ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాయగడ నుంచి కెరడ వైపు వెళుతున్న ఓ బొలెరో, ఇదే మార్గంలో వెళుతున్న ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. అనంతరం అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. ప్రమాదంలో బైకుపై ప్రయాణిస్తున్న బెహరాగుడ గ్రామానికి చెందిన గణేష్‌ పిడికాక, డెక్కకూడాకు చెందిన సత్య మండంగిలు దుర్మరణం చెందారు. వెనుక కూర్చున్న ఇద్దరు, ఆటోలో ప్రయాణిస్తున్న కొంతమందికి గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో బ్రహ్మపుర తరలించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ గ్రామస్థులు ఆందోళనకు దిగడంతో వాహనాలు రహదారిపై నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న కలెక్టర్‌ మనోజ్‌ సత్యవాన్‌ మహాజన్‌ ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను జిల్లా కేంద్రాసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. ఆదివారం కావడంతో మజ్జిగౌరి మందిరానికి వచ్చే వాహనాలు రహదారికి ఇరువైపులా నిలిచిపోయి ట్రాఫిక్‌ స్తంభించింది. దీంతో సెరిగూడ, పితామహల్‌ మీదుగా వాహన రాకపోకలకు అనుమతించారు.ఎమ్మెల్యే అప్పలస్వామి కడ్రక ఘటనా స్థలానికి, ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. 

రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ దుర్మరణం  

భువనేశ్వర్, న్యూస్‌టుడే: భువనేశ్వర్‌ జయదేవ్‌ విహార్‌ పరిధిలో శనివారం రాత్రి విధులు ముగించుకుని తన నివాసానికి వెళుతున్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ మధుసూదన్‌ కిసానికి ఎదురుగా వస్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఘటనా స్థలంలో ఆయన మృతి చెందాడు. అర్ధరాత్రి విషయం తెలిసిన తర్వాత డీసీపీ ప్రతీక్‌ సింగ్‌ చేరుకుని పార్థివ దేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఆదివారం పోస్ట్‌మార్టం జరిగింది. మృతుడు మల్కాన్‌గిరి వాసి కాగా భువనేశ్వర్‌లో ఉద్యోగ రీత్యా కుటుంబంతో ఉన్నారు. అధికార లాంఛనాలతో ఆదివారం సాయంత్రం అంత్యక్రియలు జరిగాయి. ఈ ఘటనకు కారణమైన వాహన చోదకుడు పరారయ్యాడు. సీసీటీవీ పుటేజీ పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.   


ప్రభుత్వ నిధుల దుర్వినియోగం.. విశ్రాంత అధికారిణికి జైలు శిక్ష

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: గంజాం జిల్లా పురుషోత్తంపూర్‌ సమితి విశ్రాంత మహిళా సామాజిక విద్యాధికారి పి.ఆదిలక్ష్మీ ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై బ్రహ్మపురలోని ప్రత్యేక విజిలెన్స్‌ న్యాయస్థానం విచారించింది. ఆమెకు రెండేళ్ల జైలు శిక్ష, రూ.5 వేలు జరిమానా విధిస్తూ శనివారం తీర్పునిచ్చింది. జరిమానా చెల్లించలేని పక్షంలో మరో రెండు నెలలు కారాగార శిక్ష అనుభవించాలని ఆ తీర్పులో పేర్కొన్నట్లు రాష్ట్ర విజిలెన్స్‌ డైరెక్టరేట్‌ రాత్రి ఒక ప్రకటనలో పేర్కొంది. ఆమె పురుషోత్తంపూర్‌ సమితి ప్రాంతంలో మహిళా సామాజిక విద్యాధికారిగా పనిచేసిన సమయంలో వివిధ పింఛన్ల సొమ్మును దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై బ్రహ్మపుర విజిలెన్స్‌ డివిజన్‌ అప్పట్లో కేసు నమోదు చేసిందని తెలిపింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని