logo

శరత్‌ రాజీనామా చేయాల్సిందే..!

ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత రాష్ట్ర కాంగ్రెస్‌లో కుమ్ములాటలు మళ్లీ మొదలయ్యాయి. నైతిక బాధ్యత వహించి పీసీసీ అధ్యక్ష పదవికి శరత్‌ పట్నాయక్‌ రాజీనామా చేయాలని సహచరులు గొంతెత్తారు.

Published : 29 Jun 2024 03:32 IST

పీసీసీ పదవి నుంచి తప్పుకోవాలని సహచరుల డిమాండ్‌
ఏఐసీసీ పెద్దల వైపు నేతల చూపు
న్యూస్‌టుడే, భువనేశ్వర్‌

కాంగ్రెస్‌ భవన్‌

ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత రాష్ట్ర కాంగ్రెస్‌లో కుమ్ములాటలు మళ్లీ మొదలయ్యాయి. నైతిక బాధ్యత వహించి పీసీసీ అధ్యక్ష పదవికి శరత్‌ పట్నాయక్‌ రాజీనామా చేయాలని సహచరులు గొంతెత్తారు.

సమీక్ష ఊసేలేదు

సార్వత్రిక ఎన్నికల్లో 15 లోక్‌సభ, 90 అసెంబ్లీ స్థానాలు సాధిస్తామని ఎన్నికల ముందు పీసీసీ అధ్యక్షుడు శరత్‌ పట్నాయక్‌ జోష్యం చెప్పారు. కానీ 14 అసెంబ్లీ, 1 ఎంపీ సీటు దక్కించుకుంది. నువాపడ నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన శరత్‌ ఓటమి పాలయ్యారు. పార్టీ పరాజయానికి కారణాలపై ఇంతవరకు సమీక్ష జరగలేదు. సీఎల్పీ నేత ఎవరో తేల్చలేదు. శరత్‌పై అసంతృప్తితో రగిలిపోతున్న పార్టీ నేతలు ఇటీవల ఇంకు చల్లిన విషయం తెలిసిందే. దీన్ని తీవ్రంగా పరిగణించిన నాయకత్వం అయిదుగురిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. దీనికి నిరసనగా యువనేతలు కాంగ్రెస్‌ కార్యాలయం ప్రధాన ద్వారానికి తాళం వేశారు. మరోవైపు సీనియర్‌ నాయకులు సైతం ప్రసార సాధనాల ఎదుట శరత్‌ పనితీరుపై అంసతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


రాజీనామా చేయడం ఉత్తమం

కాంగ్రెస్‌ అగ్రనేత పంచానన్‌ కానుంగో గురువారం రాత్రి భువనేశ్వర్‌లో విలేకరులతో మాట్లాడుతూ... తన సీటు ఓడిపోయి శరత్‌ ప్రతిష్ఠ కోల్పోయారన్నారు. పీసీసీ పదవికి ఆయన అనర్హుడని రాజీనామా చేయడం ఉత్తమమని తెలిపారు. పార్టీ ఓటమికి ఆయన ఆయన నైతిక బాధ్యత వహించాలన్నారు.


అప్పట్లో పదవి వదులుకున్నాను

పీసీసీ మాజీ అధ్యక్షుడు జయదేవ్‌ జెనా మాట్లాడుతూ... 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఓటమి పాలైన వెంటనే తాను నైతిక బాధ్యత వహించి పీసీసీ పదవి వదులుకున్న సంగతి ప్రస్తావించారు. పరోక్షంగా శరత్‌ రాజీనామా చేయాలని సూచన చేశారు.


మునుపటి కంటే మెరుగైంది

పీసీసీ అధ్యక్షుడు శరత్‌ మాట్లాడుతూ... 2019 ఎన్నికలతో పోలిస్తే ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్థితి మెరుగ్గా ఉందన్నారు. బిజద ఒక్క ఎంపీ సీటు నిలబెట్టుకోలేకపోయిందని, కొరాపుట్‌లో కాంగ్రెస్‌ విజయం సాధించిందన్నారు. తమ పార్టీ ఓటమికి కారణాలను అధిష్ఠానానికి తెలియజేస్తామన్నారు. సహచరులంతా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్న అంశంపై అడగ్గా శరత్‌ స్పందించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని