logo

సీఎల్పీ అధ్యక్షుడెవరు?

సీఎల్పీ (కాంగ్రెస్‌ లెజిస్లేటివ్‌ పార్టీ) రాష్ట్ర అధ్యక్షుడి స్థానం కోసం కొరాపుట్‌లో ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల ప్రచారాల్లో ఒకరి కోసం ఒకరు అన్నట్లు ఉన్న నేతలు ఇప్పుడు నువ్వా? నేనా? అన్నరీతిలో వ్యవహరిస్తుండటం చర్చనీయాంశమవుతోంది.

Published : 29 Jun 2024 03:29 IST

రేసులో తారాప్రసాద్, రామచంద్ర కడమ్‌

జయపురం, న్యూస్‌టుడే: సీఎల్పీ (కాంగ్రెస్‌ లెజిస్లేటివ్‌ పార్టీ) రాష్ట్ర అధ్యక్షుడి స్థానం కోసం కొరాపుట్‌లో ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల ప్రచారాల్లో ఒకరి కోసం ఒకరు అన్నట్లు ఉన్న నేతలు ఇప్పుడు నువ్వా? నేనా? అన్నరీతిలో వ్యవహరిస్తుండటం చర్చనీయాంశమవుతోంది. రాష్ట్ర సీఎల్పీ అధ్యక్షుడి రేసులో జయపురం, పొట్టంగి ఎమ్మెల్యేలు తారాప్రసాద్‌ వాహినీపతి, రామచంద్ర కడమ్‌ ఉన్నారు. తారా ప్రసాద్‌తో కలివిడిగా ఉన్న ఎంపీ సప్తగిరి ఉలక ఇప్పుడు రామ్‌చంద్రకు మద్దతిస్తుండటం పలు విమర్శలకు దారి తీస్తోంది. ఎంపీ ఉలక, కడమ్‌ సహా మరో ఐదుగురు ఎమ్మెల్యేలు ఇటీవల కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసిన విషయం తెలిసిందే. ఉలక కడమ్‌కు ఆ స్థానం ఇప్పించే ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యే అయిన తారాప్రసాద్‌కు ఆ స్థానం ఇస్తే బాగుంటుందని కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


ఎవరికిచ్చినా పర్వాలేదు: కడమ్‌

సీఎల్పీ అధ్యక్షుడి స్థానం మా ఇద్దరిలో ఎవరికి వరించినా పర్వాలేదని రామచంద్ర కడమ్‌ అన్నారు. వాహినీపతి గిరిజనుల మనిషి. తాను ప్రజల మధ్యకు వెళ్తారు. అందువల్ల ప్రజల్లో ఆయనకు ఆదరణ ఎక్కువ ఉందని కడమ్‌ అన్నారు. తామంతా గెలిచిన సందర్భంగా ఖర్గేను కలిశామని ఇందులో వేరే ఉద్దేశమేమీ లేదని ఆయన చెప్పుకొచ్చారు.


ప్రజల కోసం గళం విప్పుతా: తారా ప్రసాద్‌

తనకు పార్టీ ఎటువంటి స్థానాలు కట్టబెట్టకపోయినా ప్రజలకోసం అసెంబ్లీలో తన గళం విప్పడం తగ్గదని తారాప్రసాద్‌ అన్నారు. ప్రతీ సమస్య పరిష్కరించేందుకు అసెంబ్లీలో ప్రత్యర్థి స్థానంలో ఉంటూ ప్రశ్నిస్తూ వచ్చానని, అందువల్ల తనకు ‘అసెంబ్లీ టైగర్‌’ అన్న బిరుదు వచ్చిందన్నారు. అధిష్ఠానం నిర్ణయానికి మేమంతా కట్టుబడి ఉంటామని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో సీఎల్పీ అధ్యక్షుడి స్థానం ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని