logo

శ్రీక్షేత్రానికి రూ.500 కోట్లు సరిపోవు

పూరీ శ్రీక్షేత్రానికి ఆదాయం అంతంత మాత్రమే వస్తోందని, కానీ వ్యయం బాగా పెరిగిందని పూరీ రాజు, శ్రీక్షేత్ర పాలక వర్గం అధ్యక్షుడు గజపతి దివ్యసింగ్‌ దేవ్‌ చెప్పారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన రూ.500 కోట్లు కర్పస్‌ నిధి సరిపోదని పేర్కొన్నారు.

Published : 29 Jun 2024 03:28 IST

పూరీ రాజు గజపతి దివ్యసింగ్‌దేవ్‌
గోపాలపూర్, న్యూస్‌టుడే

పూరీ శ్రీక్షేత్రం

పూరీ శ్రీక్షేత్రానికి ఆదాయం అంతంత మాత్రమే వస్తోందని, కానీ వ్యయం బాగా పెరిగిందని పూరీ రాజు, శ్రీక్షేత్ర పాలక వర్గం అధ్యక్షుడు గజపతి దివ్యసింగ్‌ దేవ్‌ చెప్పారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన రూ.500 కోట్లు కర్పస్‌ నిధి సరిపోదని పేర్కొన్నారు. రథయాత్ర నేపథ్యంలో గజపతి గురువారం రాత్రి ఒక వార్త సంస్థతో మాట్లాడారు. జగన్నాథుని సేవల సామగ్రికి, సేవాయత్‌ల జీతభత్యాలు, ఇతర వ్యయం గణనీయంగా పెరిగిందన్నారు. దీంతో పోలిస్తే శ్రీక్షేత్రానికి సమకూరుతున్న ఆదాయం నామ మాత్రంగా ఉందన్నారు. కర్పస్‌ ఫండ్‌ సేవల కింద వినియోగించలేమని, ఈ మొత్తం బ్యాంకుల్లో ఉంటుందని, వడ్డీ మాత్రమే ఖర్చవుతోందని, బ్యాంకులు చెల్లిస్తున్న 5 నుంచి 6 శాతం వడ్డీ సరిపోదని చెప్పారు. పురుషోత్తమునికి దేశ వ్యాప్తంగా భూములున్నాయని, కొంతమేరకు కబ్జా జరిగాయని, ఇవి విక్రయించి, సొమ్ము బ్యాంకుల్లో జమచేస్తే, ఆలయానికి వడ్డీ పెద్దమొత్తం అందుతుందని, ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు.

రద్దీ నియంత్రణ సాధ్యమే

జగన్నాథ దర్శన వ్యవస్థ సులభతరం చేయొచ్చని మొబైల్‌ ద్వారా స్లాబ్‌ బుకింగ్‌ చేసుకున్న వారు నిర్ణీత వేళల్లో ఆలయానికి వస్తారన్నారు. ఈ వ్యవస్థ ప్రారంభిస్తే శ్రీక్షేత్రం వెలుపల భక్తులు బారులుదీరి వేచి చూసే పరిస్థితి ఉండదన్నారు. గర్భగుడిలో రద్దీ తగ్గుతుందన్నారు.


సంపద భద్రంగా ఉంది

గజపతి దివ్యసింగ్‌ దేవ్‌

శ్రీక్షేత్ర రత్నభాండాగారంలో స్వామి సంపద భద్రంగా ఉందన్నారు. 1927లో తమ తాత కపిలేంద్రదేవ్‌ ఆభరణాలను కొయ్యపెట్టెల్లో ఉంచారని, సంపదంతా పెట్టెల్లో ఉందని, దీనికి ఆధునిక తరహా భద్రత కల్పించాల్సినవసరం ఉందన్నారు. స్వామికి సంబంధించి వజ్రవైఢుర్యాలు, గోమేదిక, పుష్యరాగాలు, రత్నాలు, స్వర్ణాభరణాలు, కిరీటాలున్నాయని వీటి నాణ్యతపై పరిశీలన జరగలేదన్నారు. లెక్కింపు సమయంలో సంపద విలువ గురించి అధ్యయనం చేస్తే బాగుంటుందన్నది తమ అభిప్రాయమన్నారు. సంపద లెక్కింపు, భాండాగారం మరమ్మతులకు జస్టిస్‌ అర్జిత్‌ పసాయత్‌ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఇదివరకు ప్రభుత్వానికి సూచనలు చేసిందన్నారు. తాము త్వరలో ముఖ్యమంత్రి మోహన్‌చరణ్‌మాఝి, న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్‌ హరిచందన్‌లను కలిసి తమ అభిప్రాయాలు తెలియజేస్తామని గజపతి చెప్పారు.     

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని