logo

గురుకులంపై ఆశ.. సీట్లు లేక నిరాశ

జిల్లాలోని గురుకులాల్లో చదువుకోవాలనే ఆసక్తితో పేద విద్యార్థులు వందల సంఖ్యలో సీట్ల కోసం ప్రయత్నిస్తున్నారు

Updated : 05 Jul 2024 06:27 IST

అధికారులకు 600 వినతులు 

సీట్ల కోసం జిల్లా కోఆర్డినేటర్‌ కార్యాలయానికి వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు 
న్యూస్‌టుడే, నెల్లూరు(విద్య): జిల్లాలోని గురుకులాల్లో చదువుకోవాలనే ఆసక్తితో పేద విద్యార్థులు వందల సంఖ్యలో సీట్ల కోసం ప్రయత్నిస్తున్నారు. ఇందుకు ప్రతిరోజూ పెద్దసంఖ్యలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నెల్లూరు నగరంలోని గురుకుల విద్యాలయాల జిల్లా కోఆర్డినేటర్‌ కార్యాలయానికి వచ్చి వినతులు సమర్పిస్తున్నారు. కలెక్టరేట్‌లోనూ వినతులు ఇస్తున్నారు.

ఏళ్లుగా పెరగక..

జిల్లా వ్యాప్తంగా 8 గురుకులాలు ఉన్నాయి. ఆరింటిలో అయిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు, రెండింటిలో 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యాబోధన, వసతి కల్పిస్తున్నారు. జిల్లా విభజనలో భాగంగా బాలురకు ఉన్న గురుకులాలు తిరుపతి జిల్లాలోకి వెళ్లాయి. జిల్లా వ్యాప్తంగా కేవలం బాలికల విద్యకే విద్యాలయాలు ఉన్నాయి. జిల్లాలో ఉన్న విద్యాలయాలలో 5వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు తరగతికి 80 చొప్పున మొత్తం మీద 4,800 సీట్లు ఉన్నాయి. వీటికి ఏటా సీట్ల భర్తీకి పరీక్ష నిర్వహిస్తుంటారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు మెరిట్‌ ప్రకారం సీట్లు కేటాయిస్తారు. గురుకులాలలో సీట్లు పొందేందుకు పేద మధ్యతరగతి విద్యార్థులు వేలల్లో పోటీ పడుతుంటారు. పోటీ పరీక్ష తెలియక రాయలేని విద్యార్థులు అధిక సంఖ్యలో జిల్లా అధికారులకు వినతి పత్రాలు ఇస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు గురుకుల విద్యాలయాల్లో వివిధ తరగతుల్లో చదివేందుకు అవకాశం కల్పించాలంటూ బుధవారం వరకు 550కి పైగా వినతులు వచ్చాయి. కలెక్టరేట్‌లో 50కి పైగా వినతులు అందాయి.

పట్టించుకోని నాటి ప్రభుత్వం

ఎన్నో ఏళ్ల నాడు ప్రారంభించిన గురుకుల పాఠశాలలో ఆరింటిని ఇంటర్మీడియట్‌కు అప్‌గ్రేడ్‌ చేశారు. ప్రతి తరగతికి 80 మంది విద్యార్థుల చొప్పున బోధన అందిస్తున్నారు. సంవత్సరాలు గడుస్తున్నా ఆయా పాఠశాలలు, కళాశాలల్లో సీట్లను పెంచిన దాఖలాలు లేవు. గతంలో తెదేపా ప్రభుత్వం గురుకుల విద్యాలయాల్లో సీట్లు పెంచుతూ ప్రతిపాద]నలు చేపట్టింది. ఆ తరువాత వచ్చిన వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదు. తాజాగా కూటమి గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తెదేపా ఇచ్చిన మాటను నిలబెట్టుకునే దిశలో భాగంగా ఇటీవల మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ తెదేపా హయాంలో గురుకులాల్లో మంజూరైన 1500 సీట్లను వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే రద్దు చేసిందని వీటిని తిరిగి పునరుద్ధరించనున్నట్లు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని సాంఘిక సంక్షేమ గురుకులాల్లో అద]నపు సీట్ల భర్తీ దస్త్రంపై తొలి సంతకం చేశారు. ఇదే స్ఫూర్తితో జిల్లాలో కూడా సీట్లు పెరగొచ్చని విద్యార్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్, గురుకుల కోఆర్డినేటర్‌ చొరవ చూపి అద]నపు సీట్లు మంజూరయ్యేలా చూడాలని కోరుతున్నారు. 


ఉన్నతాధికారులకు తెలియజేస్తాం

గురుకులాల్లో చదివేందుకు ఏటా పోటీ పెరుగుతోంది. ఉన్న సీట్లు పూర్తయినా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి అర్జీలు వస్తున్నాయి. విషయం ఉన్నతాధికారులకు తెలిపాం. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అద]నపు సీట్లను కేటాయిస్తే పేద విద్యార్థులకు మేలు జరుగుతుంది.
- హేమలత, గురుకులాల జిల్లా కోఆర్డినేటర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని