logo

ప్రభుత్వ పాఠశాలలే లక్ష్యంగా దొంగతనాలు

ప్రభుత్వ పాఠశాలలే లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.

Published : 05 Jul 2024 04:15 IST

నిందితుల అరెస్టు

వివరాలు వెల్లడిస్తున్న జిల్లా అదనపు ఎస్పీ 

నెల్లూరు(నేర విభాగం), న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలలే లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.10 లక్షల విలువైన సొత్తుతో పాటు రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్‌ హాలులో గురువారం అదనపు ఎస్పీ సీహెచ్‌ సౌజన్య నిందితుల వివరాలను వెల్లడించారు. దుత్తలూరు మండలం రాచవారిపల్లికి చెందిన పాత నేరస్థుడు పి.వెంకటరత్నం, ప్రకాశం జిల్లా దండుపాలెంకు చెందిన షేక్‌ మునీర్‌బాషా స్నేహితులు. వీరు చెడు వ్యసనాలకు బానిసైన పాఠశాలలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడ్డారు. కార్లలో తిరుగుతూ రాత్రివేళల్లో పాఠశాలల తాళాలు పగులగొట్టి అందులో ఉన్న ఫ్యాన్లు, టీవీలు, ఏసీలు, ల్యాప్‌టాప్, సీపీయూ, ప్రింటర్లు దొంగిలించి విక్రయించి వచ్చిన డబ్బుతో జల్సా చేస్తున్నారు. వరుస దొంగతనాల నేపథ్యంలో సీసీఎస్, ఆత్మకూరు డీఎస్పీలు పి.రామకృష్ణాచారి, ఎన్‌.కోటారెడ్డి సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. గురువారం ఏఎస్‌పేట వద్ద నిందితులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. విచారించగా ఏఎస్‌ పేట పరిధిలోని పాఠశాలలు, దగదర్తి, విడవలూరు, సంగం, ఉదయగిరి, వరికుంటపాడులో 8 పాఠశాలల్లో చోరీలకు పాల్పడినట్లు అంగీకరించారు. 

ఒకరిపై సస్పెక్టెడ్‌ షీటు..:  నిందితుల్లో ఒకరైన వెంకటరత్నం పాత నేరస్థుడు. వ్యసనాలకు బానిసై చోరీల బాట పట్టాడు. వంద బైక్‌ల దొంగతనం కేసుల్లో కీలక నిందితుడు. ఉదయగిరి, మర్రిపాడుతో పాటు వైయస్‌ఆర్‌ జిల్లా బద్వేల్‌లో ఎర్రచందనం కేసుల్లో నిందితుడు. నిందితుడిపై కోవూరు పోలీసు స్టేషన్‌లో సస్పెక్టెడ్‌ షీటు ఉంది. ఇటీవల ఆయనకు మునీర్‌ బాషాతో పరిచయమైంది. ఇద్దరూ కలిసి పాఠశాలలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేస్తున్నారని అదనపు ఎస్పీ వెల్లడించారు. నిందితులను అరెస్టు చేసిన సీసీఎస్‌ సంగం ఇన్‌స్పెక్టర్లు చిట్టెం కోటేశ్వరరావు, సాంబశివరావు, రవినాయక్, ఏఎస్‌పేట ప్రసాద్‌ రెడ్డి, సీసీఎస్‌ సిబ్బందిని అదనపు ఎస్పీ అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని