logo

యువత.. క్రీడల్లో ఘనత

పట్టణంలోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం పీజీ కళాశాలలో చదువుతున్న వారు క్రీడల్లో ప్రతిభ చూపుతున్నారు. పేద కుటుంబాలకు చెందిన వారు.

Published : 05 Jul 2024 04:12 IST

న్యూస్‌టుడే, కావలి: పట్టణంలోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం పీజీ కళాశాలలో చదువుతున్న వారు క్రీడల్లో ప్రతిభ చూపుతున్నారు. పేద కుటుంబాలకు చెందిన వారు. ఉన్నత లక్ష్యాలతో సాధన చేస్తున్నారు. తల్లిదండ్రుల ఆకాంక్షల మేరకు చదువుకుంటున్నారు. మరోవైపు ఇష్టమైన క్రీడల్లో సాధన చేస్తున్నారు. పోటీల్లో పాల్గొని సత్తా చాటుతున్నారు. వివిధ వేదికలపై విజేతలుగా నిలిచి బహుమతులు అందుకుంటున్నారు. 

కబడ్డీలో ముని రత్నం సత్తా

కావలి పట్టణంలోని బుడంగుంట కాలనీకి చెందిన వేపగుంట మునిరత్నం ప్రస్తుతం ఎంకామ్‌ తొలి సంవత్సరం చదువుతున్నారు. కబడ్డీలో ప్రావీణ్యం సంపాదించారు. జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ చూపుతున్నారు. ఇతని తండ్రి శ్రీనివాసులు వంట పనిచేస్తున్నారు. తల్లి లక్ష్మి గృహిణి. పోలీస్‌ అధికారి ఉద్యోగం సాధించి ప్రజలకు సేవలందించాలనే లక్ష్యంతో శ్రమిస్తున్నారు. కబడ్డీతోపాటు బాల్‌బ్యాడ్మింటన్‌లోనూ శిక్షణ పొందుతున్నారు. 

ఇదీ ప్రతిభ

2019లో జరిగిన విశ్వవిద్యాలయ స్థాయిలో జవహర్‌భారతి కళాశాల తరఫున ఆడి తన జట్టును ప్రథమస్థానంలో నిలిపారు.  ః తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో 2021వలో జరిగిన 47వ జూనియర్‌ స్టేట్‌మీట్‌లో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ః 2023లో విశాఖపట్టణంలో జరిగిన దక్షిణ జోన్‌ పోటీల్లోనూ ప్రతిభాపాఠవాల్ని ప్రదర్శించారు.

క్రికెట్‌లో ఆల్‌రౌండర్‌ వెంకటేష్‌

వ్యవసాయ కుటుంబానికి చెందిన దేరంగుల వెంకటేష్‌ క్రికెట్లో మేటి ఆటగాడిగా రాణిస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో సత్తా చూపి ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందారు. దక్షిణ భారత క్రికెట్‌ జట్టుకు ఎంపికయ్యారు. స్థానిక టోర్నమెంట్లలో ఇప్పటి వరకు 50కి పైగా మ్యాచ్‌లు ఆడారు. వీటిలో రూ. 50 వేల వరకు నగదు బహుమతులు అందుకున్నారు. ఎమ్మెస్సీ జువాలజీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. నంద్యాల జిల్లా డోన్‌కు చెందిన ఇతను భవిష్యత్తులో ప్రొఫెసర్‌గా స్థిరపడాలనే లక్ష్యంతో సాధన చేస్తున్నారు. భారత జట్టుకు ఎంపిక కావాలని ఆశిస్తున్నారు. తండ్రి చంద్రుడు, తల్లి వెంకటేశ్వరమ్మ ప్రోత్సాహంతో చదువుకుంటున్నానని తెలిపారు.

బాస్కెట్‌బాల్‌లో దిట్ట రేఖ

ఎమ్మెస్సీ జువాలజీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మైలప్పగారి రేఖ బాస్కెట్‌బాల్‌లో  ప్రతిభ చూపుతుంది. ఈమెది తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలోని అల్లికేశం గ్రామం. తండ్రి రమేష్, తల్లి మంజుల. వీరిద్దరూ వ్యవసాయ కూలీలు. చిన్నప్పటి నుంచి క్రీడలపై ఆసక్తి పెంచుకుంది. క్రీడా ఉపాధ్యాయుల సహకారంతో ఇష్టమైన వాటిలో నైపుణ్యం సాధించారు. భవిష్యత్తులో పోలీస్‌ అధికారి ఉద్యోగం సాధించి మహిళల సంరక్షణకు కృషి చేస్తానని ఈమె చెబుతుంది. గత ఏడాది బెంగళూరులో నిర్వహించిన దక్షిణ జోన్‌ బాస్కెట్‌బాల్‌ పోటీల్లో రన్నరప్‌ సాధించింది. విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో బాల్‌బ్యాడ్మింటన్‌ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచింది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని