logo

ఖాతాదారుల ఆర్డీ నగదు రూ.10 లక్షలు స్వాహా

మండలంలోని పుల్లాయపల్లి బ్రాంచి ఫోస్టాఫీసులో ఖాతాదారులు దాచుకున్న సుమారు రూ. 10 లక్షల ఆర్డీ నగదు పోస్టుమాస్టర్‌ షేక్‌ నాయబ్‌ రసూల్‌ స్వాహా చేసి పరారయ్యారు. ఈవిషయం గురువారం వెలుగులోకి వచ్చింది

Published : 05 Jul 2024 04:05 IST

బ్రాంచి పోస్టుమాస్టర్‌ పరారీ

ఉదయగిరి, న్యూస్‌టుడే : మండలంలోని పుల్లాయపల్లి బ్రాంచి ఫోస్టాఫీసులో ఖాతాదారులు దాచుకున్న సుమారు రూ. 10 లక్షల ఆర్డీ నగదు పోస్టుమాస్టర్‌ షేక్‌ నాయబ్‌ రసూల్‌ స్వాహా చేసి పరారయ్యారు. ఈవిషయం గురువారం వెలుగులోకి వచ్చింది. ఖాతాదారుల వివరాల మేరకు... పుల్లాయపల్లి బీపీఎంగా నాయబ్‌ రసూల్‌ ఏడాదిగా పనిచేస్తున్నారు. ఫోస్టాఫీసు పరిధిలోని బోబండ, పుల్లాయపల్లి గ్రామాల ఖాతాదారులతో నమ్మకంగా ఉంటూ లావాదేవీలు నిర్వహిస్తున్నారు. పాన్‌ కార్డు కోసమని నగదు పొదుపు చేసే ఖాతాదారుల నుంచి నగదు విత్‌డ్రా ఫారాలపై సంతకాలు తీసుకున్నారు. వాటి ఆధారంగా  పొదుపు చేసుకున్న ఆర్డీ నగదు తీసుకొని పరారయ్యారు. ఇలా రూ.10 లక్షల వరకు ఉంటుందని పలువురు చెబుతున్నారు. గత నెల 27వ తేదీ నుంచి విధులకు రాకపోవడంతో సబ్‌పోస్టుమాస్టర్‌ ఉదయగిరి పోస్టల్‌ ఇన్‌స్పెక్టర్‌ సాయికృష్ణకు సమాచారమిచ్చారు. ఆయన ఉన్నతాధికారులకు తెలపగా వారి ఆదేశాలతో సిబ్బంది ఈనెల 28న పుల్లాయపల్లికి వెళ్లారు. పంచాయతీ కార్యదర్శి సమక్షంలో ఫోస్టాఫీను తాళాలు పగులగొట్టి పరిశీలించారు. అందులో ఉండాల్సిన రూ.10 వేల నగదు, సెల్‌ఫోన్‌ మాయమైనట్లు గుర్తించారు. దస్త్రాలు, ఆర్డీ ఖాతాల పాసు పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. పరారైన బీపీఎంను పట్టుకొని తమకు న్యాయం చేయాలని ఖాతాదారులు వేడుకుంటున్నారు. ఈ విషయమై ఉదయగిరి పోస్టల్‌ ఇన్‌స్పెక్టర్‌ సాయికృష్ణతో మాట్లాడగా పుల్లాయపల్లి బీపీఎం కొద్దిరోజులుగా ఫోస్టాఫీసుకు రావడం లేదని, సెల్‌ఫోన్‌ స్విచ్ఛాప్‌ చేశారన్నారు. ఈనెల రెండో తేదీ అతనిపై పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు. బ్రాంచి ఫోస్టాఫీసు పరిధిలో 750 వరకు ఖాతాలున్నాయన్నారు. పూర్తిస్థాయిలో విచారణ చేసి ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని