logo

అనుమతి.. మాకెందుకది!

కాస్త పెట్టుబడి.. కొంత పరిచయాలు ఉంటే చాలు.. అనతికాలంలోనే రూ. కోట్లకు పడగలెత్తవచ్చనే ఆలోచనతో వైకాపా నాయకులు రెచ్చిపోయారు.

Published : 05 Jul 2024 04:00 IST

అయిదేళ్లలో వైకాపా నాయకుల భారీ భూ దందా
కాలువలు, కుంటలు, ప్రభుత్వ భూములు ఆక్రమించి లేఅవుట్లు

కాస్త పెట్టుబడి.. కొంత పరిచయాలు ఉంటే చాలు.. అనతికాలంలోనే రూ. కోట్లకు పడగలెత్తవచ్చనే ఆలోచనతో వైకాపా నాయకులు రెచ్చిపోయారు. గడచిన అయిదేళ్లలో ఇష్టానుసారం వేల ఎకరాల్లో లేఅవుట్లు వేశారు. కొన్నిచోట్ల ప్రభుత్వ, ప్రైవేటు భూములను ఆక్రమించడంతో పాటు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే విక్రయాలు చేశారు. ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టడంతో పాటు రిజర్వు స్థలాలనూ వదలకుండా దోచుకున్నారు. ప్రస్తుతం ఆయా లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసినవారు గగ్గోలు పెడుతుండగా- మంత్రి నారాయణ విచారణకు కమిటీ వేస్తుండటంతో అక్రమార్కుల్లో ఆందోళన మొదలైంది. 

ఈనాడు, నెల్లూరు: పొదలకూరు, న్యూస్‌టుడే: నుడా పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో.. కార్పొరేషన్‌లో 1000 చ.మీటర్లు, మున్సిపాలిటీలు, పంచాయతీల్లో 300 చ.మీటర్లు పైబడిన భవనాలు, లేఅవుట్లు అభివృద్ధి చేయాలంటే.. అనుమతి అవసరం. కాగా, గత అయిదేళ్లలో కాసుల కక్కుర్తితో కొందరు స్థిరాస్తి వ్యాపారులు వైకాపా నాయకుల అండతో ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. వందల్లోనే అక్రమ లేఅవుట్లు వెలిశాయి.  ప్రధానంగా నెల్లూరు రూరల్, సర్వేపల్లి, కోవూరు, కావలి నియోజకవర్గాల్లో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. కొన్నిచోట్ల కాలువలు, పంట కుంటలను ఆక్రమించి మరీ లేఅవుట్లు వేశారు. వెనుక పొలాలకు నీరు వెళ్లేందుకూ వీలు లేకుండా ఏకంగా ప్రహరీలు నిర్మించారు. వాటిపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే, ఇబ్బంది పెట్టడంతో పాటు అక్కడికి వెళ్లిన అధికారులపై ఒత్తిడి తీసుకురావడం గత ప్రభుత్వంలో పరిపాటి అయింది. దీంతో నుడాకు అనుమతుల జారీ ద్వారా వచ్చే రూ. కోట్ల ఆదాయానికి గండి పడింది. 

వాటా.. ఎకరాకు రూ. అయిదు లక్షల పైమాటే

లేఅవుట్‌కు అనుమతి కోసం నుడాకు దరఖాస్తు చేసుకుంటే ఎకరాకు కార్పొరేషన్‌లో రూ. 1.75 లక్షలు, గ్రామీణంలో రూ. 65వేలు, మున్సిపాలిటీలో రూ. 1.27 లక్షలు చెల్లించాలి. లేఅవుట్‌ వేసే ప్రాంతాలను బట్టి.. చెల్లింపుల్లో కాస్త వ్యత్యాసం ఉంటుంది. దీంతో పాటు ఈడబ్ల్యూఎస్, అయిదు శాతం స్థలం వదలడం మామూలే. కాగా, లేఅవుట్‌ వేసే ముందు అక్కడి ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకుని.. ఈవేమీ లేకుండానే కొందరు విక్రయాలకు తెరదీశారు. దీనికి గాను.. గత అయిదేళ్లలో ఆయా ప్రాంతాలను బట్టి ఎకరాకు రూ. 5 లక్షల నుంచి రూ. పది లక్షల వరకు వారికి చెల్లించుకున్నట్లు సమాచారం. మొత్తంగా వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 2,500 ఎకరాలు మాత్రమే నుడా అనుమతి తీసుకోగా.. మరో పది వేల ఎకరాలు తీసుకోకుండానే విక్రయించినట్లు సమాచారం. 

నీకింతా.. నాకెంత.. పద్ధతిలో! 

జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులేమీ లేకపోవడంతో.. నాయకులంతా గ్రావెల్, ఇసుక అక్రమ తరలింపుతో పాటు.. లేఅవుట్లపైనే దృష్టి పెట్టారు. నెల్లూరు నగరంలోని ఓ ప్రజాప్రతినిధికి లేఅవుట్‌ వేస్తే కప్పం కట్టక తప్పని పరిస్థితి కొనసాగింది. తర్వాత ఆ సంస్కృతి అన్ని నియోజకవర్గాలకు చేరింది. కావలిలో ఏకంగా వైకాపా ప్రజాప్రతినిధే భాగస్వామిగా వేసిన లేఅవుట్‌కు అనుమతి తీసుకోలేదు. పైగా అందులో ప్రభుత్వ భూమిని కలిపేసుకున్నారు. ఆ విషయాన్ని ఆయనే విలేకరుల సమావేశం పెట్టి చెప్పడం గమనార్హం. జగన్‌మోహన్‌రెడ్డి కావలిలో సిద్ధం సభ నిర్వహించిన లేఅవుట్‌కూ అనుమతి లేదు. దీన్ని గుర్తించిన నుడా అధికారులు.. కొనుగోలుదారులను అప్రమత్తం చేస్తూ హెచ్చరిక బోర్డు పెడితే.. నిమిషాల వ్యవధిలో పీకి పక్కనేయడం గమనార్హం. 


ఇక్కడే 52 అక్రమ లేఅవుట్లు!
 - తెదేపా నాయకుల ఆరోపణ

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి కనుసన్నల్లోనే అక్రమ లేఅవుట్లకు తెరలేపారని పొదలకూరు తెదేపా నాయకులు గురువారం ఆరోపించారు. పొదలకూరులోని ఓ అక్రమ లేఅవుట్‌పై విచారణ చేయాలని నుడా అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం.. మండల తెదేపా అధ్యక్షుడు మస్తాన్‌బాబు మాట్లాడుతూ.. మండలంలో కాకాణి కనుసన్నల్లోనే 52 అక్రమ లేఅవుట్లు వెలిశాయన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా బినామీలను పెట్టి రూ. కోట్లు దోచేశారన్నారు. పొదలకూరు పట్టణ సమీపంలో స్వర్ణ గార్డెన్స్‌ లేఅవుట్‌లో సుమారు రూ.200 కోట్ల విలువ చేసే వ్యవసాయ భూమిని ఏలాంటి కన్వర్షన్‌ లేకుండా, లేని దాన్ని ఉన్నట్లుగా ఒక డాక్యుమెంటు సృష్టించి డీటీసీపీ అప్రూవల్‌ ఉన్నట్లు సర్వే నంబర్లను మార్చి.. ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. డీటీసీపీతో ఏర్పడిన నంబరు పరిశీలించగా.. ఫోర్జరీ సంతకాలు అని తేలిందన్నారు. కార్యక్రమంలో పట్టణ తెదేపా అధ్యక్షుడు మల్లికార్జున్‌నాయుడు, శ్రీనివాసులురెడ్డి, గిరినాయుడు, శ్రీనివాసులురెడ్డి, వెంకటేశ్వర్లు, సుగుణమ్మ, జమీర్‌బాషా తదితరులు ఉన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని