logo

ఇదిగో పులి.. కారిడార్‌ జాడేది?

టైగర్‌ కారిడార్‌ ప్రతిపాదనలకే పరిమితమైంది. నంద్యాల జిల్లా శ్రీశైలం నుంచి తిరుమల కొండల ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించినా.. ఆశించిన మేరకు అడుగులు పడలేదు

Updated : 05 Jul 2024 04:03 IST

మర్రిపాడు అటవీ ప్రాంతంలో కెమెరాకు చిక్కిన పెద్దపులి 

టైగర్‌ కారిడార్‌ ప్రతిపాదనలకే పరిమితమైంది. నంద్యాల జిల్లా శ్రీశైలం నుంచి తిరుమల కొండల ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించినా.. ఆశించిన మేరకు అడుగులు పడలేదు. తాజాగా మర్రిపాడు సమీప అడవుల్లో పెద్దపులి, చిరుతపులి సంచారం వెలుగు చూసిన నేపథ్యంలో కారిడార్‌ విషయం మరోసారి చర్చనీయాంశమైంది. అందులో భాగంగా ఉన్న శ్రీపెనుశిల నృసింహ వన్యప్రాణుల అభయారణ్యం అభివృద్ధి ఆవశ్యకత తేటతెల్లమైంది. 

ఆత్మకూరు, మర్రిపాడు, న్యూస్‌టుడే : పెనుశిల నృసింహ అభయారణ్యంలో వన్యప్రాణుల సంరక్షణకు గతంలో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశారు. అది ఏమైందో గానీ.. నిర్వహణ చిన్న చిన్న పనులకే పరిమితమైంది. నీటి నిల్వ గుంతలు, నేల తొట్టెలు, వేసవిలో నీటి నిల్వకు గుంతలు, రక్షణ కంచె తదితరాలు చేపట్టినా.. అవి కూడా రాపూరు రేంజికే పరిమితమయ్యాయి. వన్యప్రాణులు అడవి దాటి.. జనావాసాల్లోకి వచ్చి ప్రమాదాలకు గురికాకుండా నీటిని, మేతను ఏడాది మొత్తం వాటికి అందుబాటులో ఉంచాలన్న లక్ష్యం.. ఆత్మకూరు రేంజి పరిధిలో పూర్తిగా అందుబాటులోకి రాలేదు. ఫలితంగా తరచూ అవి జనావాసాల్లోకి వచ్చి రోడ్డు దాటే క్రమంలో మృత్యువాత పడుతున్న సంఘటనలు జరుగుతున్నాయి. ఇప్పటికే.. రెండు చిరుతలు, జింకలు ఇలా ప్రాణాలు వదిలాయి. మొన్నటికి మొన్న కారు పులిని ఢీకొందన్న సంఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 

రెండేళ్ల కిందటే పాదముద్రలు

ఆత్మకూరు అటవీరేంజిలో రెండేళ్ల కిందటే పాదముద్రలు గుర్తించగా.. నాడే టైగర్‌ కారిడార్‌ ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. నేటికీ అక్కడే నిలిచాయి. అభయారణ్యం నిర్వహణకు ఏటా రూ. 30 లక్షలు, అదీ నిర్వహణకు తప్ప.. మిగిలిన వాటికి పైసా వచ్చిన పరిస్థితి లేదు. ఇప్పుడు రెండు పులుల సంచారం వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో టైగర్‌ కారిడార్‌ను ముందుకు తీసుకువెళ్లడంతో పాటు.. ఎర్రచందనం స్మగ్లర్లు, వేటగాళ్ల నుంచి వన్య ప్రాణులను కాపాడేందుకు నిర్దుష్ట చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. 

ప్రతిపాదన ఉంది

శ్రీశైలం నుంచి తిరుమల వరకు టైగర్‌ కారిడార్‌ ప్రతిపాదన ఉంది. అంతకు మినహా.. నిధుల కేటాయింపు లేదు. పెనుశిల నృసింహ వన్య ప్రాణుల అభయారణ్యంలో రక్షణ పనులకు ఏటా రూ. 30 లక్షల వరకు వ్యయం చేస్తున్నాం. 
- చంద్రశేఖర్, డీఎఫ్‌వో


గత నెల 17న కదిరినాయుడుపల్లి సమీప అటవీ ప్రాంతంలో నెల్లూరు-ముంబయి జాతీయ రహదారిపై పెద్దపులిని కారు ఢీకొట్టిందన్న వార్త తెలిసిందే. నాటి నుంచి అధికారులు దాని జాడ కనిపెట్టేందుకు 30 మంది బృందాలుగా విడిపోయి కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. కొన్నిచోట్ల జంతువుల పాదముద్రలు గుర్తించినా.. అవి స్పష్టంగా లేవు. దాంతో వివిధ ప్రాంతాల్లో నిఘా నేత్రాలు ఏర్పాటు చేయగా.. నానమ్మ చెరువు దగ్గర సెలయేరులో పెద్దపులి సంచారం, మరో ప్రాంతంలో చిరుతపులి చిత్రం నిఘా కెమెరాల్లో దొరికింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని