logo

నిర్లక్ష్యానికి.. ఏదీ ‘మాత్ర’?

సకాలంలో, సక్రమంగా వినియోగిస్తే రోగుల పాలిట సంజీవినులయ్యే పలు ఔషధాలు.. అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతో ఏళ్లుగా ఆసుపత్రుల గదుల్లోనే మగ్గి కాలం చెల్లిపోతుండగా- ఆ విషయం ఎక్కడ బయటపడుతుందోనని గుట్టుగా కాల్చేస్తున్నారనే విమర్శలు నెలకొన్నాయి

Published : 05 Jul 2024 03:50 IST

డీఎంహెచ్‌వో కార్యాలయంలో చెదలుపట్టి కాలం చెల్లిన మందులు 

సకాలంలో, సక్రమంగా వినియోగిస్తే రోగుల పాలిట సంజీవినులయ్యే పలు ఔషధాలు.. అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతో ఏళ్లుగా ఆసుపత్రుల గదుల్లోనే మగ్గి కాలం చెల్లిపోతుండగా- ఆ విషయం ఎక్కడ బయటపడుతుందోనని గుట్టుగా కాల్చేస్తున్నారనే విమర్శలు నెలకొన్నాయి. రూ. లక్షల విలువ చేసే మందులు ఇలా నిరుపయోగంగా మారుతుండటంపై రోగులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

న్యూస్‌టుడే, నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): జిల్లాలో 61 పీహెచ్‌సీ, 28 యూపీహెచ్‌సీ, 497 హెల్త్‌ క్లినిక్‌లు ఉండగా- అక్కడికి వచ్చే వారి వ్యాధుల నివారణలో భాగంగా 172 రకాలు, హెల్త్‌ క్ల్లినిక్‌ల్లో 67 రకాల మందులు అందిస్తుంటారు. ఆరోగ్య కేంద్రాల్లో అవసరం మేరకు వైద్యాధికారుల సూచన మేరకు ఇతర మందులు తీసుకుంటూ ఉంటారు. రోగులకు అవసరమయ్యే మందులు, శస్త్రచికిత్సల్లో వినియోగించే వస్తువులు వైద్యాధికారుల ఇండెంట్‌ ప్రకారం సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌ నుంచి వస్తుంటాయి. ఒక్కో పీహెచ్‌సీకి.. మూడు నెలల చొప్పున నాలుగు విడతలుగా వస్తాయి. 

వినియోగంపై దృష్టేదీ?

పీహెచ్‌సీ పరిధిలో జనాభా.. ఆసుపత్రిలో మందుల వాడకం.. వైద్యాధికారుల ఇండెంట్‌ ప్రకారం ఒక్కో ఆసుపత్రికి ఏటా రూ. 50 వేల నుంచి రూ. 3 లక్షల విలువ చేసే ఔషధాలు వస్తుంటాయి. ఇలా పీహెచ్‌సీలకే ఏటా రూ. కోటికిపైగా విలువైనవి వస్తాయి. జాతీయ కార్యక్రమాలు, హెల్త్‌ సెంటర్లకు వచ్చేవి కలిపితే మరో రూ. కోటి వరకు ఉంటుందని అంచనా. వీటిల్లో కొంత మేర వృథా అవుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. పీహెచ్‌సీలో ఏదైనా రకం మందుల వాడకం తగ్గిపోతే.. వాటిని అవసరమైన మరో చోటికి తరలించాల్సి ఉంది. ఇలా సమన్వయంతో పూర్తిగా ఉపయోగపడేలా చూడాలి. క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు విరుద్ధమైన పరిస్థితి నెలకొంది. వైద్య సేవలు మొక్కుబడిగా ఉండటం, ఆ కారణంగా వచ్చే రోగుల సంఖ్య తక్కువగా ఉండటంతో.. వినియోగం పెద్దగా ఉండటం లేదు. దీంతో పెద్ద సంఖ్యలోనే కాలం చెల్లి వృథాగా పోతున్నాయని సమాచారం. అలాంటి వాటిని వ్యర్థాలు, వృథా వస్తువులను కాల్చే వరల్లో వేసి గుట్టుచప్పుడు కాకుండా తగలబెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. అలాంటి వాటిలో వినియోగానికి పనికొచ్చేవి ఉంటుండటం గమనార్హం. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వెనుక బూడిదలో మందులు కనిపించగా.. నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ పరిధిలోని ఆసుపత్రి ప్రాంగణంలో కాలం చెల్లిన మందులు దర్శనమిచ్చాయి. సర్వేపల్లి నియోజకవర్గంలోనూ పలు ప్రాంతాల్లో కాల్చిన సంఘటనలు ఉన్నాయి. నెల్లూరు డీఎంహెచ్‌వో కార్యాలయంలో చెదలు పట్టి కాలం చెల్లినవి ఉన్నాయి. జిల్లాలోని సగానికిపైగా పీహెచ్‌సీల్లో ఇదే పరిస్థితి ఉండగా.. ఔషధాల వినియోగంపై ఉన్నతాధికారుల తనిఖీలు, చర్యలు ఉండటం లేదనే విమర్శలు ఉన్నాయి. 


తనిఖీలు చేస్తాం

జిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయం వెనుక అట్టపెట్టెలు పడి ఉన్నాయి. వాటిని దహనం చేస్తూ ఉంటారు. మందులు వినియోగించకున్నా, కాలం చెల్లిన పేరుతో కాల్చినా.. చర్యలు తప్పవు. ఔషధాల వినియోగంపై తనిఖీలు చేస్తాం.  
- ఎం.పెంచలయ్య, డీఎంహెచ్‌వో

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని