logo

భూములిస్తే.. పరిహాసమా!

పరిహారం అందకపోవడంపై ఆవేదనజిల్లాల అశాస్త్రీయ పునర్విభజన సమస్య కందుకూరును వెంటాడుతూనే ఉంది.

Published : 05 Jul 2024 03:45 IST

పనులు అడ్డుకుంటున్న రైతులు (పాతచిత్రం) 

పరిహారం అందకపోవడంపై ఆవేదనజిల్లాల అశాస్త్రీయ పునర్విభజన సమస్య కందుకూరును వెంటాడుతూనే ఉంది. ప్రతిపాదనలు, ప్రకటనలు వంటి కసరత్తు మొత్తం పాత జిల్లాలో ఉన్నప్పుడు మొదలవగా- పనులు మాత్రం ప్రస్తుతం నూతన జిల్లా పరిధిలో జరుగుతుండటం కొంతమంది రైతులను ఇబ్బందులకు గురి చేస్తోంది. అధికారులు ఒకరిపై ఒకరు చెప్పుకొంటూ కాలయాపన చేస్తుండగా- తాము కోల్పోయిన భూములకు నష్టపరిహారం అందక 167-బి జాతీయ రహదారికి భూములిచ్చిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏళ్లుగా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. 

కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే : ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ జాతీయ రహదారి నుంచి కందుకూరు, వలేటివారిపాలెం, మాలకొండ, పామూరు, సీఎస్‌పురం ప్రాంతాల మీదుగా కడప జిల్లా మైదుకూరు వరకు సుమారు 195 కి.మీ. రోడ్డును జాతీయ రహదారిగా గుర్తిస్తూ.. 2018లో ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. తదనుగుణంగా 2021లో రహదారి ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. మొత్తం నాలుగు ఫేజ్‌లు కాగా, మొదటి విడతగా సింగరాయకొండ నుంచి మాలకొండ వరకు 45 కి.మీ.లకు సుమారు రూ. 240 కోట్లు కేటాయించారు. రహదారికి అవసరమైన భూముల సేకరణ కోసం 2021లోనే ప్రకటన జారీ చేశారు. కందుకూరు, వలేటివారిపాలెం మండలాల్లో సుమారు 300 మంది రైతులు భూములు కోల్పోనున్నారు. వీరికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం అందించేందుకు దస్త్రాలు సిద్ధం చేశారు. రైతుల నుంచి భూ యాజమాన్య హక్కు పత్రాలు సేకరించి రికార్డులు తయారు చేశారు. 

జిల్లా విభజనతో చిక్కులు

2022 ఏప్రిల్‌లో.. జిల్లాల పునర్విభజనలో భాగంగా కందుకూరు నియోజకవర్గం నెల్లూరులో విలీనమైంది. దాంతో కింది స్థాయి రెవెన్యూ యంత్రాంగం మొత్తం నెల్లూరు జిల్లా ఉన్నతాధికారుల అధీనంలో పనిచేయాల్సి ఉంది. 167-బి జాతీయ రహదారి ప్రక్రియ మొత్తం రెండేళ్ల పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో జరిగింది. దీంతో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లించే పనితోపాటు భూసేకరణ మొత్తం ఉమ్మడి ప్రకాశం జిల్లా ఉన్నతాధికారులు చూసేలా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే.. అధికారులు నెల్లూరు, ప్రకాశం జిల్లాల పేర్లు చెబుతూ.. కాలయాపన చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. సగం మందికిపైగా పరిహారం అందగా, ఇంకా కందుకూరు మండలంలో 57 మందికి రూ. 14.3 కోట్లు, వలేటివారిపాలెం మండలంలో 52 మందికి రూ. కోటి రావాల్సి ఉంది. వీటిలో కొన్ని సాంకేతిక సమస్యలున్నా.. పరిష్కరించడంలో రెవెన్యూ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. తహసీల్దారు, సబ్‌ కలెక్టర్‌ కార్యాలయాల్లో సమస్య గురించి సమాధానం చెప్పేవారే ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి.. పరిహారం అందించాలని కోరుతున్నారు. 

 సగమిచ్చారు...

నాకు కందుకూరు పట్టణంలో సర్వే నంబరు 978లో ఎకరం పొలం ఉంది. దాని మీదుగా జాతీయ రహదారి ఏర్పాటు చేస్తున్నామని, 36 సెంట్లు భూసేకరణ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 6 నెలలు తిరిగితే.. 20 సెంట్లకు పరిహారం ఇచ్చారు. మిగిలిన దాని కోసం ఏడాది నుంచి తిరుగుతున్నా.. పరిహారం ఇవ్వలేదు.  
- జి.మాధవరావు, కందుకూరు


తప్పక అందజేస్తాం

జాతీయ రహదారికి సంబంధించి.. భూసేకరణలో కొందరు రైతులకు సాంకేతిక సమస్యలు ఉన్నాయి. కొన్ని చుక్కల భూములు, వాగు పోరంబోకు, టైటిల్‌ సక్రమంగా లేనివి పెండింగ్‌లో ఉన్నాయి. ఉన్నతాధికారుల సూచనల మేరకు వీలైనంత త్వరగా రైతులకు పరిహారం అందజేస్తాం.

 - జనార్దన్, కందుకూరు డిప్యూటీ తహసీల్దారు 


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని