logo

జోరుగా బేరాలు.. పట్టాల అమ్మకాలు!

అయిదేళ్ల పాలనలో వైకాపా నాయకులు దోచుకోవడం.. దాచుకోవడమే పరమావధిగా రెచ్చిపోయారు. కన్నుపడిన స్థలాలు తక్షణం తమ అధీనంలోకి వెళ్లిపోవాలన్నట్లు వ్యవహరించారు. దేవాదాయశాఖ అధికారులు తమ భూమిగా పేర్కొంటూ..

Published : 03 Jul 2024 03:13 IST

వెంకటాచలం మండలంలో వైకాపా భూదందా

అయిదేళ్ల పాలనలో వైకాపా నాయకులు దోచుకోవడం.. దాచుకోవడమే పరమావధిగా రెచ్చిపోయారు. కన్నుపడిన స్థలాలు తక్షణం తమ అధీనంలోకి వెళ్లిపోవాలన్నట్లు వ్యవహరించారు. దేవాదాయశాఖ అధికారులు తమ భూమిగా పేర్కొంటూ.. పెట్టిన బోర్డులు సైతం పెకలించి మరీ ఆక్రమణలకు పాల్పడ్డారు. ప్రస్తుతం ప్రభుత్వం మారినా.. వారి ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. జగనన్న కాలనీల పేరుతో గతంలో వేసిన లేఅవుట్లలోని ప్లాట్లనూ కాజేస్తున్నారు. ఓ వైపు ఇతర ప్రాంతాల వ్యక్తులకు విక్రయించడంతో పాటు సొంత పార్టీ నాయకులకు పంపిణీ చేస్తున్నారు. తాజాగా ఆ పత్రాలు చెల్లవని రెవెన్యూ అధికారులు చెప్పడంతో.. వాటిని ఇచ్చిన వారిని దూషిస్తూ.. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం గమనార్హం.

ఈనాడు, నెల్లూరు

వెంకటాచలం పరిధిలో.. జాతీయ రహదారి పక్కనున్న దేవాదాయ భూమిలో జగనన్న కాలనీ ఏర్పాటు చేయగా- వైకాపా నాయకులు దాంతో పాటు దాని పక్కనున్న ప్రాంతాలకు దొంగ పట్టాలు సృష్టించి.. ఎన్నికల తర్వాత పంపిణీ చేశారు. రెండు రోజుల కిందట ఓ ప్రధాన వైకాపా నాయకుడు పలువురికి పట్టాలు అందించగా.. అసలు విషయం తెలిసి.. ఇంటి స్థలాలు ఇస్తామని ఎన్నికల సమయంలో తమ వెంట తిప్పుకొని.. మోసం చేశారని వాపోతున్నారు. సదరు నాయకుడు ఇచ్చిన పట్టాలు తీసుకుని రెవెన్యూ అధికారులను కలిస్తే.. అసలు మీకు ప్లాట్లు ఎక్కడిచ్చారు? ఇందులో తహసీల్దారు సంతకం ఫోర్జరీ అని చెప్పడంతో నిర్ఘాంతపోయారు. ఆ క్రమంలోనే వెంకటాచలానికి చెందిన అంకయ్య అనే యువకుడు సదరు పట్టాను చించి వేయగా.. సంబంధిత వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది.

జగనన్న కాలనీని 2022లో ఏర్పాటు చేశారు. తొలుత 7.30 ఎకరాల విస్తీర్ణంలో వేసిన లేఅవుట్‌లో మంత్రి చేతుల మీదుగా స్థానికులకు 9 అంకణాల చొప్పున 185 మందికి పట్టాలు పంపిణీ చేశారు. కొన్ని రోజుల తర్వాత కాలనీకి పక్కనే ఉన్న అయిదెకరాల దేవాదాయ స్థలంలో వైకాపా నాయకులు మరో అనధికారిక లేఅవుట్‌ వేశారు. రెండు లేఅవుట్లలో మొత్తం 600 ప్లాట్లు ఉండగా- దాదాపు 300 విక్రయించారనే ఆరోపణలు ఉన్నాయి. మిగిలినవి వైకాపా సానుభూతిపరులు, నాయకుల బంధువులకు ఇచ్చారు. రెండు రోజుల కిందట కూడా వెంకటాచలంలోని కొందరి ఇళ్లకు ‘నివేశన స్థలం అప్పగింత పత్రం’ పేరుతో 2022లో అప్పటి తహసీల్దారు సంతకం చేసినట్లు ఇచ్చిన పట్టాలు పంపిణీ చేయడం సదరు నాయకుల బరితెగింపునకు నిదర్శనం కాగా.. విక్రయాలు జరిపిన, వైకాపా సానుభూతిపరులు, నాయకుల బంధువులకు ఇచ్చిన వాటిపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

దేవాదాయ భూమిలో దోపిడీ

సీతన్న చలివేంద్రం పేరుతో ఇక్కడ సుమారు 300 ఎకరాలకు పైగా భూములు ఉండగా- వాటిని అనాదిగా కొందరు సాగు చేసుకునేవారు. వారిలో కొందరు మరో అడుగు ముందుకేసి.. 1985-90 మధ్య లేఅవుట్లు వేసి.. విక్రయించారు. దానిపై కొందరు కోర్టుకు వెళ్లడంతో.. ఆ భూమి దేవాదాయశాఖకు చెందిందేనని 2008-09లో తీర్పు వచ్చింది. అధికారులు అక్రమ నిర్మాణాలు తొలగించారు. రికార్డుల్లో సాగుదారులుగా ఉన్న రైతుల పేర్లు తొలగించారు. వైకాపా అధికారంలోకి రాగానే.. దానిపై కన్నేశారు. అందులో జగనన్న కాలనీ ఏర్పాటు చేశారు. ఆక్రమణదారులు మళ్లీ భూముల్లోకి ప్రవేశించారు. కొద్దికొద్దిగా ఆక్రమిస్తూ.. నిర్మాణాలు ప్రారంభించారు. గతంలో పని చేసిన రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై రికార్డుల్లో అనుభవదారుడి పేర్లను మార్చుకున్నారు. పైగా తమకు వారసత్వంగా వచ్చినట్లు నమోదు చేయించుకున్నారు.  

అధికారులే విస్తుబోయేలా..

నకిలీ పట్టాల విషయం వెలుగు చూడటంతో రెవెన్యూ అధికారులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 2022లో పనిచేసిన తహసీల్దారు ప్రసాద్‌ సంతకం ఉన్న పత్రాలు.. ఇప్పుడెందుకు పంపిణీ చేస్తున్నారనే విషయం తెలియక తల పట్టుకుంటున్నారు. ఆ స్థలాలు కొనుగోలు చేసిన వారు కూడా ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తం చేయగా.. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో రూ. కోట్లు చేతులు మారాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దీనిపై తహసీల్దారు పూర్ణచంద్రరావు వివరణ కోరగా.. జగనన్న కాలనీలో స్థలాలను విక్రయించడంతో పాటు.. కొత్తగా పట్టాలు పంపిణీ చేయడంపై ఫిర్యాదు అందింది. దీనిపై విచారణ చేస్తున్నాం. విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి.. తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని