logo

జలమయం.. జనం భయం

ఏటా నవంబరు, డిసెంబరు నెలల్లో కురిసే వర్షాలకు నెల్లూరు నగరం ముంపునకు గురవుతోంది. శాఖల మధ్య సమన్వయ లోపం పది లక్షల మంది ప్రజలకు శాపంగా పరిణమిస్తోంది.

Updated : 03 Jul 2024 05:55 IST

అయిదేళ్లుగా మురుగునీటి వ్యవస్థను పట్టించుకోని జగన్‌ ప్రభుత్వం
నిర్దుష్ట ప్రణాళికలతోనే సమస్యకు పరిష్కారం

న్యూస్‌టుడే, నెల్లూరు(నగరపాలకసంస్థ), కావలి, కోవూరు, కందుకూరు పట్టణం, ఆత్మకూరు
వర్షాకాలం వచ్చిందంటే.. నగర, పట్టణ ప్రజలు హడలిపోతున్నారు. చిన్నపాటి వర్షానికే పట్టణ రహదారులు తటాకాలుగా మారిపోతున్నాయి. శివారు కాలనీలు ముంపునకు గురవుతున్నాయి. ఈ పరిస్థితికి కారణం.. డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉండటమే.. ఏటా వీటి నిర్వహణ, నిర్మాణాలకు రూ. కోట్లు ఖర్చు చేస్తున్నా.. ఓ మోస్తరు వర్షానికే పట్టణాలు, నగరం చిగురుటాకులా వణికిపోవాల్సి వస్తోంది.

నెల్లూరు.. సమన్వయలోపమే శాపం

ఏటా నవంబరు, డిసెంబరు నెలల్లో కురిసే వర్షాలకు నెల్లూరు నగరం ముంపునకు గురవుతోంది. శాఖల మధ్య సమన్వయ లోపం పది లక్షల మంది ప్రజలకు శాపంగా పరిణమిస్తోంది. నగరం మీదుగా 16 పంట కాలువలు ప్రవహిస్తుండగా- పొలాలు ఆవాస ప్రాంతాలుగా మారడంతో.. అవన్నీ మురుగునీటి కాలువలుగా మారాయి. ఎప్పటికప్పుడు పూడిక తీయించి.. నీటి పారుదల సక్రమంగా ఉండేలా నీటిపారుదలశాఖ, నగరపాలక సంస్థల అధికారులు చూడాల్సి ఉంది. ఉంది. ఆయా శాఖల మధ్య సమన్వయలోపంతో నిర్వహణ తీసికట్టుగా మారింది. వర్షపు నీరు వెళ్లే మార్గం లేక.. నగరాన్ని ముంచెత్తుతోంది. మన్సూర్‌నగర్, ఖుద్దూస్‌నగర్, పరమేశ్వరీనగర్, పొర్లుకట్ట, వహాబ్‌పేట, ఆర్టీసీ, రెవెన్యూ, గాంధీ గిరిజన కాలనీ తదితర ప్రాంతాలు నీటమునుగుతున్నాయి.

కావలి..  కాలువల ఆక్రమణతో..

కావలి పట్టణంలోని ముసునూరు మర్రిచెట్టు గిరిజన కాలనీ ఏటా జల దిగ్బంధంలో చిక్కుకుంటోంది. దీని చెంతనే ఉన్న మందాటి చెరువు కాలువలను ఆక్రమణదారులు కబళించారు. దాంతో వరద ప్రవాహం వెళ్లేందుకు సరైన మార్గం లేక.. గిరిజన కాలనీ నీట మునుగుతోంది. పట్టణంలోని వైకుంఠపురం తొలి వీధిలోని నివాసాలు కూడా నీట మునుగుతున్నాయి. అక్కడి ఆనపగుంత అంతా ఆక్రమణలకు గురికావడంతో.. వరద సమస్య వెన్నాడుతోంది.

కందుకూరు..  గృహాల్లోకి నీరు

కందుకూరు పట్టణం: వర్షమొస్తే.. కందుకూరు పట్టణంలోని 25వ వార్డు కొత్తకుమ్మరిపాళెంలో రోడ్డుమీద మోకాటిలోతు నీరు ప్రవహిస్తుంది. కాలనీలో చివరి రెండు వీధుల్లోని ఇళ్లలోకి నీరు చేరుతాయి. కేసరిగుంటకాలనీలో అంతర్గతరోడ్లు, కాలువలు లేక ఇళ్ల మధ్య నీరు నిలిచి చెరువును తలపించగా.. ఉప్పుచెరువు లోతట్టు ప్రాంతంలోని గృహాల్లోకి భారీగా నీరు చేరుతుంది. 5 సెం.మీ వర్షం పడినా పామూరురోడ్డు, సింహాద్రినగర్‌ కాలువలు పొంగిపొర్లుతాయి. గత ఏడాది కురిసిన వర్షాలకు... 167-బి జాతీయ రహదారి ప్రభావంతో డంపింగ్‌యార్డు నీట మునిగింది.

ఆత్మకూరు..  ఏళ్లుగా సమస్య

చినుకుపడితే ఆత్మకూరు మధ్యలో ఉన్న చింతచెట్ల కాలనీ ప్రజలకు వణుకే.. పట్టణం తిప్ప పై నుంచి మాగాణి వైపు విస్తరించి ఉండగా.. వర్షాకాలంలో నీరు తిప్ప పై నుంచి కాలనీ పక్కనే ఉన్న డ్రైనేజీలోకి వస్తాయి. అలా వచ్చినవి.. కాలువ పొర్లి కాలనీపై పడుతున్నాయి. 40 ఏళ్లుగా కాలనీవాసులు సమస్యను ఎదుర్కొంటూ.. పరిష్కారం కోసం నిరీక్షిస్తూనే ఉన్నారు. బట్టేపాడు ఎస్సీ కాలనీలో చిన్నపాటి వర్షానికే వీధులు జలమయమవుతున్నాయి.

కోవూరుకు..  కన్నీళ్లే

కోవూరు నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాళెం, కోవూరు, ఇందుకూరుపేట, విడవలూరు మండలాల్లోని పలు గ్రామాలు పెన్నా సమీపంలోనే ఉండగా- నదికి వరదలొస్తే ముంపునకు గురవుతున్నాయి. కోవూరు పట్టణంలో వరద రైలు పట్టాల కింది నుంచి అవతలి వైపునకు వెళ్లేందుకు కల్వర్టులు నిర్మించినా.. అవి పూడికతో నిండిపోయాయి. దాంతో నీరు అవతలి వైపునకు వెళ్లే వీలులేక ఊరిమీదకు వస్తోంది. ఆ క్రమంలో వారం రోజులపాటు జలదిగ్బంధంలోనే ఉన్న సంఘటనలు ఉన్నాయి. పెళ్లకూరు కాలనీ సమీపంలోని వెలిసిన అక్రమ లేఅవుట్లతోనూ వరద సాఫీగా వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు