logo

అనధికారిక మార్గం.. ప్రమాదాలకు నిలయం

జాతీయ రహదారిపై అనధికారిక క్రాసింగ్‌లతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మంగళవారం ముసునూరు టోల్‌ప్లాజా సమీపంలో అలాంటి క్రాసింగ్‌ వద్దే పాఠశాల బస్సు ప్రమాదానికి గురైంది.

Published : 03 Jul 2024 02:55 IST

ముసునూరు టోల్‌ప్లాజాకు గౌరవరం గ్రామానికి మధ్య ప్రైవేటు పాఠశాల వద్ద అనధికారిక క్రాసింగ్‌

న్యూస్‌టుడే, కావలి : జాతీయ రహదారిపై అనధికారిక క్రాసింగ్‌లతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మంగళవారం ముసునూరు టోల్‌ప్లాజా సమీపంలో అలాంటి క్రాసింగ్‌ వద్దే పాఠశాల బస్సు ప్రమాదానికి గురైంది. ఆరు వరుసల జాతీయ రహదారిపై క్రాసింగ్‌గా అండర్‌పాస్‌లు  ఉండాల్సి ఉండగా- కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డికి చెందిన ప్రైవేటు పాఠశాల బస్సులు అనధికారిక క్రాసింగ్‌ నుంచి ఏళ్లుగా జాతీయ రహదారిని దాటుతున్నాయి. వాస్తవంగా నెల్లూరు వైపు వెళ్లే మార్గంలో గౌరవరంలో ఉన్న అండర్‌పాస్‌ నుంచి మాత్రమే వాహనాలు పశ్చిమ దిక్కున ఉన్న సదరు పాఠశాలకు వెళ్లాలి. అలా చుట్టూ తిరిగి వచ్చేందుకు ఆరేడు కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుంది. దీంతో దగ్గర దారి అని నిబంధనలకు విరుద్ధంగా రాకపోకలు సాగిస్తున్నారు.  పాఠశాల యజమాని ప్రజాప్రతినిధి కావడంతో గత వైకాపా పాలనలో అధికారులు అభ్యంతరం చెప్పలేదు. ఇదేమాదిరి  మద్దూరుపాడు వద్ద కూడా అనధికారిక క్రాసింగ్‌లు ఉన్నాయి. వీటి దగ్గర తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా.. మూసివేయించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


నాన్నా.. అమ్మకి చెప్పొద్దు

నాన్నా.. అమ్మకు చెప్పొద్దు.. భయపడుతుంది..  పాఠశాల బస్సు ప్రమాదంలో గాయపడిన చిన్నారులు తమ తండ్రితో చెప్పిన మాటలివి. క్షతగాత్రుల్లో  వి.ధర్మతేజ, నిహారిక అక్కాతమ్ముళ్లు. ప్రమాదం జరగ్గానే పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వారిని తీసువెళ్లారు. ఆ విషయం  తెలిసి..బజార్‌లో ఉన్న వారి తండ్రి శివరాజ అక్కడికి చేరుకున్నారు. నాన్నను చూడగానే ఆ బిడ్డలిద్దరూ ఏడుస్తూ హత్తుకున్నారు. ఆ వెంటనే.. ‘అమ్మ మమ్మల్నిలా ఆసుపత్రిలో చూస్తే భయపడుతుంది.. చెప్పొద్దు’ నాన్నా అంటూ కోరడం చూపరులను కలచివేసింది.


యాజమాన్యందే బాధ్యత: ఎమ్మెల్యే

చిన్నారిని పరామర్శిస్తున్న ఎమ్మెల్యే కృష్ణారెడ్డి 

కావలి, న్యూస్‌టుడే: పాఠశాల బస్సు ప్రమాదానికి యాజమాన్యమే బాధ్యత వహించాలని కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి స్పష్టంచేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను ఆయన పరామర్శించారు. పాఠశాలకు వెళ్లేందుకు అనధికారికంగా జాతీయ రహదారి నుంచి మార్గాన్ని ఏర్పాటు చేసినా జాతీయ రహదారుల సంస్థ పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా మూసివేయాలన్నారు. వాహన సహాయకుడి అంతిమ సంస్కారాలకు రూ.50 వేలు ఇస్తున్నట్లు ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని