logo

వీఆర్‌లో ఎన్‌సీఈఆర్‌టీ కార్యకలాపాలు

నెల్లూరులో 150 సంవత్సరాలకు పైగా విద్యార్థులకు చదువులు నేర్పిన వీఆర్‌ కళాశాలలో త్వరలో ఎన్‌సీఈఆర్‌టీ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. దీంతో తరగతి గదులు, భవనాలకు పూర్వ వైభవం రానుంది.

Published : 03 Jul 2024 02:42 IST

రూ.60 లక్షలతో తరగతి గదులు, భవనాల ఆధునికీకరణ

న్యూస్‌టుడే, నెల్లూరు(విద్య) నెల్లూరులో 150 సంవత్సరాలకు పైగా విద్యార్థులకు చదువులు నేర్పిన వీఆర్‌ కళాశాలలో త్వరలో ఎన్‌సీఈఆర్‌టీ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. దీంతో తరగతి గదులు, భవనాలకు పూర్వ వైభవం రానుంది. నెల్లూరు నగరంలోని నడిబొడ్డున 12 ఎకరాల స్థలంలో వెంకటగిరి రాజులు 1875లో వీఆర్‌ విద్యా సంస్థలను పూరిపాకలో ప్రారంభించారు. 1929లో అత్యాధునిక హంగులతో నూతన భవనాలు ఏర్పాటు చేశారు. మొదట పాఠశాల విద్య, ఇంటర్మీడియట్‌ తరగతులు నిర్వహించారు. అనంతరం పలు డిగ్రీ కోర్సులు ప్రారంభించారు. లా కళాశాల ఏర్పాటు చేశారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సులతో పాటు బీఈడీ, డీఈడీ తదితర వృత్తివిద్యా, అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ కోర్సులు ప్రవేశపెట్టి ఏటా వేలాది మంది చదువుకునేలా చేశారు. 2019లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం వీఆర్‌ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ప్రభుత్వ అధ్యాపకులు, సిబ్బందిని వెనక్కు తీసుకొని వివిధ ప్రభుత్వ కళాశాలల్లో విధులు కేటాయించింది. దీంతో అధ్యాపకులు లేని కారణంగా మూసివేశారు.

కమిటీ చొరవ చూపితే..

వీఆర్‌ విద్యా సంస్థల్లో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, దివంగత ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, పారిశ్రామికవేత్తలు, ఐఏఎస్, ఐపీఎస్, ఉన్నతాధికారులు చదివారు. గత పాలక మండలి రద్దై నూతన పాలక మండలి ఏర్పాటుకు 2018లో ఎన్నికల ప్రక్రియ చేపట్టిన రోజుకు ఇక్కడ చదివిన విద్యార్థులు 18 వేల మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యా సంస్థల నిర్వహణకు పాలకమండలికి ఎన్నికలు జరిపించాలని విద్యావేత్తలు కోరుతున్నారు. గదులు ఆధునికీకరిస్తున్నందున నూతన పాలక మండలి ఏర్పాటై కళాశాలను తెరిపించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

అత్యాధునిక హంగులతో..

జిల్లాకు మంజూరైన ఎన్సీఈఆర్‌టీ ప్రాంతీయ విద్యా, శిక్షణ, పరిశోధనా సంస్థను వెంకటాచలం మండలంలోని చవటపాళెంలో ఏర్పాటు చేయాల్సి ఉంది. అక్కడ భూసేకరణ, భవనాల ఏర్పాట్ల పనులు జరుగుతున్నాయి. ఇవి పూర్తి అయ్యేవరకు వీఆర్‌ కళాశాలలో జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ (ఎన్సీఈఆర్‌టీ) కార్యకలాపాలు చేపట్టేందుకు కళాశాలలోని కొన్ని భవనాలు, తరగతి గదులు తీసుకున్నారు. ఇందులో భాగంగా ఇక్కడ 27 తరగతి గదులను ఎన్‌సీఈఆర్‌టీ వారు తీసుకొని తరగతులు ప్రారంభించనున్నారు. ఇందుకు రూ.60 లక్షలు వెచ్చించి ఆయా తరగతి గదులను అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దారు. ఇక్కడి ఎన్సీఈఆర్‌టీ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి తదితర రాష్ట్రాల కార్యక్రమాలు, తరగతులు, పరిశోధనలు, శిక్షణ చేపట్టనున్నారు. త్వరలో కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయని హెచ్‌వోడీ రమేష్‌బాబు పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని