logo

ఆరు ఇళ్లల్లో చోరీ

సంగంలో సోమవారం అర్ధరాత్రి వేళ ఆరు ఇళ్లలో చోరీ జరిగింది. దాంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

Published : 03 Jul 2024 02:37 IST

ఆగంతుకులు పగలగొట్టిన బీరువా

సంగం, న్యూస్‌టుడే: సంగంలో సోమవారం అర్ధరాత్రి వేళ ఆరు ఇళ్లలో చోరీ జరిగింది. దాంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తన ఇంట్లో దొంగలు ప్రవేశించి తమను వెలుపలకు రానీయకుండా తలుపులకు గడియ పెట్టారని శివాజీ సెంటరులో నివాసం ఉండే ఎ.రామారావు మంగళవారం వేకువజామున మూడున్నర గంటలకు ఎస్సై కె.నాగార్జునరెడ్డికి చరవాణి ద్వారా సమాచారం అందించడంతో వెంటనే ఆయన అక్కడకు వెళ్లేసరికి ఆగంతుకులు పరారయ్యారు. రామారావు ఇంటికి దక్షిణం వైపున తలుపునకు వేసిన తాళం పగలగొట్టి, వంటింటి నుంచి లోపలకు ప్రవేశించిన దొంగలు అక్కడే ఉన్న రూ.2లక్షల విలువైన రెండు బంగారు గాజులు, రూ.4వేల నగదు అపహరించినట్లు తేలింది.

  • మరో అయిదు ఇళ్లలో చోరీ జరిగినట్లు మంగళవారం తెల్లవారిన తర్వాత వెలుగులోకి వచ్చింది. బెంగళూరు బేకరి ఎదురుగా పి.వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు సోమవారం రాత్రి జొన్నవాడకు వెళ్లారు. వారి ఇంటిపై పోలీసు ఉద్యోగి ఒకరు నివాసముంటున్నారు. అయితే, ఆయన కూడా ఇంట్లో లేనందున ఆ రెండిళ్ల లోపలకు ప్రవేశించిన ఆగంతుకులు బీరువాలు, అల్మారాలు పగలగొట్టి వాటిలో దుస్తులను చెల్లాచెదురు చేశారు. అక్కడ రూ.50వేల నగదు, రెండు గ్రాముల బంగారు ఉంగరాలను అపహరించారు.
  • రాళ్లచెలిక బీసీ కాలనీలో ప్రాథమిక పాఠశాల ఎదురుగా ఉన్న జి.హజరత్తయ్య ఇంటికి తాళం వేసి ఉండటంతో అందులో ప్రవేశించిన దొంగలు రెండు వెండి గొలుసులు, రూ.మూడు వేల నగదు తీసుకెళ్లారు. 
  • రాళ్ల చెలిక ఎస్టీకాలనీలో ఇండ్ల శీనయ్య ఇంటికి తాళం వేసి ఉండటంతో ఆ ఇంటికి వెళ్లిన దొంగలు అక్కడ రూ.50వేల నగదును అపహరించడంతోపాటు రూ.50వేల విలువైన టీవీ పగలగొట్టి వెళ్లారు. తాము ట్రాక్టరుకు చేసిన బకాయిలు చెల్లించేందుకు తీసుకొచ్చిన రూ.50వేల నగదు దొంగలు ఎత్తుకెళ్లారంటూ  బాధితురాలు రాజేశ్వరమ్మ విలపించారు.  ః కొత్తూరులో బాలచౌడేశ్వరి ఆలయ సమీపంలో పి.శ్రీనివాసులు అనే ఉపాధ్యాయుడు తన కుటుంబంతో కలసి తిరుమలకు వెళ్లడంతో వారింట్లో చోరీ జరిగింది.

పోలీసుల ఆరా: ఈ చోరీలు అర్ధరాత్రి ఒంటి గంట నుంచి మూడు గంటల లోపు జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పాత నేరస్థుల కదలికలను పరిశీలిస్తున్నారు. పలువురు సంగం వాసులు మాత్రం సన్నగా పొడవుగా ఉన్న ఓ వ్యక్తితోపాటు మరొకరు విద్యుత్తు ఉపకేంద్రం వద్ద అర్ధరాత్రి పూట అనుమానాస్పదంగా సంచరించడాన్ని గమనించారు. ఈ సంఘటనలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కె.నాగార్జునరెడ్డి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని