logo

సంగం - చేజర్ల రహదారికి మహర్దశ

జిల్లా మధ్యలో ఉత్తర, దక్షిణ భాగాలను అనుసంధానం చేసే పెన్నానది వంతెన అనుబంధ రహదారి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చొరవతో రూపుమారనుంది.

Published : 03 Jul 2024 02:34 IST

అధ్వానంగా రహదారి

చేజర్ల, న్యూస్‌టుడే: జిల్లా మధ్యలో ఉత్తర, దక్షిణ భాగాలను అనుసంధానం చేసే పెన్నానది వంతెన అనుబంధ రహదారి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చొరవతో రూపుమారనుంది. సంగం చేజర్ల రహదారి పెరుమాళ్లపాడు మధ్య ఈ రహదారి గత కొన్నేళ్లుగా మరమ్మతులకు నోచుకోక అధ్వాన స్థితికి చేరింది. చేజర్ల కలువాయి, పొదలకూరు మండలాల నుంచి ఆత్మకూరు, ఉదయగిరికి, ఏఎస్‌పేట, ఆత్మకూరు వింజమూరు మండలాల నుంచి పెంచలకోన, గూడూరు, రాపూరు, వెంకటగిరి, తిరుపతి ప్రాంతాలకు వెళ్లే వాహనదారులకు పెరుమాళ్లపాడు వద్ద పెన్నా వంతెన అనుకూలంగా ఉంటుంది. నెల్లూరు, సోమశిల మార్గాల మీదుగా ప్రయాణించే కన్నా ఇటుగా వస్తే 35 కిలోమీటర్ల మేర దూరాన్ని తగ్గిస్తోంది. దగ్గరి మార్గం కావడంతో ప్రజలు ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తుంటారు. వంతెనకు దక్షిణం వైపున ఉన్న పెరుమాళ్లపాడు రహదారి అయిదారేళ్లుగా కనీస మరమ్మతులు లేక భారీ గోతులతో అధ్వానస్థితికి చేరింది. వాహనదారుల బాధలు చూడలేక రెండేళ్ల క్రితం స్థానికులు తాత్కాలిక మరమ్మతులు చేశారు. మళ్లీ గుంతలుపడి వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. ఆనం రామనారాయణరెడ్డి వెంకటగిరి శాసనసభ్యులుగా ఉన్న సమయంలోనూ ఈ మార్గం ప్రాధాన్యత వివరించి ర.భ.శాఖలోకి మార్చి పక్కా రహదారి వేయాలని ప్రభుత్వాన్ని, జడ్పీ సమావేశాల్లో కోరారు. అయినా, అయిదేళ్లు ఈ రహదారిని పట్టించుకొన్న వారే లేరు. ఈ క్రమంలో మంగళవారం ఆత్మకూరులో నిర్వహించిన తొలి సమీక్షలోనే పెన్నావంతెన అనుబంధ రహదారిని మూడు నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో రహదారికి మహర్దశ వచ్చి ప్రయాణికుల కష్టాలు తీరుతాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


ఈ మార్గంలో రాకపోకలు ఎలా?

మండలంలోని తిమ్మాపురం ప్రజలు రహదారి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపాటి వర్షానికే దారుణంగా తయారవుతోంది. అడుగడుగునా గుంతలు ఉండడంతోపాటు వర్షపు నీరు నిలిచిపోయి రాకపోకలకు గ్రామస్థులు కష్టాలు పడుతున్నారు. ఈ విషయమై పీˆఆర్‌ ఏఈ రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ రోడ్డు మరమ్మతుల విషయమై ఉన్నతాధికారులకు నివేదిక పంపించామన్నారు.

న్యూస్‌టుడే, దుత్తలూరు, ఉదయగిరి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని