logo

పింఛన్ల పండగ.. ఆనందం నిండగా..

అప్పటిలా.. ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చిందో లేదోనన్న ఆలోచన లేదు.. సచివాలయం వద్ద ఇస్తారో? బ్యాంకు వద్దకు వెళ్లాలోనన్న దిగులులేదు..

Updated : 02 Jul 2024 05:41 IST

వేకువన 5.30 నుంచే పంపిణీ
తొలిరోజే 95.51 శాతం పూర్తి

అప్పటిలా.. ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చిందో లేదోనన్న ఆలోచన లేదు.. సచివాలయం వద్ద ఇస్తారో? బ్యాంకు వద్దకు వెళ్లాలోనన్న దిగులులేదు.. ఎర్రటి ఎండలో ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందోనన్న బెంగ లేదు.. రాజకీయ నాయకులకు సలాం కొట్టాలన్న ప్రయాస అసలే లేదు.. సూర్యోదయానికి పూర్వమే.. 5.30 గంటల సమయానికే.. ఉషోదయపు ఉషస్సులతోపాటే.. ఆశల ‘చంద్రో’దయం ప్రతి పింఛనుదారుడి ఇంటి తలుపు తట్టింది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు.. చేసిన సంతకం మేరకు.. ఒకటో తేదీనే ఎనిమిది వేల మంది సచివాలయ ఉద్యోగులతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేల చేతుల మీదుగా జులై నెలకు రూ. ఏడు వేల పింఛను అందించింది. ఎన్టీఆర్‌ భరోసా పథకం లబ్ధిదారుల కళ్లలో ఎనలేని ఆనందం నింపింది. తొలిరోజే 95.51 శాతం మంది లబ్ధిదారులకు నగదు అందించడం విశేషం. 

న్యూస్‌టుడే, నెల్లూరు(కలెక్టరేట్, స్టోన్‌హౌస్‌పేట)

జిల్లాలో 3,13,757 మంది పింఛను లబ్ధిదారులు ఉండగా- సోమవారం తొలిరోజే 2,99,678 మందికి పింఛను సొమ్ము అందజేశారు. ఎన్టీఆర్‌ భరోసా పథకంలో భాగంగా 42 మండలాల్లో తెల్లవారుజాము నుంచే ఏప్రిల్, మే, జూన్‌ నెలలకు సంబంధించి రావాల్సిన రూ. మూడు వేలు, జులై నెలకు రూ. 4వేలు.. మొత్తంగా రూ. ఏడువేలు అవ్వాతాతలకు అందజేశారు. దివ్యాంగులకు రూ. మూడు వేలు పెంచి.. రూ. ఆరువేలు, మూడు నెలలకు కలిపి రూ. 15వేలు అందించారు. దీంతో వారిలో ఆనందం వెల్లివిరిసింది. ఇచ్చిన మాట మేరకు తమకు భరోసా అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు రుణపడి ఉంటామన్న కృతజ్ఞత వ్యక్తమైంది. మొత్తంగా తొలిరోజు 95.51 శాతం మందికి నగదు అందజేశారు.

తప్పిన ఇక్కట్లు...

సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇళ్ల వద్దకే పింఛన్లు పంపిణీ చేసే అవకాశం ఉన్నా.. గత వైకాపా ప్రభుత్వం మూడు నెలలపాటు లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేసింది. ఏప్రిల్, మే, జూన్‌ నెలల్లో వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక అనారోగ్య బాధితులు ఎర్రటి ఎండలో సచివాలయాలు, బ్యాంకుల వద్దకు తిరిగేందుకు ఇబ్బందులు పడ్డారు. నాటి వైకాపా ప్రభుత్వం సకాలంలో బ్యాంకుల్లో నగదు జమ చేయకపోవడంతో.. నిరీక్షించాల్సి వచ్చింది. జగన్‌ ప్రభుత్వం తమ వైఫల్యాన్ని.. నాటి ప్రతిపక్షం తెదేపాపై నెట్టి రాజకీయ పబ్బం గడుపుకొనేందుకు యత్నించింది. ప్రస్తుత పంపిణీతో.. ఆ కుట్రలు బట్టబయలయ్యాయి.

ఉత్సాహంగా కదిలి...

పురపాలకశాఖ మంత్రి నారాయణ నెల్లూరు నగరంలోని 13వ డివిజన్‌ యలమలవారిదిన్నెలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డితో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. వినాయకుడి గుడిలో పూజల అనంతరం.. పింఛన్లు పంపిణీ చేశారు. జెండావీధి, కపాడిపాళెం, వెంకటేశ్వరపురంలో నగదు అందజేశారు. అనంతరం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డితో కలిసి కల్లూరుపల్లి హౌసింగ్‌బోర్డు కాలనీలో పింఛన్లు పంపిణీ చేశారు. దేవాదాయశాఖ మంత్రి ఏఎస్‌పేట మండలం హసనాపురం, చిరమన, ఏఎస్‌పేట, సంగం మండలం సిద్ధీపురం, సంగంలో పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు.

నెల్లూరు: తెల్లవారుజామున 5.30కే విధుల్లో సచివాలయ ఉద్యోగులు

ఆనంద బాష్పాలు చూశా

పొంగూరు నారాయణ, మంత్రి

ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉన్నా.. లబ్ధిదారుల శ్రేయస్సు దృష్ట్యా.. ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రూ. ఏడు వేల పింఛను అందజేశారు. వికలాంగులకు గతంలో ఇస్తున్న రూ. 3వేలను.. రెట్టింపు చేసి, రూ. 6వేలు చేశారు. ఆ సొమ్ము అందుకుంటున్నప్పుడు సామాజిక పింఛనుదారుల కళ్లలో ఆనంద బాష్పాలు చూశా. ప్రజలందరి తరఫున సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు.

నెల్లూరు: వృద్ధురాలికి పింఛను పింపిణీచేస్తున్న మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి

ఆర్థిక ఇబ్బందులు ఉన్నా...

వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎంపీ

ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. పింఛను నగదు పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుదే. రాష్ట్రంలో ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. గత వైకాపా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రం అన్ని రకాలుగా దివాళా తీసింది. అనుభవజ్ఞుడైన చంద్రబాబునాయుడు.. చెప్పిన మాట ప్రకారం జులైలో అవ్వా తాతలకు రూ. 7వేల పింఛను ఇంటింటికీ అందించారు.

ఒకే కుటుంబానికి రూ. 22వేలు

ఆ దంపతులది అసలే వృద్ధాప్యం.. భార్య పక్షవాతంతో మంచానికే పరిమితమవగా- భర్త ఏ పనీ చేయలేని పరిస్థితి. మందులకు సరిపడా డబ్బులేక.. ఆదుకునేవారు కానరాక.. జీవనం భారంగా సాగుతోంది.. ఇదీ వరికుంటపాడు మండలం ఆండ్రావారిపల్లెకు చెందిన ఆండ్రా పంధాములు, అరుణ దంపతుల పరిస్థితి. సోమవారం అరుణకు రూ. 15వేలు, పరంధాములుకు రూ. ఏడువేలు.. మొత్తంగా పింఛను రూ. 22 వేలు చేతికొచ్చింది. దాంతో దీనావస్థలో ఉన్న మమ్మల్ని ఆదుకున్న దేవుడు చంద్రబాబునాయుడు అని, ఆయన రుణం తీర్చుకోలేనిదని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

న్యూస్‌టుడే, వరికుంటపాడు

చరిత్రాత్మకం: ఆనం రామనారాయణరెడ్డి, దేవాదాయశాఖ మంత్రి

పింఛనుదారుల ఇళ్ల వద్దకే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సహా.. రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు ఉదయాన్నే వెళ్లి పింఛన్లు అందించడం చరిత్రాత్మకం. ఇది చరిత్రలో కలకాలం నిలిచిపోతుంది. వైకాపా ప్రభుత్వ అనాలోచిత, దురుద్దేశపూరక నిర్ణయం, అసమర్థత కారణంగా గత రెండు నెలల్లో పింఛను లబ్ధిదారులు 33 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల వద్దకే పింఛన్లు.. అదీ వందశాతం పంపిణీ చేయడం సాధ్యమవుతుందని ఇప్పుడు రుజువైంది.

న్యూస్‌టుడే, సంగం

ఏఎస్‌పేటలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి..

ఉదయం 5.30 గంటలకే ప్రారంభించాం

ఎం.హరినారాయణన్, కలెక్టర్‌

ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు వందశాతం పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశాం. జిల్లా వ్యాప్తంగా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, దివ్యాంగులు తీవ్ర అనారోగ్య బాధితులు.. ఇలా అన్ని రకాల కేటగిరీలు కలిపి మొత్తం 3,13,757 మందికి పంపిణీని ఉదయం 5.30 గంటలకే ప్రారంభించాం. లబ్ధిదారుల బయోమెట్రిక్‌ తీసుకుని సొమ్ము అందించాం.

ప్రక్రియను పర్యవేక్షిస్తున్న కలెక్టర్‌

సీఎంకు రుణపడి ఉంటా: కృష్ణమూర్తి ఆచార్య, నెల్లూరు

బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చి.. కాళ్లు దెబ్బతిన్నాయి. పింఛను రూ. ఏడువేలు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబునాయుడుకు రుణపడి ఉంటా. గతంలో బంగారుపని చేసేవాణ్ని. ప్రస్తుతం ఏ పనులు చేసుకోలేక మంచంపైనే ఉంటున్నా. ప్రభుత్వం ఇచ్చే డబ్బు మందులకు ఎంతో ఉపయోగపడతాయి. గతంలో రూ. మూడు వేలు ఇచ్చేవారు.. ఇప్పుడు పెంచి ఇవ్వడం.. మాకెంతో ప్రయోజనకరం.

హామీ నిలుపుకోవడం గొప్పవిషయం

సుబ్బారావు, మర్రిపాడు

గతంలో వృద్ధాప్య పింఛను రూ. 3వేలు వచ్చేది. ఎన్డీయే కూటమి ఎన్నికల సమయంలో చెప్పిన విధంగా రూ. నాలుగు వేలకు పింఛను పెంచడంతో పాటు మూడు నెలలకు సంబంధించిన రూ.మూడు వేలు కలిపి రూ. ఏడు వేలు ఇవ్వడం సంతోషదాయకం. చంద్రబాబుకు కృతజ్ఞతలు.

ఎంతో ఆనందంగా ఉంది:  అనసూయమ్మ, నెల్లూరు

ఒకేసారి రూ.7వేల పింఛను ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. మందులకు చాలా ఉపయోగపడతాయి. గత ప్రభుత్వంలో ఏడాదికి రూ. 250 చొప్పున అయిదేళ్లు పెంచుతూ.. గత ఆరు నెలల నుంచి రూ.3వేలు ఇచ్చారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే పెంచిన పింఛనుతో పాటు గత మూడు నెలలు కలిపి రూ.7వేలు ఇచ్చారు. ఆయన రుణం తీర్చుకోలేనిది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని