logo

మాటలతో సరి.. గాలికొదిలేశారు మరి

సర్వేపల్లి జలాశయంపై వైకాపా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించింది. సుమారు 40వేల ఎకరాలకు సాగునీరందించే ఈ కీలక నీటి వనరు ఆధునికీకరణ పూర్తిపై కనీస శ్రద్ధ పెట్టలేకపోయింది.

Updated : 02 Jul 2024 05:43 IST

వైకాపా పాలనలో ‘సర్వేపల్లి’పై కొరవడిన శ్రద్ధ

దెబ్బతిన్న జలాశయం కట్ట

పేరు: సర్వేపల్లి జలాశయం

సామర్థ్యం: 1.74 టీఎంసీలు

ఆయకట్టు: సుమారు 40వేల ఎకరాలు

ఆధునికీకరణకు నిధులు: రూ. 11.11 కోట్లు

పూర్తయిన పనులు: 40 శాతం

పనుల స్థితి: అసంపూర్తి 

న్యూస్‌టుడే, వెంకటాచలం: సర్వేపల్లి జలాశయంపై వైకాపా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించింది. సుమారు 40వేల ఎకరాలకు సాగునీరందించే ఈ కీలక నీటి వనరు ఆధునికీకరణ పూర్తిపై కనీస శ్రద్ధ పెట్టలేకపోయింది. ఫలితంగా మూడేళ్లలో కేవలం 40శాతం కూడా పూర్తికాకపోగా- చేసినవి కూడా దెబ్బతినే పరిస్థితి నెలకొంది.

వైకాపా ప్రభుత్వ హయాంలో రిజర్వాయరు ఆధునికీకరణకు రూ. 11.11 కోట్లు మంజూరు చేసినా.. అవి పేరుకే అన్నట్లు కాలం వెల్లదీశారు. టెండరు దక్కించుకున్న గుత్తేదారుడు మూడేళ్ల కిందట పనులు ప్రారంభించినా.. తర్వాత వాటిలో పురోగతి మాత్రం లేదు. రెండో పంటకు సాగునీరు పేరుతో నిలిపివేశారు. నిజానికి 2022 ఆగస్టులోనే పనులు పూర్తి చేయాల్సి ఉండగా- కాలేదు. తర్వాత వరుసగా రెండు సార్లు ఏడాది చొప్పున గడువు పెంచారు. అయినప్పటికీ మట్టి కట్ట పనులతో మమ అనిపించారు. 40శాతం పనులు కూడా పూర్తి కాలేదు. పనుల ఆలస్యంపై ఆందోళన నెలకొంది.

వర్షాలొస్తున్నాయంటే.. వణుకే..

రిజర్వాయరు ఆనకట్ట బలహీనంగా ఉండటం.. కట్ట పనులు పూర్తికాకపోవడంతో.. వర్షాలొస్తున్నాయంటే.. రైతులు, సమీప గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు. గత ఏడాది వర్షాకాలంలో రిజర్వాయరులోకి భారీగా నీరు చేరింది. దాంతో కట్ట కొంత మేరకు కోసుకుపోయి ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులు మరమ్మతులు చేయించడంతో ప్రమాదం తప్పింది. ప్రస్తుతం కట్ట అదే పరిస్థితిలో ఉంది. పనుల్లో జాప్యం, నిలుపుదలతో ఇప్పటి వరకు చేసిన పనులు పాత స్థితికే చేరుకున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వచ్చే నెలలో ప్రారంభిస్తాం

ప్రసాద్, నీటిపారుదలశాఖ ఏఈ

రెండో పంటకు సాగునీటి విడుదలతో పనుల నిర్వహణకు ఆటంకం ఏర్పడింది. 40శాతానికిపైగా పూర్తయ్యాయి. కొంత మేరకు కట్ట పనులు, కట్ట కింద రోడ్డు నిర్మాణం, కి.మీ. మేర రివిట్‌మెంట్‌ చేయాల్సి ఉంది. ప్రస్తుతం కూడా రిజర్వాయరులో నీరుంది. తగ్గిన తర్వాత ఆగస్టులో తిరిగి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటాం.
‘2015లో వచ్చిన వర్షాలకు కట్ట పూర్తిగా బలహీనపడి.. ఒక వైపు తెగే పరిస్థితి వచ్చింది.  కలుజులు ధ్వంసం చేసి.. నీటిని బయటకు పంపడంతో రైతులు, సమీప గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఆ సమయంలో నాటి, నేటి ప్రస్తుత సీఎం చంద్రబాబునాయుడు వచ్చి రిజర్వాయరును పరిశీలించారు. తర్వాత కట్టకు తాత్కాలిక మరమ్మతులు చేయించారు. అప్పట్లో కట్ట పటిష్ఠపరిచే పనులకు రూ. నాలుగు కోట్లు మంజూరు చేయగా.. టెండరు దశ దాటలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని.. రిజర్వాయరుకు కొత్త రూపు తీసుకువచ్చి రైతుల ప్రయోజనాలు కాపాడుతారన్న ఆకాంక్ష వ్యక్తమవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని