logo

పేద విద్యార్థులకు వరం.. వసతి గృహం

గతనెల 13న ప్రభుత్వ పాఠశాలలతోపాటు కళాశాలలు తెరుచుకున్నాయి. వీటితోపాటు అన్ని వసతి గృహాలు ప్రారంభించారు.

Updated : 02 Jul 2024 03:28 IST

అందుబాటులో 20,516 సీట్లు
దరఖాస్తుల ఆహ్వానం
న్యూస్‌టుడే, నెల్లూరు(విద్య)

గతనెల 13న ప్రభుత్వ పాఠశాలలతోపాటు కళాశాలలు తెరుచుకున్నాయి. వీటితోపాటు అన్ని వసతి గృహాలు ప్రారంభించారు. వసతి గృహాలను సద్వినియోగం చేసుకోవాలంటూ బీసీ, ఎస్సీ సంక్షేమశాఖ, గురుకులాల అధికారులు, సిబ్బంది ప్రచారం నిర్వహిస్తున్నారు. అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, ఓసీ,  మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థుల నుంచి జులై 15వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

సౌకర్యాలు ఇలా..

సంక్షేమ వసతి గృహాల్లో ఉండే విద్యార్థుల డైట్‌ ఛార్జీల నిమిత్తం ప్రభుత్వం మూడు, నాలుగు తరగతుల విద్యార్థులకు నెలకు రూ.1,150 చొప్పున కేటాయిస్తోంది.ఐదు నుంచి పదో తరగతి విద్యార్థులకు రూ.1,400 వంతున, ఇంటర్‌ నుంచి పీజీ వరకు రూ.1,600 చొప్పున అందిస్తుంది. కాస్మోటిక్‌ ఛార్జీల కింద మూడు నుంచి ఆరు తరగతుల వారికి నెలకు బాలురకు రూ.125, బాలికలకు రూ.130, 7వ తరగతి నుంచి 10వ తరగతుల బాలురకు రూ.150, బాలికలకు రూ.200, ఇంటర్‌ ఆపైన బాలురకు రూ.200, బాలికలకు రూ.250 చొప్పున అందిస్తున్నారు.

గురుకులాల్లో డిమాండ్‌

జిల్లాలోని 8 గురుకులాలు ఉంటే కేవలం బాలికలకే విద్యాబోధన, వసతి గృహాలు నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆరు గురుకులాల్లో 5వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు, రెండు గురుకులాల్లో 5 నుంచి 10వ తరగతి వరకు బోధనతోపాటు వసతి ఉంది. ఇక్కడ బాలికలకు పూర్తి రక్షణ, ఉత్తమ విద్యాబోధన అందడంతో గురుకులాల్లో సీట్లకు పేద విద్యార్థులు పోటీ పడుతున్నారు. ఇటీవల ప్రతిభా పరీక్ష నిర్వహించిన అధికారులు అన్ని గురుకులాల్లో 4,800 సీట్లు ఉంటే వాటిలో 4,707 మెరిట్‌ ఆధారంగా భర్తీ చేశారు.

జిల్లా వ్యాప్తంగా 158

జిల్లాలో ఎస్సీ, బీసీ, సంక్షేమశాఖల పరిధిలో ప్రీ మెట్రిక్, పోస్ట్‌ మెట్రిక్‌ కలుపుకొని 158 వసతి గృహాలు ఉన్నాయి. వీటిలో ఎస్సీ సంక్షేమ వసతి గృహాల్లో ఒక్కోదానిలో వంద చొప్పున, బీసీ వసతి గృహాల్లో ప్రీ మెట్రిక్‌లో 115, పోస్టుమెట్రిక్‌లో వంద చొప్పున, గురుకులాల్లో ఒక్కో తరగతికి 80 చొప్పున మొత్తం 20,516 సీట్లు అందుబాటులో ఉన్నాయి. బాల బాలికలకు వేర్వేరుగా వసతి గృహాలు నిర్వహిస్తున్నారు. బీసీ సంక్షేమ శాఖ పరిధిలో ప్రతిభ ఆధారంగా సీట్లు భర్తీ చేస్తున్నారు.

వంద శాతం భర్తీకి చర్యలు

బీసీ, ఎస్సీ సంక్షేమ శాఖల పరిధిలోని వసతి గృహాల్లో వంద శాతం సీట్ల భర్తీకి చర్యలు చేపడుతున్నాం. గ్రామాల్లోని ప్రజలకు, పాఠశాలల్లోని విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం. నిబంధనల మేరకు విద్యార్థులను చేర్చుకుంటున్నాం.

వెంకటయ్య, బీసీ సంక్షేమశాఖ అధికారి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని