logo

స్పందిస్తేనే.. పరిష్కారం

నెల్లూరులోని కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’కు ప్రజలు తరలివచ్చి అధికారులకు అర్జీలు అందించారు.

Published : 02 Jul 2024 02:46 IST

నెల్లూరు(కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: నెల్లూరులోని కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’కు ప్రజలు తరలివచ్చి అధికారులకు అర్జీలు అందించారు. తాము దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అయిదేళ్ల వైకాపా ప్రభుత్వంలో న్యాయం జరగలేదని.. కూటమి ప్రభుత్వంలో సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారు.

వాలంటరీ వ్యవస్థ కొనసాగించండి

ఎస్‌కే హఫీజా, సద్దాం, మాహీర్, సిరాజ్, సుమయ్య, కరిష్మా, షాకీరా

అయిదేళ్లుగా 42వ వార్డులోని సచివాలయంలో వాలంటీర్లుగా పని చేస్తున్నాం. ప్రస్తుతం మాకు విధులు అప్పగించలేదు. కరోనా కాలంలో ప్రాణాలను లెక్కచేయకుండా పనిచేశాం. ఎన్నికల సమయంలో పార్టీల ఒత్తిడితో చాలా మంది రాజీనామా చేశారు. కొంతమంది చంద్రబాబు చెప్పినట్లుగానే నడుచుకున్నారు. వాలంటరీ వ్యవస్థను కొనసాగించండి.

పది వేల మంది ఉపాధి కోల్పోయారు

సంజయ్‌కుమార్, సుధీర్, చిన్న ఆంజనేయులు, వెంకయ్య సుధాకర్‌రెడ్డి, ఇర్ఫాన్‌

కృష్ణపట్నం పోర్టు కంటైనర్‌ టెర్మినల్‌ పొరుగు రాష్ట్రానికి తరలిపోవడం బాధాకరం. వెంటనే యథావిధిగా కొనసాగేలా చర్యలు చేపట్టాలి. పోర్టు కోసం అనేక మంది రైతులు వారి పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని, అభివృద్ధి జరుగుతుందని ఆశించి పొలాలను అప్పగించారు. పోర్టు అదానీ హస్తగతమైన తర్వాత కంటైనర్‌ టెర్మినల్‌ ఎన్నూర్‌కు తరలించడం బాధాకరం. సుమారు పది వేల మంది ఉపాధి కోల్పోయారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం రూ.10వేలు కోట్లు పక్క రాష్ట్రాలకు తరలిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చొరవ తీసుకుని కృష్ణపట్నం పోర్టును బతికించాలి.

ప్రమాదకర చట్టం రద్దు చేయాలి

కె.సురేష్, ఎంవీ రాజా, పి.మురళి

ఆటో, రవాణా రంగంలో ఉన్న డ్రైవర్లకు ప్రమాదకరంగా మారిన హిట్‌ అండ్‌ రన్‌ సెక్షన్‌ను రద్దు చేయాలి. ఈ క్రిమినల్‌ చట్టం వల్ల అనుకోకుండా ప్రమాదం జరిగి మరణం సంభవిస్తే ఆ డ్రైవరుకు పదేళ్ల జైలుశిక్ష, రూ.10 లక్షల జరిమానా విధిస్తూ చట్టం చేశారు. డ్రైవర్లందరికీ ప్రమాదకరంగా మారిన చట్టాన్ని రద్దు చేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని