logo

తిప్పలు మింగిన తోడేళ్లు

వైకాపా ప్రభుత్వంలో అన్నింటా అక్రమాలు జరిగాయి. అక్రమం జరగని చోటంటూ లేదు. ఇసుక దోపిడీ చేశారు. కొండలు కొల్లగొట్టారు. మట్టి అక్రమ రవాణా చేసి కోట్ల రూపాయలకు పడగలెత్తారు.

Updated : 01 Jul 2024 05:59 IST

వైకాపా నేతల అక్రమంతో కరిగిన కొండలు
న్యూస్‌టుడే, నెల్లూరు(గ్రామీణం), ఆత్మకూరు

వైకాపా ప్రభుత్వంలో అన్నింటా అక్రమాలు జరిగాయి. అక్రమం జరగని చోటంటూ లేదు. ఇసుక దోపిడీ చేశారు. కొండలు కొల్లగొట్టారు. మట్టి అక్రమ రవాణా చేసి కోట్ల రూపాయలకు పడగలెత్తారు. అడ్డుకోవాల్సిన అధికారగణం వైకాపా నాయకులకు అండగా నిలిచింది. స్థానికులు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు. ముఖ్యంగా ఆత్మకూరు, ఉదయగిరి, సర్వేపల్లి నియోజకవర్గాల్లో కొండలు తవ్వి గ్రావెల్‌ అక్రమ రవాణా చేశారు. గిరులు ఆనవాళ్లు కోల్పోయినా.. అధికారుల్లో చలనం లేదు. కొన్నిచోట్ల ఇప్పటికీ జరుగుతుండటం గమనార్హం.

మారని అధికారుల తీరు

తిప్పలను కొల్లకొట్టి రూ.కోట్లు దోచేసిన వైకాపా నాయకులకు అధికారులు ఇంకా అండగా ఉన్నారా? అంటే అవుననేలా పరిస్థితులు ఉన్నాయి. గత వైకాపా ప్రభుత్వ కాలంలో బరితెగించి తిప్పలను కొల్లగొడుతున్న నాయకులపై స్థానికులు ఫిర్యాదు చేశారు. అధికారుల్లో కదలిక లేకపోవడతో లోకాయుక్త వరకు తీసుకువెళ్లారు. విధిలేక కదిలిన అధికారులు దాడులు చేసి జరిమానా వేశారు. అయినా అక్రమాలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నా పట్టించుకోలేదు. ప్రభుత్వం మారింది అయినా అధికారుల పంథా మారలేదు. వారికి రక్షణగానే ఉన్నారు.

సంగం మండలంలో రూ.కోట్ల విలువైన మట్టి తవ్వకాలు చేశారు. అనంతసాగరం మండలంలోని మంచాలపల్లి తిప్పను సమీప గ్రామాల వైకాపా నాయకులు, చేజర్ల మండలంలోని మాముడూరు తిప్పను స్థానిక వైకాపా నాయకులు తవ్వేశారు. వీరు ఎన్ని అక్రమాలు చేసినా అధికారులు వారికి సహకారమే అందించారు.  

రాత్రుల్లో కూడా..

సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు, వెంకటాచలం మండలాల్లోని తిప్పలను తవ్వేశారు. అక్రమ తవ్వకాలపై విమర్శలు వెల్లువెత్తడంతో ఆపినట్లు కనిపించినా రాత్రుల్లో అక్రమ తవ్వకాలు చేశారు. రెండు నియోజకవర్గాల్లో తిప్పలను తవ్వి రూ.వందల కోట్ల విలువైన గ్రావెల్‌ వైకాపా నాయకులు కొల్లగొట్టారు.

చర్యలు తీసుకుంటాం

పెరమన తిప్ప అక్రమ తవ్వకాల్లో గతంలో వేసిన రూ.40.8 లక్షల జరిమానా, రెవెన్యూ రికవరీ యాక్ట్‌ ద్వారా జరిమానాలు వసూలు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. కొరిమెర్ల విషయం విజిలెన్స్‌ పరిధిలో ఉంది.

శ్రీనివాసరావు ఏడీ, గనులు, భూగర్భవనరుల శాఖ 

ఇది పెరమన తిప్పపై తవ్వకాలు చేసిన ప్రాంతం. గ్రామానికి చెందిన వైకాపా నాయకుడే గోరంత అనుమతి తీసుకొని కొండంతా తవ్వేశారు. స్థానికుల ఫిర్యాదుతో గనులశాఖ అధికారులు పరిశీలించి అక్రమ తవ్వకాలు నిజమేనని నిర్ధారించి రూ.40 లక్షల పైనే జరిమానా విధించారు.

ఈ చిత్రంలోనిది కొరిమెర్ల తిప్ప పరిధిలో అక్రమ తవ్వకాలు చేసిన ప్రాంతం. సంగానికి చెందిన వైకాపా నాయకులు అక్రమంగా తవ్వకాలు చేశారు. అధికారులు దాడులు చేసి తవ్వకాలు చేస్తున్న పొక్లయిన్లు, టిప్పర్లు పట్టుకొన్నారు. మట్టి తోలిన లెక్కల పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి ఆధారంగా అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికీ చర్యలు లేవు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని