logo

తెల్లని రూపం.. సేవలకు ప్రతిరూపం

వైద్యులు దేవుడితో సమానమంటారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎందరికో ప్రాణభిక్ష పెడుతున్నారు. అలాంటి వారికి చేతులెత్తి నమస్కరిస్తుంటారు. కొందరు డాక్టర్లు నామమాత్రపు రుసుంతో వైద్య సేవలు అందిస్తున్నారు.

Published : 01 Jul 2024 05:20 IST

నేడు జాతీయ వైద్యుల దినోత్సవం
న్యూస్‌టుడే, నెల్లూరు(క్రీడలు), ఆత్మకూరు, కోవూరు

వైద్యులు దేవుడితో సమానమంటారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎందరికో ప్రాణభిక్ష పెడుతున్నారు. అలాంటి వారికి చేతులెత్తి నమస్కరిస్తుంటారు. కొందరు డాక్టర్లు నామమాత్రపు రుసుంతో వైద్య సేవలు అందిస్తున్నారు. ఇంకొందరు గ్రామాలు, పాఠశాలల్లో అవగాహన, చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తూ వ్యాధులు దూరం చేస్తున్నారు. పలువురు పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తూ స్ఫూర్తిగా
నిలిచారు.

అవగాహన కార్యక్రమాల్లో దిట్ట

చైతన్య గీతాలు ఆలపిస్తున్న డాక్టరు శ్రీనునాయక్‌

నెల్లూరు డాక్టరు రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాలకు చెందిన డాక్టరు శ్రీనునాయక్‌ సేవాభావంతో వైద్యసేవలు అందిస్తున్నారు.. నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆయన తక్కువ ఖర్చుతో నమ్మకమైన వైద్యం అందించాలనే డాక్టరు రామచంద్రారెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రథమ చికిత్స గురించి పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రజారోగ్య చైతన్య గీతాలను స్వయంగా రచించి పాడి  అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రజలు కాలానుగుణ వ్యాధుల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఆయన తన పాటల ద్వారా గ్రామాల్లో పర్యటించి వివరిస్తున్నారు. ప్రొజెక్టరు ద్వారా రాత్రుల్లో గ్రామాల్లో వైద్యం పట్ల అవగాహన కల్పిస్తున్నారు. మొక్కలు నాటి వాతావరణ కాలుష్యాన్ని నివారణలో చురుకుగా పాల్గొంటున్నారు. పాఠశాలల్లో సైన్స్‌ పాఠాలను గురించి వివరిస్తున్నారు. ఇప్పటివరకు రెండు వేల మొక్కలు నాటించారు. 60 గ్రామాల్లో, 150కి పైగా పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

సమాజ హితుడు

అవగాహన కార్యక్రమంలో డాక్టర్‌ కాలేషా

అల్లూరుకు చెందిన డాక్టర్‌ కాలేషా 2012 నుంచి జిల్లా ప్రభుత్వాస్పత్రిలో వైద్యులుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. వృత్తిపరంగా పేరు సాధించి సమాజం కోసం తనవంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ముఖ్యంగా ప్రజల్లో అజ్ఞానాన్ని తొలగించి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడమే ఈయన ముఖ్య ఉద్దేశం. ఇప్పటికీ అవగాహన కార్యక్రమాలు, రక్తదాన, వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 50కి పైగా ఉచిత వైద్య శిబిరాలు, 20కి పైగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు.

పేదలకు కార్పొరేట్‌ వైద్యం..

చికిత్స చేస్తున్న డాక్టర్‌ గౌస్‌బాషా

నెల్లూరులో చిన్నపిల్లల వైద్యులు డాక్టర్‌ గౌస్‌బాషా కార్పొరేట్‌ ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేస్తూనే వెంగళరావునగర్‌లోని సొంతిట్లోనే క్ల్లినిక్‌ ఏర్పాటు చేసుకున్నారు. కరోనా కష్టకాలంలోనూ ఆయన వైద్యసేవలుతో పాటు ఎంతో మందికి వాట్సాప్‌లోనే టెలీ మెడిసిన్‌ అందించారు. కరోనా సెకండ్‌ వేవ్‌లో చికిత్స అందించాల్సిన వైద్యులు పలువురు భయపడి ఇళ్లకే పరిమితమయ్యారు. గౌస్‌బాషా భయపడకుండా ఇంట్లోనే వైద్యం అందించారు. ఎంతో మంది చిన్నపిల్లలకు సేవలు చేశారు. డెంగీ వంటి విష జ్వరాల వైద్యానికి కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో రూ.లక్షల్లో బిల్లులు అవుతాయి. ఇక్కడ నామమాత్రపు రుసుం తీసుకుని వ్యాధి నయంచేస్తారు.

40 వేల శస్త్రచికిత్సలు

ప్రభుత్వం రంగంలో డాక్టర్‌గా ఉన్న శార్వాణి.. సేవలు చేస్తూ ఆదర్శంగా నిలిచారు. ప్రస్తుతం ఆత్మకూరు జిల్లా వైద్యశాలలో నేత్ర వైద్యురాలిగా ఉన్నారు. ప్రభుత్వ సేవలతో పాటు ఎన్‌జీవో, రోటరీ క్ల్లబ్‌ నెల్లూరు, సింహపురిసేవా సమితి ఆధ]్వర్యంలో చేపట్టే వైద్య శిబిరాలలో పేదలకు ఆపరేషన్లు చేస్తున్నారు. 18 సవవత్సరాల కాలంలో దాదాపు 40వేల శస్త్రచికిత్సలు చేశారు. ఉచిత కంటి వైద్య శిబిరాలలో సేవలు అందించినందుకు సన్మానాలు, ప్రశంసాపత్రాలు అందుకున్నారు. సేవలకు గుర్తింపుగా 2016లో ఉత్తమ కంటి వైద్యసేవల అవార్డును అప్పటి మంత్రి నారాయణ చేతుల మీదుగా అందుకున్నారు. 2019, 2022లో ఉత్తమ సేవా పురస్కారాలు వరించాయి.

శార్వాణి, కంటి వైద్యనిపుణురాలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు