logo

గంజాయి గుప్పు.. ఏదీ కనువిప్పు!

నెల్లూరు నగరంలో కొంత కాలం కిందట ఇద్దరు సోదరులు(కవలలు) ద్విచక్ర వాహనంపై వేగంగా వెళుతూ.. ఓ చిన్నారిని ఢీకొట్టారు. దాన్ని గమనించిన ఓ అపార్ట్‌మెంట్‌ వాచ్‌మెన్‌ పరిగెత్తుకు వెళ్లి.. ఆ చిన్నారిని పైకెత్తుతూ.. ద్విచక్ర వాహనదారులను చూసుకుని వెళ్లాలంటూ సూచించారు.

Updated : 30 Jun 2024 05:06 IST

చాప కింద నీరులా విక్రయాలు
విస్తరించిన ముఠాలు.. పెరుగుతున్న నేరాలు

  • నెల్లూరు నగరంలో కొంత కాలం కిందట ఇద్దరు సోదరులు(కవలలు) ద్విచక్ర వాహనంపై వేగంగా వెళుతూ.. ఓ చిన్నారిని ఢీకొట్టారు. దాన్ని గమనించిన ఓ అపార్ట్‌మెంట్‌ వాచ్‌మెన్‌ పరిగెత్తుకు వెళ్లి.. ఆ చిన్నారిని పైకెత్తుతూ.. ద్విచక్ర వాహనదారులను చూసుకుని వెళ్లాలంటూ సూచించారు. దానికి తీవ్ర కోపోద్రిక్తులైన ఆ ఇద్దరు సోదరులు.. ఆవేశంతో ఊగిపోతూ.. ఆ వాచ్‌మెన్‌పై దాడికి పాల్పడ్డారు. దాంతో ఆయన చనిపోయారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులు ఇద్దరూ గంజాయి తీసుకున్నారని తెలిసి ఆశ్చర్యపోయారు. వారిద్దరూ పోలీసుశాఖలో పనిచేసే ఓ ఉద్యోగి కుమారులు కావడం గమనార్హం. 
  • మూడు నెలల కిందట నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్‌లో దిగిన ఓ మహిళ నడుచుకుంటూ బయటకు వస్తున్నారు. రాత్రి కావడంతో జనసంచారం తక్కువగా ఉంది. ఆ సమయంలో వెనుక నుంచి వచ్చిన ఓ యువకుడు.. ఆమె దగ్గరున్న సంచి లాక్కుని వెళ్లేందుకు యత్నించాడు. ప్రతిఘటించగా.. తన దగ్గరున్న బ్లేడులాంటి ఆయుధంతో దాడి చేశాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందగా.. ఆ తర్వాత ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. గంజాయి వాడే వ్యక్తిగా గుర్తించారు. 

ఈనాడు, నెల్లూరు: అయిదేళ్ల కిందటి వరకు గంజాయి అనే పేరు సింహపురిలో ఎప్పుడోగానీ వినిపించేది కాదు. వైకాపా పాలన పుణ్యమా అని జిల్లా దాని విక్రయాలకు కేంద్రంగా మారింది. విశాఖపట్టణం, ఉభయగోదావరి జిల్లాలోని అటవీ ప్రాంతం నుంచి చెన్నైకు తీసుకువెళుతున్న నిల్వలకు నెల్లూరు అడ్డాగా తయారైంది. ఆ క్రమంలో స్థానికంగా విచ్చలవిడిగా దొరుకుతుండటం..  ముఖ్యంగా కొందరు యువత, తెలిసీ తెలియని వయసులో మరికొందరు విద్యార్థులు దానికి బానిసలుగా మారుతున్నారు. నేరాలకు పాల్పడుతూ భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా.. గత ప్రభుత్వ పాలకులకు చీమ కుట్టినట్లైనా లేదు. కట్టడికి కనీస చర్యలు తీసుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

విక్రేతలు.. వినియోగదారులు.. యువతే!

నగరంలో గంజాయి వ్యాపారం జోరుగా సాగుతోంది. ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఇక్కడకు తీసుకొచ్చి.. విక్రయిస్తున్నారు. సాధారణంగా గంజాయి ఘాటైన వాసన వస్తుంది. దాంతో సరఫరా సమయంలో పోలీసులకు చిక్కే ప్రమాదం ఉందని ప్యాకింగ్‌ చేసి.. అత్తరు, పౌడరు వంటి సుగంధాలను వెదజల్లేవాటిని పూసి.. రవాణా చేస్తున్నట్లు సమాచారం. రెండు సిగరెట్లలో కూర్చడానికి సరిపోయే గంజాయి పొట్లం ధర సుమారు రూ. 50 ఉంటుందని, కిలో సరకు అమ్మితే.. రూ. 6000 నుంచి రూ. 7వేల ఆదాయం వస్తుండటంతో.. విద్యార్థులే విక్రేతల అవతారం ఎత్తుతున్నారు. 

పట్టుబడుతోంది.. పాత్రధారులే!

గంజాయి మత్తు జిల్లాను కబళిస్తోంటే.. దాన్ని కట్టడి చేయాల్సిన అధికారులు.. గడిచిన అయిదేళ్లలో ఒక్క ముఠాను పట్టుకోకపోవడం వారి పనితీరుకు అద్దం పడుతోంది. ఇప్పటి వరకు పట్టుకున్నట్లు చూపిన వారంతా పాత్రధారులే కావడం గమనార్హం. నాటి అధికార పార్టీకి గిట్టని వారు, రాజకీయ ప్రత్యర్థులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టేవారిని అక్రమ కేసులతో వేధించడంలో తలమునకలైన పోలీసులు.. ఇక గంజాయి కట్టడికి సమయం ఎక్కడిదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాలోకి మద్యం అక్రమ రవాణా కాకుండా నియంత్రించేందుకు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(ఎస్‌ఈబీ)ను నెలకొల్పారు. గంజాయి సహా.. ఇతర మాదక ద్రవ్యాలు, ఎర్రచందనం స్మగ్లింగ్‌ నియంత్రణ తదితర బాధ్యతలు కూడా ఈ విభాగమే చూస్తోంది. పేరుకే తప్ప.. ప్రత్యేకంగా గంజాయి కట్టడిపై శ్రద్ధ చూపిన దాఖలాలు లేవు. 2023లో మొత్తం 27 కేసులు నమోదు చేయగా.. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఆరే ఉండటం అధికారుల పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోంది. 

దీనిపై సెబ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సూపరింటెండెంట్‌ బాబు శ్రీధర్‌ వివరణ కోరగా.. వివిధ రవాణా వాహనాల ద్వారా ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయి సరఫరా చేస్తున్నారు. దాన్ని నివారించేందుకు రూట్‌వాచ్, రైళ్లు, బస్సుల్లో తనిఖీలు చేస్తున్నాం. గంజాయిని తీసుకుంటే కలిగే దుష్ప్రభావాలపై ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఎక్కడైనా విక్రయిస్తుంటే.. పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. 

జిల్లాలో.. (సుమారుగా)!

గంజాయికి బానిసలైన వారు: 10,127
వారిలో 10-17 ఏళ్ల లోపు వారు: 726
మద్యం వ్యసనపరులు: 77,653
వారిలో బాలలు: 12,191 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని