logo

కక్షిదారులకు శాశ్వత పరిష్కారమే లోక్‌అదాలత్‌ లక్ష్యం

కక్షిదారులకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా లోక్‌అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయసేవాధికార సంస్థ ఛైర్‌పర్సన్‌ సి.యామిని స్పష్టం చేశారు.

Published : 30 Jun 2024 03:00 IST

రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానం 
లబ్ధిదారులకు రూ.6.35 కోట్ల పరిహారం 

చెక్కు అందజేస్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి యామిని, ఇతర జడ్జీలు

నెల్లూరు(లీగల్‌), న్యూస్‌టుడే: కక్షిదారులకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా లోక్‌అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయసేవాధికార సంస్థ ఛైర్‌పర్సన్‌ సి.యామిని స్పష్టం చేశారు. జాతీయ, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థల పిలుపు మేరకు.. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలో శనివారం ఆమె లోక్‌అదాలత్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇరువర్గాలు రాజీ ప్రక్రియ ద్వారా తమ కేసులు పరిష్కరించుకుంటే సత్వర, సమ న్యాయం లభిస్తుందన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గూడూరు, కోవూరు, కావలి, వెంకటగిరి, కోట, నాయుడుపేట, సూళ్లూరుపేట, ఆత్మకూరు, ఉదయగిరి, నెల్లూరు నగరంలో నిర్వహించిన లోక్‌ అదాలత్‌లో మొత్తం 3,201 కేసులు పరిష్కారం కాగా.. రూ.6,35,46,217 మేర లబ్ధిదారులకు పరిహారం లభించింది. జిల్లా కోర్టు ఆవరణలో మొత్తం ఏడు బెంచ్‌లు ఏర్పాటు చేయగా.. న్యాయమూర్తులు జి.కబర్ధీ, ఎస్‌.శ్రీనివాస్, పి.భరద్వాజా, ఎల్‌.శారదారెడ్డి, జి.దేవిక, టి.భాస్కర్, టి.సుయోధన్, ఎన్‌.లావణ్య ప్రిసైడింగ్‌ అధికారులుగా వ్యవహరించారు. 1658 క్రిమినల్, సివిల్, మోటార్‌ వాహన ప్రమాద, కుటుంబ వివాదాలు, బ్యాంక్, ఫైనాన్స్‌ తదితర కేసులు పరిష్కరించారు. జాతీయ లోక్‌అదాలత్‌లో కేసుల పరిష్కారంలో రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానం పొందింది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని