logo

బడి భోజనంపై ఆరా!

నెల్లూరు నగరం జెండా వీధిలోని పీఎన్‌ఎంసీ ఉన్నత పాఠశాలలో 396 మంది విద్యార్థులు ఉండగా- ఈ నెల 26వ తేదీ 275 మంది హాజరయ్యారు. వీరిలో మధ్యాహ్న భోజనం తిన్నది 48 మందే.. అంటే, హాజరైన విద్యార్థుల్లో 17 శాతం మందే బడిలో పెట్టే భోజనం తిన్నారు. 

Published : 30 Jun 2024 02:57 IST

తక్కువ శాతం నమోదుపై ప్రభుత్వం దృష్టి
50 పాఠశాలలకు షోకాజ్‌ నోటీసులు

నెల్లూరు నగరం జెండా వీధిలోని పీఎన్‌ఎంసీ ఉన్నత పాఠశాలలో 396 మంది విద్యార్థులు ఉండగా- ఈ నెల 26వ తేదీ 275 మంది హాజరయ్యారు. వీరిలో మధ్యాహ్న భోజనం తిన్నది 48 మందే.. అంటే, హాజరైన విద్యార్థుల్లో 17 శాతం మందే బడిలో పెట్టే భోజనం తిన్నారు. 

బీవీనగర్‌లోని కేఎన్‌ఆర్‌ ఎంసీహెచ్‌ పాఠశాలలో 1539 మంది చదువుతుండగా- గత బుధవారం 73శాతం అంటే.. 1131 మంది హాజరయ్యారు. వీరిలో 254 మంది మాత్రమే భోజనం చేశారు. మిగిలిన వారిలో చాలా మంది ఇళ్లకు వెళ్లగా.. దూరాభారం ఉన్నవారు క్యారేజీలు తెచ్చుకుని.. అక్కడే తిన్నారు. 

ఈనాడు, నెల్లూరు: విద్య, న్యూస్‌టుడే: పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తినేందుకు చాలాచోట్ల విద్యార్థులు ఇష్టపడటం లేదు. మెనూలో అనేక మార్పులు చేశామని గత ప్రభుత్వం గొప్పలు చెప్పినా.. క్షేత్రస్థాయిలో అది ప్రతిఫలించడం లేదు. అన్నం మెత్తగా, చప్పగా, ముద్దగా ఉంటోందని, తింటే కడుపు నొప్పి వస్తోందంటూ.. చాలా మంది పిల్లలు పాఠశాలల్లో భోజనం చేయడం లేదు. ఇంటి నుంచే తెచ్చుకుంటున్నారు. కొన్నిచోట్ల తల్లులే క్యారేజీలు తెచ్చి తినిపిస్తున్నారు. 90 శాతానికిపైగా పిల్లలు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో ఆ సంఖ్య తక్కువగానే ఉంటోంది. విద్యార్థుల హాజరుతో పాటే.. భోజనం తినేవారి సంఖ్యను ఆన్‌లైన్‌లో తీసుకుంటున్నారు. ఆ క్రమంలో కొన్నిచోట్ల పిల్లలను అడిగి హాజరువేస్తుండగా.. మరికొన్ని చోట్ల హాజరైన వారిలో ఎంతో కొంత తగ్గించి.. సంఖ్య పంపిస్తున్నారు. భోజనం చేసేవారి సంఖ్య తగ్గితే ఉపాధ్యాయులను వివరణ కోరే పరిస్థితి ఉండటంతో.. కొందరు కచ్చితంగా నమోదు చేయడం లేదు. ప్రస్తుతం ప్రభుత్వం మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఈ పరిస్థితిపై ఆరా తీస్తోంది. పాఠశాలల్లో భోజనం చేసేవారి సంఖ్య తగ్గితే.. దానికి కారణాలు తెలుసుకుంటోంది. ప్రతి విద్యార్థికి నాణ్యమైన భోజనం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో.. అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. 

వివరణ కోరుతూ...

జిల్లాలో మొత్తం 2,879 పాఠశాలలు ఉండగా- సుమారు 1.20 లక్షల మంది విద్యార్థులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వీరిలో శనివారం 1,08,713 మంది హాజరు కాగా, 1,05,272 మంది మధ్యాహ్న భోజనం తిన్నట్లు అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంటోందనే విమర్శలు నెలకొన్నాయి. ఈ నెల 26వ తేదీ మధ్యాహ్న భోజనానికి సంబంధించిన డ్యాష్‌బోర్డులో పాఠశాలలకు హాజరైన విద్యార్థుల్లో 90 శాతం కంటే తక్కువ మంది భోజనం చేసిన పాఠశాలలను విద్యాశాఖాధికారులు గుర్తించారు. దానిపై పూర్తి వివరాలతో వివరణ ఇవ్వాలని డీఈవో పీవీజే రామారావు ఆయా పాఠశాలలకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు. సంతృప్తికర వివరణ లేకపోతే.. తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

దీనిపై డీఈవో పీవీజే రామారావు వివరణ కోరగా.. పాఠశాలకు హాజరైన ప్రతి విద్యార్థి అక్కడే భోజనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా తినేవారి సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలలను గుర్తించి.. షోకాజ్‌ నోటీసులు ఇచ్చాం. వారి నుంచి వివరణ తీసుకున్న తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటాం. ఆహారం విషయంలో నాణ్యత పాటించకపోతే.. కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని