logo

బ్యాంకర్ల ఒత్తిడి.. లబ్ధిదారుల కంటతడి

బ్యాంకర్ల ఒత్తిడితో ఆత్మకూరు టిడ్కో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. పట్టణంలో గతంలో తెదేపా ప్రభుత్వం 1,056 గృహాలు నిర్మించింది. 2019 ఎన్నికల్లో వీటిని ఉచితంగా ఇస్తామని వైకాపా హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చినా.. ఇవ్వకుండా మూడేళ్లు కాలయాపన చేసింది.

Published : 30 Jun 2024 02:51 IST

ఆందోళన చేస్తున్న లబ్ధిదారులు

ఆత్మకూరు, న్యూస్‌టుడే: బ్యాంకర్ల ఒత్తిడితో ఆత్మకూరు టిడ్కో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. పట్టణంలో గతంలో తెదేపా ప్రభుత్వం 1,056 గృహాలు నిర్మించింది. 2019 ఎన్నికల్లో వీటిని ఉచితంగా ఇస్తామని వైకాపా హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చినా.. ఇవ్వకుండా మూడేళ్లు కాలయాపన చేసింది. లబ్ధిదారుల ఆందోళనతో చివరికి పంపిణీ చేసింది. లబ్ధిదారులు 430చదరపు అడుగుల ఇళ్లకు మొదట రూ.లక్ష చెల్లించారు. ఆ డిపాజిట్‌ను రూ.50వేలకు వైకాపా ప్రభుత్వం తగ్గించింది. రూ.లక్ష చెల్లించిన వారికి తగ్గించిన మొత్తం ఇప్పటి వరకు తిరిగివ్వలేదు.  430 చదరపు అడుగుల ఇళ్లను ఇచ్చేందుకు రూ.3,65,000 రుణాలు బ్యాంకర్లు ఇచ్చారు. అప్పటి నుంచి లబ్ధిదారులు తాము కట్టిన డబ్బులో మిగిలిన రూ.50వేలు అప్పునకు జమ చేసుకోవాలని కోరుతూనే ఉన్నారు. అయినా, పట్టించుకోవడం లేదు. 365 చదరపు అడుగుల గృహాలకు రూ.3,15,000 బ్యాంకర్లు రుణాలిచ్చారు. వీటికి రూ.50వేలు డిపాజిట్‌గా కొందరు కట్టారు. దాన్ని రూ.25వేలకు తగ్గించినట్లు వైకాపా ప్రభుత్వం చెప్పింది. రూ 50వేలు కట్టిన వారి సొమ్ము తిరిగివ్వలేదు. ఇలా చెల్లించిన సొమ్ము బ్యాంకు బకాయిలకు జమ చేయాలని కోరినా.. లబ్ధిదారుల మొర వినే నాథులే లేరు. మరోవైపు గృహాలపై అప్పు ఇచ్చిన బ్యాంకర్లు వాయిదాలకు ఒత్తిడి చేయడం అధికమైంది.

కూటమి నాయకుల హామీలపై ఆశలు

ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో వీరిని ఆదుకుంటామని కూటమి నాయకులు హామీ ఇచ్చారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రావడంతో తమ కష్టాలు తీరేలా వెసులుబాటు ఇస్తుందని లబ్ధిదారులు ఆశిస్తున్నారు. ప్రభుత్వం ఇంకా ఈ గృహాలపై తన విధానం ప్రకటించలేదు. శుక్రవారం కొందరు బ్యాంకర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వచ్చి.. బకాయిలు చెల్లించాలని ఒత్తిడి చేశారు. ఈ క్రమంలో శుక్ర, శనివారాల్లో ఆందోళన చేశారు. కొందరు  రూ.300 ఉన్నాయని చెప్పడంతో.. ఆ కొద్ది మొత్తాన్ని కూడా కట్టించుకున్నారు. రూ.3,65,000 రుణాలు తీసుకొన్న కొందరు రూ.50వేల వరకు చెల్లించినప్పటికీ.. బకాయి మొత్తం అలాగే చూపుతుండడం గమనార్హం.

ప్రభుత్వం ఆదుకోవాలి: వి. వజ్రమ్మ 

465చదరపు అడుగల గృహానికి మొదట డిపాజిట్‌గా రూ.లక్ష చెల్లించా. డిపాజిట్‌ రూ.50వేలకు తగ్గించినా మాకు రూ.50వేలు తిరిగివ్వలేదు. బ్యాంకర్లు ఒత్తిడి చేస్తున్నారు. కొందరు బకాయి డబ్బులు చెల్లించినా.. అది వడ్డీకి సరిపోతుందని చెబుతున్నారు. ఇలా అయితే అప్పు తీరేదెలా?. తెదేపా ప్రభుత్వం మా కష్టాలు తీరుస్తుందనే ఆశతో ఉన్నాం.

చర్యలు చేపడతాం: ఫజిల్లుల్లా

టిడ్కో కాలనీవాసులపై బ్యాంకర్ల ఒత్తిడి విషయం తెలియదు. క్షేత్ర స్థాయిలో విచారణ చేస్తాం. ప్రభుత్వానికి తెలియపరిచి.. కాలనీవాసులను ఆదుకునేలా చర్యలు చేపడతాం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని