logo

దోచినోళ్లకు అభయం

జిల్లా పౌరసరఫరాల సంస్థలో అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులే.. వాటికి వంత పాడారు. కంచె చేను మేసిందన్న చందంగా పొరుగు సేవల సిబ్బంది సాయంతో రూ. కోట్లు కాజేశారు.

Published : 29 Jun 2024 03:01 IST

పౌరసరఫరాల సంస్థ కుంభకోణం విచారణలో తీవ్ర జాప్యం
ఈనాడు, నెల్లూరు

పౌరసరఫరాల సంస్థ కార్యాలయం

‘ప్రతి రైతన్నకూ చెబుతున్నా.. మీకు నేనున్నా..’ అంటూ 2019 ఎన్నికల ముందు ఊదరగొట్టిన జగన్‌మోహన్‌రెడ్డి.. అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని గాలికొదిలేశారు.. కరవు రక్కసితో పాటు ప్రకృతి విపత్తులతో తీవ్రంగా నష్టపోయిన అన్నదాతలను ఆదుకోవాల్సిన ఆయన ప్రభుత్వం.. వారిని అడ్డగోలుగా దోచుకున్న అధికారులకు ఆపన్నహస్తం ఇచ్చింది. వ్యవసాయశాఖ మంత్రి జిల్లా వాసి కావడంతో.. న్యాయం జరుగుతుందని భావించిన కర్షకులను వారి కర్మకు వదిలేసింది. ఏకంగా రూ. 40 కోట్లు కాజేసిన భారీ కుంభకోణం జరిగి దాదాపు ఏడాదిన్నర దాటినా.. నేటికీ అతీగతీ లేకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

జిల్లా పౌరసరఫరాల సంస్థలో అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులే.. వాటికి వంత పాడారు. కంచె చేను మేసిందన్న చందంగా పొరుగు సేవల సిబ్బంది సాయంతో రూ. కోట్లు కాజేశారు. రెండున్నరేళ్ల కాలంలో ప్రభుత్వం విడుదల చేసిన రవాణా ఛార్జీలను బినామీ ఖాతాలకు మళ్లించారు. ఎక్కడా అనుమానం రాకుండా, తగు జాగ్రత్తలు తీసుకున్నారు. రైతులు తమకు డబ్బు జమ కాలేదని ఫిర్యాదులు చేయడంతో.. ఆడిట్‌ చేసిన అధికారులు రూ. 7.50 కోట్లు లెక్క తేలడం లేదని గుర్తించారు. దానిపై వెంటనే అప్పటి జేసీ రోణంకి కూర్మనాథ్‌ను విచారణకు ఆదేశించగా.. రెండున్నరేళ్లలో రూ. 40 కోట్లు స్వాహా చేసినట్లు గుర్తించారు. అనంతరం ఈ కేసును అనిశాకు అప్పగించారు. ఈ మొత్తం కేసులో 33 మంది ఉండగా.. సుమారు 18 మందిని అరెస్టు చేసినట్లు చూపించారు. వారిలో ఏడుగురు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. మిగిలిన వారిలో కంప్యూటర్‌ ఆపరేటర్‌ శివకుమార్, ఆయన బంధువులు, స్నేహితులు ఉన్నారు.

అక్రమాల డొంక కదిలిందిలా...

నెల్లూరు పౌరసరఫరాల సంస్థలో 2022లో జరిగిన సాధారణ ఆడిట్‌లో ఆదాయపన్నుకు సంబంధించిన నకిలీ చలానాను అదికారులు గుర్తించారు. దానిపై వివరాలు చెప్పాలని కోరగా.. సక్రమంగా స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. విషయాన్ని జిల్లాకు వచ్చిన నాటి పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ అరుణ్‌కుమార్, ఎండీ వీరపాండ్యన్‌కు చెప్పగా.. విచారణకు ఆదేశించారు. అలా అక్రమాల డొంక కదిలింది. తొలుత 2019 వరకు రికార్డులు పరిశీలించిన నాటి జేసీ.. అనంతరం 2017 వరకు తనిఖీ చేశారు. డీఎం బ్యాంకు ఖాతా నుంచి ఇతరుల ఖాతాలకు నగదు చేసిన అన్ని లావాదేవీలను క్షుణ్నంగా పరిశీలించారు. మొత్తం రూ. 40 కోట్లు ఉద్దేశపూర్వకంగా కాజేసినట్లు గుర్తించారు. మొదట నాటి డీఎం పద్మతో సహా అయిదుగురిని సస్పెండ్‌ చేశారు. ఆ తర్వాత ఆరుగురితో కలిపి.. మొత్తం 11 మందిపై కేసు నమోదు చేశారు. విచారణలో దీంతో పాటు 2016-17లో బ్యాంకు హామీలకు సంబంధించి ముందస్తు తేదీలు వేసిన చెక్కులను గుర్తించారు. వాటి విలువ రూ. 14.91 కోట్లుగా ఉంది.

వైకాపా ఒత్తిడితోనే.. వెనకడుగు

2018 నుంచి ఈ అక్రమాలు ఉద్దేశపూర్వకంగా చేసినట్లు గుర్తించిన అధికారులు.. ఈ కుంభకోణంలో నలుగురు డీఎంల పాత్ర ఉన్నట్లు తేల్చారు. వీరిలో ఇద్దరిని అరెస్టు చేయగా.. మిగిలిన ఇద్దరి పాత్రపై అనిశా అధికారులు ఆరా తీశారు. 2018 ఏప్రిల్‌ 11వ తేదీన మొదటిసారి రోజ్‌మాండ్‌ పౌరసరఫరాల సంస్థ డీఎంగా పనిచేశారు. ఆమె బదిలీ అయిన తర్వాత ఇద్దరు డీఎంలుగా విధులు నిర్వహించారు. తిరిగి 2019 ఫిబ్రవరి ఆరో తేదీ ఆమె బాధ్యతలు తీసుకున్నారు. ఈమె తర్వాత 2021లో పద్మ వచ్చారు. ఈ కేసును జేసీ కూర్మనాథ్‌ సీబీసీఐడీకి అప్పగించాలని తన నివేదికలో కోరినా.. అనిశాకు అప్పగించారు. మొదట్లో హడావుడి చేసిన అధికారులు.. ఆ తర్వాత పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. అరెస్టయిన అధికారులతో పాటు మరికొందరు వైకాపా నాయకుల పంచన చేరడంతో.. ఆ విషయాన్ని పక్కన పడేశారనే విమర్శలు ఉన్నాయి. ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చి ఒకటిన్నరేళ్లు దాటినా.. కొలిక్కి రాకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

దీనిపై అనిశా డీఎస్పీ శిరిషను వివరణ కోరగా.. పౌరసరఫరాల సంస్థలో వెలుగు చూసిన అక్రమాలపై విచారణ జరుగుతోందన్నారు. ఆ కేసుకు సంబంధించి సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నామని.. పలు పత్రాలు కావాల్సి ఉందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని