logo

యువత.. మారాలి నడత

నెల్లూరు స్టోన్‌హౌస్‌పేటలో ఇటీవల ఓ హత్య జరిగింది. పాత కక్షల నేపథ్యంలో ఓ యువకుడిని ఆరుగురు యువకులు కలిసి కత్తులతో కడతేర్చారు. వీరిలో ఇద్దరు మైనర్లు ఉండటం గమనార్హం.

Published : 29 Jun 2024 02:43 IST

న్యూస్‌టుడే, నెల్లూరు (నేర విభాగం)

  • నెల్లూరు స్టోన్‌హౌస్‌పేటలో ఇటీవల ఓ హత్య జరిగింది. పాత కక్షల నేపథ్యంలో ఓ యువకుడిని ఆరుగురు యువకులు కలిసి కత్తులతో కడతేర్చారు. వీరిలో ఇద్దరు మైనర్లు ఉండటం గమనార్హం.
  • నెల్లూరుతో పాటు ఇతర జిల్లాల్లో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులంతా యువకులే కావడం.. వ్యసనాలకు బానిసలై.. దొంగలుగా మారినట్లు గుర్తించారు.

ఈ రెండే కాదు.. ఇటీవల తరచూ చోటు చేసుకుంటున్న సంఘటనల్లో ఎక్కువగా యువకులే నిందితులుగా తేలుతుండటం పోలీసులనే విస్తుపరుస్తోంది.. తల్లిదండ్రులు అప్రమత్తం కావాల్సిన ఆవశ్యకతను చాటిచెబుతోంది. మారుతున్న కాలం.. తీరిక లేని జీవితం.. ఏది ఏమైనా బిడ్డల చదువులు, నడవడి, స్నేహాలు, అలవాట్లను ఓ కంట కనిపెడుతూ.. వారిని సన్మార్గంలో నడపాల్సిన అవసరం ఉంది.
నెల్లూరు నగరంలో ఆరు పోలీసు స్టేషన్లతో పాటు నెల్లూరు గ్రామీణ పోలీసు స్టేషన్‌ ఉంది. వీటి పరిధిలో ఎక్కడో ఒకచోట హత్యలు, హత్యాయత్నాలు, గొడవలు, దాడుల కేసులు నమోదవుతుండగా- వాటిల్లో అధికశాతం యువకుల ప్రమేయం ఆందోళన కలిగిస్తోంది. చైన్‌ స్నాచింగ్, ద్విచక్ర వాహనాల దొంగతనాల్లోనూ వారే నిందితులుగా ఉండటం విస్తుగొలుపుతోంది. చక్కగా చదువుకుని జీవితాన్ని తీర్చిదిద్దుకోవాల్సిన వయసులో.. అపరిపక్వ మనస్తత్వం, చెడు సావాసాలు, వ్యసనాలు, జల్సాల కాంక్ష తదితరాల కారణంగా వివాదాల్లో చిక్కుకుని స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. కొందరు అర్ధరాత్రి వరకు రోడ్లలో పంచాయితీలు.. పుట్టిన రోజు పార్టీలు, షికార్లు, చోటా నాయకులతో మంతనాలు చేస్తూ గడిపేస్తున్నారు. ఈ క్రమంలో అనుకోని వివాదాలు.. కేసుల్లో చిక్కుకుని.. చిక్కుల్లో పడుతున్నారు.  

షీట్‌ తెరిస్తే.. ఇబ్బందే

ఒక్కసారి రౌడీషీట్‌ తెరిస్తే.. భవిష్యత్తు నాశనమే.. ఎలాంటి ఉద్యోగాలు రావు. నిత్యం పోలీసు స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. పాస్‌పోర్టు ప్రభుత్వ ఉద్యోగం రాదు. ప్రతి ఆదివారం సంబంధిత పోలీసు స్టేషన్‌కు వెళ్లి హాజరు వేసుకోవాల్సి వస్తుంది.

తల్లిదండ్రులు దృష్టిసారించాలి

తల్లిదండ్రులు తమ బిడ్డలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. వారు ఏం చేస్తున్నారు? ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నారు? కళాశాలకు వెళుతున్నారా? రాత్రుళ్లు ఇంటికి ఎప్పుడు వస్తున్నారు? ఎక్కడికి వెళుతున్నారనే విషయాలపై దృష్టిసారించాలి. ఎక్కువ నగదు ఇవ్వడం, భారీ మోటారు సైకిళ్లు కొనివ్వడం తదితరాలు చేయకూడదు. నేరాలకు పాల్పడితే జరిగే అనర్థాలను వివరించాలి. తల్లిదండ్రుల నియంత్రణ ఉంటే.. వారిలో చైతన్యం వస్తుంది.

శ్రీనివాస్‌రెడ్డి, నగర డీఎస్పీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని