logo

నుడాపై.. నారాయణ గురి!

నెల్లూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(నుడా)పై పట్టణ పురపాలకశాఖ మంత్రి పొంగూరు నారాయణ గురిపెట్టారు. అక్రమ లేఅవుట్లు, ప్రభుత్వ భూములు ఆక్రమించి స్థిరాస్తి వ్యాపారం తదితరాలపై ఫిర్యాదులు వస్తుండటంతో కమిటీ ఏర్పాటు చేసి.. విచారణ చేయించాలన్న నిర్ణయానికి వచ్చారు.

Updated : 29 Jun 2024 05:52 IST

ఫిర్యాదులపై విచారణకు కమిటీ
అధికారులతో జరిగిన వీసీలో నిర్దేశం
ఈనాడు, నెల్లూరు

నెల్లూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(నుడా)పై పట్టణ పురపాలకశాఖ మంత్రి పొంగూరు నారాయణ గురిపెట్టారు. అక్రమ లేఅవుట్లు, ప్రభుత్వ భూములు ఆక్రమించి స్థిరాస్తి వ్యాపారం తదితరాలపై ఫిర్యాదులు వస్తుండటంతో కమిటీ ఏర్పాటు చేసి.. విచారణ చేయించాలన్న నిర్ణయానికి వచ్చారు. గురువారం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ అధికారులతో జరిగిన వీక్షణ సమావేశంలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో అక్రమార్కుల గుండెల్లో ఆందోళన మొదలైంది.

గత అయిదేళ్లలో నుడా పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ లేఅవుట్లు వెలిశాయి. ప్రభుత్వ భూములు సైతం కబ్జాకు గురయ్యాయి. వ్యవసాయ భూములను వ్యవసాయేతరంగా మార్చుతూ.. వాటి మూలాలను పరిగణనలోకి తీసుకోకుండా లేఅవుట్లు వేసినవి.. వేస్తున్నవి కొన్నయితే.. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి ప్రభుత్వ స్థలాలను సైతం మింగేసి వేస్తున్నవి మరికొన్ని.. ఇవేమీ తెలియని సామాన్య, మధ్యతరగతి ప్రజలు అప్పులు చేసి మరీ ప్లాట్లు కొనుగోలు చేసి.. తర్వాత నానా ఇబ్బందులు పడుతున్నారు. ఒకరికి రిజిస్టర్‌ చేసిన భూమినే మరో ముగ్గురు, నలుగురికి చేసేస్తున్న ఉదంతాలు ఉన్నాయి. వాటిల్లోనే నగరపాలక సంస్థ అధికారులు నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేస్తుండగా.. భవన నిర్మాణ అనుమతులపైనా ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ క్రమంలో పట్టణ పురపాలకశాఖ మంత్రి నారాయణ నుడాపై ప్రత్యేక దృష్టిసారించారు. అధికారులతో నిర్వహించిన సమావేశంలో.. వారికి దిశానిర్దేశం చేశారు.

వారి ఒత్తిడితోనే!

మూడేళ్ల కిందట జిల్లాలో అనుమతులు లేకుండా వేసిన 118 లేఅవుట్లను అధికారులు గుర్తించారు. వాటిపై చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నగర/పురపాలిక పరిధిలో సంబంధిత కమిషనర్, టీపీవో, టీపీఎస్, మండల సర్వేయర్, స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లు ఉండగా..  మండల స్థాయిలో ఎంపీడీవో, ఈవోపీఆర్డీ, ఉప తహసీల్దారు, స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్, సర్వేయరు, పంచాయతీ సెక్రటరీ గ్రేడ్‌-1ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరంతా వారి పరిధిలో అనుమతులు తీసుకోని లేఅవుట్లను గుర్తించి.. వాటి వివరాలను నుడా అధికారులకు తెలపాల్సి ఉంది. దీంతో పాటు ప్రభుత్వ స్థలాలు, కాలువలు, ఇతర సాగునీటి వనరులు ఆక్రమణకు గురికాకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత ఉంది. వీటికి సంబంధించి నెలనెలా వివరాలు అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అక్రమార్కులకు వైకాపా నాయకుల మద్దతు ఉండటంతో కనీసం అధికారులు ఇచ్చిన నోటీసులకూ స్పందించలేదనే విమర్శలు ఉన్నాయి. కొన్నింటి వద్దకు అధికారులు వెళ్లినా.. అప్పటి ప్రజాప్రతినిధుల జోక్యంతో వెనకడుగు వేయాల్సి వచ్చిందనే విమర్శలు ఉన్నాయి. గడిచిన అయిదేళ్లలో కొందరు అధికారులు అక్రమార్కులతో కొమ్ముకాసి.. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం మంత్రి నిర్ణయంతో వారంతా ఆందోళనలో పడ్డారు.

75 శాతం అనుమతులు లేనివే...

దినదినాభివృద్ధి చెందుతున్న నెల్లూరు నగరంతో పాటు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న కావలి, నెల్లూరు, ఆత్మకూరు, కందుకూరు రెవెన్యూ డివిజన్లలో గత కొన్నేళ్లలో స్థిరాస్తి క్షేత్రాలు ఇబ్బడిముబ్బడిగా వెలిశాయి. కొన్నిచోట్ల బహుళ అంతస్తుల భవనాలు ఏర్పాటయ్యాయి. వీటిల్లో 75 శాతం లేఅవుట్లు.. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వేసినవే కావడం గమనార్హం. కొందరైతే.. పక్కనున్న ప్రభుత్వ భూములనూ ఆక్రమించి విక్రయిస్తుండగా.. వాటిని అడ్డుకోవాల్సిన అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటం వ్యాపారులకు కలిసివస్తోంది. డూప్లికేట్‌ ఎల్‌పీ నంబర్లు, పంచాయతీ అనుమతులు చూపుతున్నారు. నకిలీ డైరెక్టర్‌ ఆఫ్‌ టైన్‌ ప్లానింగ్‌ ఎల్‌పీ నంబరు పొందుపరుస్తూ.. కొనుగోలుదారులను మోసం చేస్తున్నారు. సంబంధిత నంబరును వెబ్‌సైట్‌లో వెతికితే కనిపించిన దాఖలాలు లేవు. ఇలాంటి వాటిపై కౌంటర్‌ తనిఖీలు ఉండడం లేదు. పలుచోట్ల స్థిరాస్తి వ్యాపారులు రిజిస్ట్రార్‌ కార్యాలయాల సిబ్బందితో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఇది కొందరికి బాగా కలిసి వస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని