logo

మార్పుతోనే.. అందరికీ సరకులు

గత వైకాపా ప్రభుత్వం.. జిల్లాలో ఆహార భద్రతా చట్టానికి తూట్లు పొడిచింది. చౌక దుకాణాల వ్యవస్థను పక్కన పెట్టి.. ఇంటింటికీ రేషన్‌ పేరుతో మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్ల(ఎండీయూ)ను ప్రవేశపెట్టింది.

Updated : 26 Jun 2024 06:51 IST

గత ప్రభుత్వంలో గాడితప్పిన ప్రజాపంపిణీ

గోదాములో బియ్యం బస్తాలు

న్యూస్‌టుడే, నెల్లూరు(కలెక్టరేట్‌): గత వైకాపా ప్రభుత్వం.. జిల్లాలో ఆహార భద్రతా చట్టానికి తూట్లు పొడిచింది. చౌక దుకాణాల వ్యవస్థను పక్కన పెట్టి.. ఇంటింటికీ రేషన్‌ పేరుతో మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్ల(ఎండీయూ)ను ప్రవేశపెట్టింది. రేషన్‌ డీలర్ల పొట్టకొట్టి వైకాపా కార్యకర్తలకు వాటిని కట్టబెట్టింది. ఆ చర్యలతో వ్యవస్థ గాడిన పడిందా? అంటే... తెదేపా ప్రభుత్వ హయాంలో ప్రతి నెలా 95 శాతం మందికి రేషన్‌ పంపిణీ చేయగా... వైకాపా ప్రభుత్వంలో అది 85 శాతానికి పడిపోయింది. జిల్లాలో ప్రతి నెలా సుమారు 50వేల కార్డుదారులకు సరకులు సక్రమంగా అందని పరిస్థితి కొనసాగింది.

అధికారుల నిస్సహాయత

ఎండీయూ వాహనం ద్వారా సరకులు పంపిణీ చేయపోయినా.. అధికారులు ఏమీ చేయలేని నిస్సహాయత వ్యక్తం చేశారు. అధికార పార్టీ కార్యకర్తలు కావడంతో మిన్నకుండిపోయారు. కొందరు ఆపరేటర్లు వాహనాన్ని ఒక వీధిలో నిలిపి ఈ-పోస్‌ యంత్రంలో వేలిముద్రలు వేయించుకుని వెళ్లిపోతే.. తర్వాత వేరే వ్యక్తి సరకులు పంపిణీ చేసిన సంఘటనలు ఉన్నాయి. పైపెచ్చు సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కువ మంది ఆపరేటర్లు వైకాపాకు అనుకూలంగా పనిచేశారు.

రూ. 30.66 కోట్లు వృథా

జిల్లాలో 438 ఎండీయూ వాహనాలు ఉండగా- ఒక్కోదాన్ని రూ. 7 లక్షలకు కొనుగోలు చేశారు. ఇందులో కొంత ఆపరేటర్‌ వాటా కాగా, మిగిలింది బ్యాంకు రుణంగా ఇప్పించారు. ప్రతి నెలా ఒక్కో ఆపరేటర్‌కు రూ. 21వేల చొప్పున వేతనం చెల్లిస్తున్నారు. వాహనాలకు రూ. 30.66 కోట్లు వెచ్చించారు. ఇంటింటికీ రేషన్‌ పేరుతో వీధుల్లో వాహనాలు నిలిపి.. సరకులు ఇచ్చేవారు. ప్రతి ఇంటికీ వెళ్లిన దాఖలాలే లేవు. ఎండీయూ ఆపరేటర్‌కు ప్రతినెలా వేతనం ఇవ్వడంతో పాటు రేషన్‌ డీలర్‌కు కమీషన్‌ చెల్లించేవారు. ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నుంచి సరకులు చౌకదుకాణానికి చేరగా.. అక్కడి నుంచి ఆపరేటర్లు వాహనాల్లో నింపుకొని వెళ్లి పంపిణీ చేసేవారు. ఈ విధానం పూర్తిగా విఫలమైంది. 

ప్రభుత్వ ఆదేశాలు రాగానే..

జిల్లాలోని చౌక దుకాణాలకు సరకుల సరఫరా జరుగుతోంది. జులై నెల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు కార్డుదారులకు సరకులు పంపిణీ చేస్తాం. 

లక్ష్మీనరసింహ, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌

ప్రజాధనం వృథా

ప్రజాధనం వృథా చేసి.. ఎండీయూ వాహనాలను వైకాపా కార్యకర్తలకు కట్టబెట్టిన వైనంపై తెదేపా ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. దాంతో ఈ వ్యవస్థను రద్దు చేసి.. ఆహార భద్రతా చట్టం మార్గదర్శకాల ప్రకారం చౌక దుకాణాల వద్దే సరకులు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు పౌరసరఫరాలశాఖ అధికారులు చెబుతున్నారు. వైకాపా హయాంలో బియ్యం, పంచదార, గోధుమ పిండి మాత్రమే ఇచ్చి మిన్నకుండిపోగా.. కూటమి ప్రభుత్వం వాటితో పాటు వంట నూనె, కందిపప్పు రాయితీ ధరలకు పేదలకు పంపిణీ చేయాలని యోచిస్తోంది. ఈ నెల జిల్లాలోని ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి బియ్యం చౌక దుకాణాలకు చేరుస్తున్నారు. 

జిల్లాలో కార్డులు: 7,22,257  

చౌకదుకాణాలు:1513  

ఎండీయూ వాహనాలు: 438  

మండలాలు: 37 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని