logo

మాయా మహల్‌

సెంటు స్థలంలో చిన్న రేకుల షెడ్డు కట్టుకుంటేనే హడావుడి చేసే పట్టణ ప్రణాళిక అధికారులు.. ఎలాంటి అనుమతి లేకుండా నిర్మిస్తున్న వైకాపా కార్యాలయం విషయమే తెలియనట్లు వ్యవహరిస్తున్నారు.

Updated : 26 Jun 2024 06:53 IST

నిర్మాణమే కాదు.. స్థల సేకరణలోనూ వివాదమే

నెల్లూరులోని వెంకటేశ్వరపురంలో నిర్మిస్తున్న వైకాపా కార్యాలయానికి అంటించిన నోటీసులు

ఈనాడు, నెల్లూరు: కార్పొరేషన్, న్యూస్‌టుడే: సెంటు స్థలంలో చిన్న రేకుల షెడ్డు కట్టుకుంటేనే హడావుడి చేసే పట్టణ ప్రణాళిక అధికారులు.. ఎలాంటి అనుమతి లేకుండా నిర్మిస్తున్న వైకాపా కార్యాలయం విషయమే తెలియనట్లు వ్యవహరిస్తున్నారు. తాడేపల్లిలోని నిర్మాణాన్ని పగలగొట్టడంతో.. హడావుడిగా వెంకటేశ్వరపురంలోని వైకాపా కార్యాలయం వద్దకు చేరుకున్న అధికారులు.. అనుమతులు చూపించాలని కోరడం విడ్డూరంగా అనిపించింది. అప్పటి వరకు వైకాపా కొమ్ముకాసి.. వారు చెప్పిన ఇళ్లకు నోటీసులు.. అవసరమైతే పగలగొట్టేందుకూ వెనుకాడని అధికారులకు ప్రభుత్వం మారడంతో ముచ్చెమటలు పడుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే అనుమతులపై అడిగేందుకు వెళ్లిన అధికారులను వైకాపా నాయకులు నిలదీసినా.. సక్రమంగా సమాధానం చెప్పలేకపోయారనే విమర్శలు ఉన్నాయి. చివరకు గత్యంతరం లేక.. ఉన్నతాధికారుల సూచనలతో అదే రోజు సాయంత్రం కార్యాలయానికి నోటీసులు అందించారు. టిడ్కో ఇళ్లకు కేటాయించిన భూమిని వైకాపా నాయకులు ప్రభుత్వం నుంచి లీజు పద్ధతిలో తీసుకున్నట్లు ఇప్పటి వరకు చెబుతున్నా.. తాజాగా ఓ కుటుంబం ‘వైకాపా కార్యాలయ భవనం తమ భూమి ఆక్రమించి కడుతున్నారని’ నెల్లూరు ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

వారంలో వివరణ ఇవ్వాలని..

వెంకటేశ్వరపురంలోని సర్వే నంబరు 2222-2లో రెండెకరాల స్థలాన్ని వైకాపా కార్యాలయ నిర్మాణం కోసం 33 ఏళ్లకు ఏడాదికి ఎకరాకు రూ.వేయి చొప్పున లీజుకు కేటాయించగా.. ఎలాంటి ప్లాన్‌ పొందకుండా నిబంధనలు ఉల్లంఘించి నిర్మిస్తున్నారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా.. కనీసం ప్లాన్‌ అప్రూవల్‌ తీసుకోకుండా కడుతున్న వైకాపా కార్యాలయ భవన నిర్మాణం పూర్తిగా అక్రమమని ఎట్టకేలకు నగరపాలక సంస్థ అధికారులు తేల్చారు. వాస్తవానికి 1500 చదరపు మీటర్ల కంటే ఎక్కువ నిర్మాణం చేస్తుంటే నుడా(నెల్లూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఆ విషయాన్ని పట్టించుకోలేదని గుర్తించారు. నెల్లూరులో టౌన్‌ ప్లానింగ్‌ బిల్డింగ్‌ అబ్జర్వర్‌ పేరుతో వైకాపా జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డికి నోటీసులు అందించేందుకు యత్నించినా.. ఆయన అందుబాటులో లేరు. దాంతో కమిషనర్‌ ఆదేశాలతో ఆగమేఘాలపై ఈ నెల 22వతేదీ సాయంత్రం కార్యాలయం ప్రాంతానికి వెళ్లారు. అక్కడ కూడా సంబంధిత బాధ్యులు లేకపోవడంతో.. పిల్లర్లకు నోటీసులు అంటించారు. ఏడు రోజుల్లో తగిన వివరణ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. 

అసలు.. ఆ భూమి ఎవరిది?

ఏకంగా రూ. పది కోట్ల విలువైన భూమి అది. చెన్నై-విజయవాడ జాతీయ రహదారిని ఆనుకుని.. అత్యంత విలువైన స్థలంలో వైకాపా కార్యాలయం నిర్మిస్తున్నారు. తొలుత ఆ భూమిని టిడ్కో ఇళ్ల కోసం పేదల దగ్గర నుంచి ప్రభుత్వం తీసుకుందని, అందులో రెండు ఎకరాలను ప్రభుత్వ జీవో ప్రకారం వైకాపాకు అప్పగించారని ప్రచారం జరిగింది. తాజాగా నెల్లూరుకు చెందిన షేక్‌ కౌసర్‌ జాన్‌ అనే మహిళ తమ భూమిపై మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ కన్ను పడిందని, వైకాపా కార్యాలయం కడుతున్న విషయం తెలిసి.. ఆయన్ను కలిస్తే, న్యాయం చేస్తానని మాట ఇచ్చి.. తర్వాత కలిస్తే గెంటేయించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసలు బహిరంగ మార్కెట్టులో రూ. కోట్లు పలికే స్థలాన్ని.. ఏడాదికి ఎకరాకు రూ. వేయి చొప్పున 33 ఏళ్ల పాటు లీజుకు తీసుకోవడం, అందులో రాజ ప్రాసాదాన్ని తలపించేలా నిర్మాణం చేయడం వైకాపా అరాచకాలకు అద్దం పడుతోంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని