logo

రూ.65 లక్షల వ్యయం.. నెరవేరని లక్ష్యం

మండలంలోని గుండుపల్లిలో 2017లో రూ.13.80 లక్షలతో ఏర్పాటుచేసిన పథకమిది. మొదట్లో కొద్దిరోజులు నీరు వచ్చింది. రుచిగా లేదని వినియోగించడం మానేశారు.

Updated : 26 Jun 2024 06:54 IST

మండలంలోని గుండుపల్లిలో 2017లో రూ.13.80 లక్షలతో ఏర్పాటుచేసిన పథకమిది. మొదట్లో కొద్దిరోజులు నీరు వచ్చింది. రుచిగా లేదని వినియోగించడం మానేశారు. దీంతో లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన నీటిపథకం నిరుపయోగంగా మారింది. ప్రస్తుతం డోరు అద్దాలు పగిలిపోయాయి. కంప చెట్లు పెరుగుతున్నాయి.

మండలంలోని బోడసిద్ధాయపల్లిలో 2017లో రూ.12.30 లక్షలతో ఏర్పాటుచేసిన నానో పథకమిది. గ్రామంలో 130 కుటుంబాలకు పైగా ఉన్నా ఈ నీటిని తాగేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. దీంతో నిరుపయోగంగా మారింది. రూ.లక్షలాది రూపాయల పరికరాలు వృథా అయ్యాయి. పక్కనే ఓగూరువాండ్లపల్లి పాఠశాలలో ఏర్పాటుచేసిన ఆర్వో ప్లాంట్ నీరు తెచ్చుకుంటున్నారు.

సీతారామపురం, న్యూస్‌టుడే : ఫ్లోరిన్‌ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు శుద్ధి నీటిని అందించాలని మండలంలోని గుండుపల్లి, బోడసిద్ధాయపల్లి, గోనువారిపల్లి, చిన్నాగంపల్లి, జయపురం గ్రామాల్లో నానో నీటి పథకాలను 2017 ఏప్రిల్‌లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటుచేసింది. వీటిని దాదాపు రూ.65 లక్షల వరకు నిధులు వెచ్చించి ఏర్పాటుచేశారు. ఈ పథకాల్లో టీడీఎస్‌ (టోటల్‌ డిసాల్వ్‌డ్‌ సాలిడ్స్‌) విధానంలో ప్రమాణాల మేరకు లవణాలు ఉంటాయి. రసాయనాలు కలపరు. దీంతో ఈ నీరు రుచించడంలేదు. మండలంలో ఐదుచోట్ల ఏర్పాటు చేయగా ఎక్కడా వినియోగించని పరిస్థితి నెలకొంది. రూ.65 లక్షలు వ్యయం చేసినా నిరుపయోగంగా మారాయి. గత వైకాపా ప్రభుత్వం ఈ పథకాలను గురించి పట్టించుకున్న పాపానపోలేదు. ప్రస్తుతం తిరిగి తెదేపా ప్రభుత్వం కొలువుదీరినందున ఆర్వో ప్లాంట్లుగా మార్పు చేస్తే తాగునీటి కష్టాలు తీరుతాయని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

ఆర్వో ప్లాంటుగా మార్పు చేయాలి 

మా గ్రామంలోని నానో నీటి పథకం నీరు రుచిగా లేవని తాగేందుకు ఆసక్తి చూపడంలేదు. కొందరు కుళాయి నీరు తాగుతున్నారు. మరికొందరు కొనుగోలు చేస్తున్నారు. ఆర్వో పథకంగా మారిస్తే ఉపయోగంగా ఉంటుంది. 

వెంకటేశ్వర్లు, జయపురం 

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతాం 

నానో నీటి పథకాలు నిరుపయోగంగా ఉన్న విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతాం. వాటి స్థానంలో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటుచేయాలన్న ప్రజల వినతి మేరకు అమలుచేసేలా చర్యలు తీసుకుంటాం.

జగన్నాథం, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ, సీతారామపురం 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని