logo

జాతీయ రహదారి అడ్డాగా.. పార్థీ ముఠా నేరాలు

మూడు నెలలుగా హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిని అడ్డాగా చేసుకుని.. ఆగి ఉన్న వాహనాలనే లక్ష్యంగా రాత్రి, పగలు తేడాలేకుండా దొంగతనాలకు పాల్పడుతున్న పార్థీ దొంగల ముఠాలోని ఇద్దరిని నల్గొండ పోలీసులు అరెస్టు చేశారు

Published : 07 Jul 2024 03:42 IST

వివరాలు వెల్లడిస్తున్న నల్గొండ ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌

నల్గొండ నేరవిభాగం, న్యూస్‌టుడే: మూడు నెలలుగా హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిని అడ్డాగా చేసుకుని.. ఆగి ఉన్న వాహనాలనే లక్ష్యంగా రాత్రి, పగలు తేడాలేకుండా దొంగతనాలకు పాల్పడుతున్న పార్థీ దొంగల ముఠాలోని ఇద్దరిని నల్గొండ పోలీసులు అరెస్టు చేశారు. నల్గొండ ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌ శనివారం స్థానిక పోలీస్‌ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రలోని పుణే జిల్లా ఇందాపూర్, భారామతి చౌరత ప్రాంతంలోని పార్థీ కులానికి చెందిన అప్ప పాండ్రంగా (30) (పార్ధీ ముఠాకు చెందిన ప్రధాన నిందితుడు), అదే ప్రాంతానికి చెందిన శుభం అశోక్‌ (25)తో పాటు పరారీలో ఉన్న షోలాపూర్‌ ప్రాంతానికి చెందిన శశిపాల్‌ (32),  అఖిల్‌ (25)లు కలిసి దొంగతనాలకు పాల్పడుతున్నారు. నల్గొండ జిల్లా పరిధిలోని చిట్యాల, నార్కట్‌పల్లి, కట్టంగూరు మండలాలతో పాటు రాచకొండ, సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధి, సంగారెడ్డి జిల్లా రహదారుల వెంట నిలిపి ఉన్న వాహనాల్లో నిద్రపోతున్నవారిని రాళ్లు, సీకులతో కొట్టి వారి వద్ద నుంచి నగదు, బంగారం ఎత్తుకెళ్తున్నారు. బాధితులు ప్రతిఘటిస్తే హత్యలు చేస్తారు. అదే క్రమంలో మే నెల 18న కట్టంగూరు మండల కేంద్రంలో కృష్ణాజిల్లా పామర్రు మండలానికి చెందిన కొల్లూరు రాజవర్ధన్‌ (32) టాటా ఏస్‌ వాహనం రోడ్డుపై ఆపి నిద్రపోతున్న సమయంలో చేతులు కాళ్లు కట్టేసి కొట్టి హత్యచేశారు. అతడి వద్ద ఉన్న రూ.14,500 ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో ముఠా కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్న క్రమంలో.. శుక్రవారం ఉదయం పార్థీ ముఠాలో ఇద్దరు సభ్యులు ఆటోలో వెళ్తున్నట్లు సమాచారం రావడంతో.. హయత్‌నగర్‌ అవుటర్‌ రింగ్‌రోడ్డు సమీపంలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిని నల్గొండ జిల్లా పరిధిలోని చిట్యాల పోలీస్‌ స్టేషన్‌లో విచారించారు. కట్టంగూరులో జరిగిన హత్య కేసుతో పాటు నల్గొండ జిల్లాలో-6, రాచకొండ కమిషనరేట్‌లో-13, సంగారెడ్డి జిల్లాలో- 11, సైబరాబాద్‌ కమిషనరేట్‌లో -2  దొంగతనాలు చేసినట్లు అంగీకరించారు. మొత్తం 32 కేసుల్లో.. ఒకటి హత్య కేసు, ఆరు దొంగతనాలు, ఏడు ఛైన్‌స్నాచింగ్, ఎనిమిది ద్విచక్రవాహనాల అపహరణ, పది ప్రాంతాల్లో పగలు, రాత్రి ఇళ్లల్లో దొంగతనాలు చేసినట్లు ఒప్పుకొన్నారు. పట్టుబడిన ఇద్దరిని రిమాండ్‌కు పంపడంతో పాటు పరారీలో ఉన్న ఇద్దరిని పట్టుకునేందుకు రెండు బృందాలు గాలిస్తున్నట్లు ఎస్పీ చెప్పారు. కేసును ఛేదించిన నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి, నార్కట్‌పల్లి సీఐ నాగరాజు, ఎస్సై సైదాబాబు, హెడ్‌కానిస్టేబుల్‌ విష్ణువర్థనగిరి, సిబ్బంది విక్రమ్‌ శంకర్, సాయిరాం, కలీమ్, సాయి కుమార్‌లను ఎస్పీ అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని