logo

తొలకరి నిరాశే..!

వానాకాలం ప్రారంభమై నెల గడిచినా.. మూడు జిల్లాల్లోనూ లోటు వర్షపాతమే నమోదు అయింది.దీంతో పంటల సాగులో తీవ్ర జాప్యం నెలకొంటోంది. ఈ ఏడాది నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో కలిపి పంటల సాగు సగటు 15 శాతానికి కూడా మించలేదు.

Published : 04 Jul 2024 05:11 IST

సీజన్‌ ప్రారంభమై నెల గడిచినా మూడు జిల్లాల్లోనూ లోటు వర్షపాతమే

త్రిపురారం మండలం కామారెడ్డిగూడెంలో నారుమడి

ఈనాడు, నల్గొండ: వానాకాలం ప్రారంభమై నెల గడిచినా.. మూడు జిల్లాల్లోనూ లోటు వర్షపాతమే నమోదు అయింది.దీంతో పంటల సాగులో తీవ్ర జాప్యం నెలకొంటోంది. ఈ ఏడాది నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో కలిపి పంటల సాగు సగటు 15 శాతానికి కూడా మించలేదు. గతేడాది ఇదే సమయానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 20 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. చాలా ప్రాంతాల్లో విత్తనాలు నాటిన తర్వాత వర్షం లేకపోవడంతో అవి ఎండిపోయే దశకు చేరాయి. రాష్ట్రంలో వరి, పత్తి పంటలు ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే అత్యధిక విస్తీర్ణంలో సాగవుతాయి. ఈ ఏడాదీ మూడు జిల్లాల్లో కలిపి వరి సాగు 10.8 లక్షల ఎకరాల్లో, పత్తి సుమారు 8 లక్షల ఎకరాల్లో సాగుకు అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేశారు. ఇప్పటి వరకు వరి కేవలం సుమారు లక్ష ఎకరాలకే పరిమితం కాగా..పత్తి సాగు 4.5 లక్షల ఎకరాలు దాటింది. ఏటా ఈ సమయానికి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు సమృద్ధిగా పడి బోరు, బావుల కింద నల్గొండ, యాదాద్రి జిల్లాల్లో రైతులు సాగు పనులు మొదలు పెట్టేవారు. ఈ దఫా వర్షాలు రాకపోవడంతో బోరు, బావుల కింద ఇంకా రైతులు ఇప్పుడిప్పుడే నారుమళ్లు పోస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో వరి సాగు అంతా నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుతోనే ముడిపడి ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదైనా మూడు జిల్లాల వ్యాప్తంగా మాత్రం జూన్‌లో లోటు వర్షపాతమే నమోదైంది.

అడుగంటిన సాగర్‌..

నాగార్జునసాగర్‌కు ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఎగువ నుంచి ఒక్కచుక్క నీరు రాలేదు. గత రెండేళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగడంతో ఆయకట్టులోని 3.5 లక్షల ఎకరాల సాగు ప్రశ్నార్థకంగా మారింది. సాగర్‌ పైనే ఆధారపడిన ఏఎమ్మార్పీ ఎస్‌ఎల్‌బీసీ కింద ఉన్న సుమారు 2.5 లక్షల ఎకరాల సాగు సైతం డోలాయమానంలో పడింది. మరోవైపు కృష్ణా బేసిన్‌లో తొలి ప్రాజెక్టు అయిన ఆల్మట్టిలో నీటి ప్రవాహం ఇప్పుడిప్పుడే మొదలైంది. ప్రస్తుతం ఆల్మట్టికి 27 వేల క్యూసెక్కులకు పైగా ఇన్‌ఫ్లో ఉంది. సాగర్‌ ఎగువన ఉన్న శ్రీశైలంతో పాటూ ఆలమట్టి, నారాయణపూర్, తుంగభద్ర నిండి సాగర్‌కు ప్రవాహం మొదలుకావాలంటే హీనపక్షం 300 టీఎంసీల నీరు అవసరం. ఇంత నీరు ఎగువనుంచి రావాలంటే మరో నెలన్నర అయినా పట్టే అవకాశం ఉంటుందని సంబంధిత అధికారులు వెల్లడిస్తున్నారు. దీంతో ఈ ఏడాది సాగర్‌ ఎడమ కాల్వ పరిధిలో వరి నాట్లు మరింత ఆలస్యం కానున్నాయి. సాగర్‌లో రోజురోజుకూ నీటినిల్వలు డెడ్‌స్టోరేజ్‌కు పడిపోతున్నాయి. ప్రస్తుతం 504 అడుగులు (121.70 టీఎంసీలు) ఉంది. డెడ్‌స్టోరేజీ (510 అడుగులు) కంటే ఇప్పటికే ఆరు అడుగుల మేర నీటిమట్టం పడిపోయింది. ఈ నెలాఖరు వరకు పరిస్థితి ఇలాగే కొనసాగితే హైదరాబాద్‌ తాగునీటికీ ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు మూసీ ప్రాజెక్టులో ఆశాజనకంగా నీటి నిల్వలు ఉండటంతో ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల కింద ఇప్పుడిప్పుడే వరి నాట్లు జోరందుకుంటున్నాయి. డిండి ప్రాజెక్టుకు సైతం ఇప్పుడిప్పుడే ఇన్‌ఫ్లో మొదలవుతుండగా...శాలిగౌరారం నుంచి సాగు అవసరాలకు నీటి విడుదల కొనసాగుతోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని