logo

దళారీ.. అధికారి.. మధ్యలో రాయబారి

రోడ్డు రవాణా సంస్థ కార్యాలయంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి ఓ యజమాని (రాయబారి) రంగంలోకి దిగారు. అధికారులకు.. దళారులకు మధ్య సయోధ్య కుదర్చడం కోసం ముమ్మర ప్రయత్నం చేశారు.

Published : 04 Jul 2024 05:08 IST

ఆర్టీవో కార్యాలయం వద్ద దుకాణాలు

నీలగిరి, న్యూస్‌టుడే: రోడ్డు రవాణా సంస్థ కార్యాలయంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి ఓ యజమాని (రాయబారి) రంగంలోకి దిగారు. అధికారులకు.. దళారులకు మధ్య సయోధ్య కుదర్చడం కోసం ముమ్మర ప్రయత్నం చేశారు. దీంతో మూత పడిన దుకాణాలు తెరచుకున్నాయి. మళ్లీ కార్యాలయంలో దళారులదే ఇష్టారాజ్యంగా మారనుంది. వాహనదారుల పనులు చక్కబెట్టడానికి దళారుల ద్వారా అధికారులు మామూళ్లు తీసుకుంటున్నారని ప్రభుత్వం గ్రహించి ఏసీబీ అధికారులతో ఆకస్మిక తనిఖీలు చేయించింది. డ్రైవింగ్‌ లైసెన్స్‌ మొదలుకొని వాహనాల అనుమతులు, ఇతర అన్ని రకాల పనులు చేయడానికి దళారులు ముక్కుపిండి వసూళ్లు చేస్తున్నారని ఏసీబీ అధికారులు ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. దీంతో కార్యాలయం సమీపంలో దళారులు ఉండొద్దని ఆదేశాలు జారీచేశారు.

రంగంలోకి దుకాణ యజమానులు..

ఆర్టీవో కార్యాలయం ఎదురుగా 20కి పైగా దుకాణాలున్నాయి. వాటిలో దళారులు ఉండొద్దని వాటిని నిర్మించిన యజమానులకు అధికారులు స్పష్టం చేశారు. దళారులు ఖాళీ చేయడం వల్ల అద్దె ఆగిపోతుందని భావించిన యజమానులు రంగంలోకి దిగారు. అధికారులు..దళారులకు మధ్య రాజీ కుదర్చడానికి వారు రంగంలోకి దిగినట్లు తెలిసింది. ఉన్నతాధికారులతో మంతనాలు జరిపినట్లు ప్రచారం. అయితే.. వారి సూచనల మేరకు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులను కలిసి.. సమస్య లేకుండా చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో ఆర్టీవో కార్యాలయం ఎదురుగా ఉన్న దుకాణాలు మళ్లీ తెరచుకున్నాయి.

దళారులకు అనుమతి లేదు.. - లావణ్య, ఎంవీఐ

అధికారుల పేరుచెప్పి వసూల్‌ చేస్తున్న దళారులకు కార్యాలయం లోపలికి అనుమతి లేదు. కార్యాలయం సమీపంలో దుకాణాలు తెరవొద్దని ఉన్నతాధికారులకు చెప్పాం. అయితే.. దుకాణాల యజమానులు అభ్యంతరం చెబుతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని