logo

గౌరవం ఏదీ..?

గౌరవ వేతనాల కోసం స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఎదురు చూస్తున్నారు.

Published : 04 Jul 2024 05:01 IST

‘స్థానిక’ ప్రజాప్రతినిధులకు అందని వేతనాలు

నల్గొండ జిల్లా పరిషత్‌ కార్యాలయం

జిల్లా పరిషత్‌లలో నిధుల కొరత వెంటాడుతోంది. ఆరు నెలలుగా జడ్పీ సమావేశాలు, స్టాండింగ్‌ కమిటీ సమావేశాలకు అయ్యే ఖర్చులకు సైతం ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. జిల్లా పరిషత్‌లలో సీఈవోలకు అద్దె వాహనాలు ఏర్పాటు చేశారు. వాటికి ఆరు నెలలుగా అద్దె చెల్లించలేదని సమాచారం.

నాంపల్లి, న్యూస్‌టుడే: గౌరవ వేతనాల కోసం స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఎదురు చూస్తున్నారు. జడ్పీ ఛైర్మన్‌ (జిల్లా ప్రజా పరిషత్‌), జడ్పీటీసీ(జిల్లా ప్రజా పరిషత్‌ ప్రాదేశిక కౌన్సిల్‌), ఎంపీపీ( మండల ప్రజా పరిషత్‌ అధ్యక్షుడు), ఎంపీటీసీ (మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గం) సభ్యులకు ఆరు నెలలుగా గౌరవ వేతనాలు రావడం లేదు. నేటితో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల పదవీకాలం ముగియనుంది. రాష్ట్రంలో 32 జిల్లా ప్రజాపరిషత్‌లు, 540 మండల ప్రజాపరిషత్‌లు ఉండగా.. వీటికి ఛైర్మన్లు, ఎంపీపీలు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 508 మంది జడ్పీటీసీˆలు, 5,782 మంది ఎంపీటీసీ సభ్యులున్నారు. జడ్పీ ఛైర్మన్లకు నెలకు రూ.లక్ష, జడ్పీటీసీలు, ఎంపీపీˆలకు రూ.13 వేలు, ఎంపీటీసీలకు రూ.6,500 గౌరవ వేతనం అందుతోంది. గత ప్రభుత్వం 2021లో 30 శాతం వరకు గౌరవ వేతనాలు పెంచింది.

ఆరు నెలలుగా..

స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గత డిసెంబరు వరకు గౌరవ వేతనం చెల్లించారు. ఆరు నెలలుగా వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. మరో వైపు జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలకు తక్కువగా నిధులు కేటాయించడంతో తాము అనుకున్న అభివృద్ధి చేయలేకపోయామని వాపోతున్నారు. నిధుల కేటాయింపు ఎక్కువగా జరగకపోవడంతో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు నిరాశగా ఉన్నారు. గ్రామాల్లో కొన్ని అభివృద్ధి పనులకు చేతి నుంచి ఖర్చు చేసుకున్నామని.. గౌరవ వేతనాలైనా వస్తాయనుకుంటే అవీ ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా పరిషత్‌లకు స్టాంప్‌డ్యూటీ, మినరల్, మైనింగ్‌ సెస్, వినోదపు పన్నుల రూపంలో నిధులు వచ్చేవి. 2019 నుంచి 2024 మధ్య కాలంలో సెస్‌లు, పన్నుల రూపంలో వచ్చే నిధులు రాలేదు. అలాగే జనాభా ప్రాతిపదికన సంవత్సరానికి ప్రతి వ్యక్తిపై రూ.8 చొప్పున మంజూరయ్యే నిధులు సైతం నిలిచిపోయాయి. 15వ ఆర్థిక సంఘం, స్పెషల్‌ గ్రాంట్, స్టేట్ మ్యాచింగ్‌ గ్రాంట్ నిధులు మాత్రమే జడ్పీటీసీలకు అభివృద్ధి నిధుల కింద అరకొరగా మంజూరయ్యాయి. ఐదేళ్ల పాలనలో అరకొర నిధుల కేటాయింపుతో అభివృద్ధి చేయలేకపోయామని స్థాని సంస్థల ప్రజాప్రతినిధులు పేర్కొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని