logo

సాంకేతికత మూలకేనా..!

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు నిరర్ధకం అయ్యాయి.

Updated : 04 Jul 2024 06:04 IST

హుజూర్‌నగర్‌ మండలంలోని ఓ ఉన్నత పాఠశాలలోని కంప్యూటర్‌ ల్యాబ్‌ దుస్థితి

హుజూర్‌నగర్, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు నిరర్ధకం అయ్యాయి. ప్రభుత్వం కోట్ల రూపాయలు పెట్టి కంప్యూటర్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేసినా వాటిని ఉపయోగించి విద్యార్థులకు అవగాహన కల్పించే బోధకులు లేరు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లోని 204 కంప్యూటర్‌ ల్యాబ్‌లు నిరుపయోగంగా మారాయి.
 ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 204 ఎంపిక చేసిన పాఠశాలలకు గత సంవత్సరం 1,433 కంప్యూటర్‌లు అందించారు. వాటిని వెంటనే అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కావాల్సిన చర్యలు తీసుకున్నారు. విద్యార్థులకు బోధించాలనే లక్ష్యంతో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్‌ చేశారు. వందలోపు విద్యార్థులు ఉంటే ఐదు, 101 నుంచి 200లోపు విద్యార్థులు ఉంటే ఎనిమిది కంప్యూటర్‌లు పంపిణీ చేశారు. రెండు వందలకు పైగా ఉంటే పది కంప్యూటర్‌లు అందించారు. అవగాహన ఉన్న ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధించుకునే అవకాశం కూడా కల్పించారు. కానీ ఉపాధ్యాయులు మాత్రం తమకు బడిలోనే తరగతులు సరిపోను ఉన్నందున కంప్యూటర్‌ను బోధించలేమని గత సంవత్సరమే చేతులెత్తేశారు.

 18 ఏళ్ల క్రితం ఇలా..

ప్రభుత్వ పాఠశాలలకు 18 సంవత్సరాల క్రితం కంప్యూటర్‌లను ఇచ్చి బోధించేందుకు పార్ట్‌టైమ్‌ బోధకులను నియమించారు. కొంత కాలం కంప్యూటర్‌ విద్య సక్రమంగానే సాగింది. తరువాత కంప్యూటర్ల మరమ్మతులు పట్టించుకోకపోవడంతో అన్ని పాఠశాలల కంప్యూటర్‌లు మూలకు పడ్డాయి. చివరకు కంప్యూటర్‌ బోధకులను కూడా తొలగించారు. 18 సంవత్సరాల తరువాత మళ్లీ ఎంపిక చేసిన పాఠశాలలకు కంప్యూటర్‌లు పంపిణీ చేశారు. కానీ బోధకుల నియామకాలు జరుపలేదు. గత సంవత్సరం కూడా బోధకులు లేకపోవడంతో బోధన జరగలేదు. పాఠశాలల్లో ఇప్పటికే కంప్యూటర్లు దుమ్ము పడుతున్నాయి. ప్రస్తుతం విద్యాసంవత్సరం ప్రారంభమైనందున ముందు నుంచే కంప్యూటర్‌ విద్యకు బోధకులను వెంటనే నియమిస్తారని విద్యార్థులు ఎదురు చూస్తున్నారు.

ఆదేశాలు రాగానే నియామకాలు జరుపుతాం

అశోక్, జిల్లా విద్యాశాఖాధికారి, సూర్యాపేట  

కంప్యూటర్‌ బోధకుల నియామకాలు జరగలేదు. ఈ విద్యాసంవత్సరం ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాగానే కంప్యూటర్‌ బోధకుల నియామకాలు నిర్వహించి, కంప్యూటర్‌ విద్యను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకు వస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని