logo

ప్రగతిచక్రంలో.. నియామకాల పర్వం

ఆర్టీసీలో కొలువుల జాతర మొదలు కానుంది. సుమారు 12 ఏళ్లుగా ఎటువంటి నియామకాలు లేకపోగా.. ఉద్యోగ విరమణ పొందుతున్న వారితో సిబ్బంది భారీగా తగ్గుతూ వస్తున్నారు.

Published : 04 Jul 2024 04:54 IST

మిర్యాలగూడ ఆర్టీసీ బస్టాండ్‌

మిర్యాలగూడ పట్టణం, న్యూస్‌టుడే: ఆర్టీసీలో కొలువుల జాతర మొదలు కానుంది. సుమారు 12 ఏళ్లుగా ఎటువంటి నియామకాలు లేకపోగా.. ఉద్యోగ విరమణ పొందుతున్న వారితో సిబ్బంది భారీగా తగ్గుతూ వస్తున్నారు. మరోవైపు ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరగడంతో సిబ్బందిపై పని ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నో ఏళ్లుగా నూతన నియామకాలు చేపట్టాలని కార్మికులు ఆందోళన చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఏడు డిపోలు ఉండగా.. సుమారు 1,818 మంది డ్రైవర్లు, కండక్టర్లు ఉన్నారు. గత పుష్కర కాలంలో వేల మంది కార్మికులు పదవీ విరమణ పొందారు. ప్రభుత్వ ప్రకటనతో ఉమ్మడి జిల్లాలోని కార్మికుల్లో హర్షం వ్యక్తమవుతుంది.

గతంలోనే ప్రతిపాదనలు..

ఉమ్మడి జిల్లాలోని ఏడు డిపోల పరిధిలో సిబ్బంది నియామకానికి గతంలోనే అధికారులు ప్రతిపాదనలు పంపించారు. ప్రస్తుతం వందల సంఖ్యలో డ్రైవర్లు, కండక్టర్లతో పాటు ప్రతి డిపోకు సుమారు 5 నుంచి 10 మంది మెకానిక్‌లు అవసరం ఉన్నారు. మరోవైపు ప్రస్తుతం దేవరకొండ డిపో మేనేజర్‌తో పాటు నల్గొండ ఏఎంఎఫ్‌ పోస్టులు సైతం ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి డిపోకు 50 మందికి పైగా డ్రైవర్లు, కండక్టర్లు అవసరం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.  

మూడేళ్లలో భారీగా తగ్గుదల..

ఉమ్మడి జిల్లాలోని ఏడు డిపోల పరిధిలో 2021లో సుమారు 1,227 మంది కండక్టర్లు, 1,150 మంది డ్రైవర్లు ఉండగా.. 2023లో కండక్టర్లు 1,104 మంది, డ్రైవర్లు 901 మంది ఉన్నారు. ప్రస్తుతం డ్రైవర్లు కేవలం 818 మంది మాత్రమే ఉండగా.. కండక్టర్లు 1,000 మంది ఉన్నారు. అంటే మూడేళ్లలో కండక్టర్లు 227 మంది తగ్గగా.. డ్రైవర్లు 332 మంది తగ్గారు. .

కేవలం డ్రైవర్‌ పోస్టుల నియామకం సరికాదు

తాళ్లపల్లి వినయ్‌కుమార్, ఎస్‌డబ్ల్యూఎఫ్‌ రీజినల్‌ సహాయ కార్యదర్శి

ఆర్టీసీలో నూతన పోస్టుల నియామకానికి ప్రభుత్వం పచ్చ జెండా ఊపడం హర్షణీయం. కేవలం డ్రైవర్ల నియామకాలు మాత్రమే చేపట్టడం సరికాదు. ఇప్పటికే మహాలక్ష్మి పథకంతో కండక్టర్లపై పని ఒత్తిడి పెరిగి మానసికంగా కుంగిపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో కండక్టర్ల కొరత కూడా ఉన్నందున వారి నియామకం సైతం చేపడితేనే ఉద్యోగులపై భారం తగ్గుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని