logo

చౌటుప్పల్‌ పట్టణాన.. పైవంతెన

చౌటుప్పల్‌ పట్టణంలో జాతీయ రహదారి- 65పై ఫ్లైఓవర్‌ నిర్మాణం కానుంది. వంతెన నిర్మాణానికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) రూ.114.40 కోట్లు మంజూరు చేసింది.

Published : 04 Jul 2024 04:51 IST

రూ.114.40 కోట్లు మంజూరు

చౌటుప్పల్‌ పట్టణంలో జాతీయ రహదారిపై నిర్మాణం కానున్న ఫ్లైఓవర్‌ వంతెన

చౌటుప్పల్, న్యూస్‌టుడే: చౌటుప్పల్‌ పట్టణంలో జాతీయ రహదారి- 65పై ఫ్లైఓవర్‌ నిర్మాణం కానుంది. వంతెన నిర్మాణానికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) రూ.114.40 కోట్లు మంజూరు చేసింది. పన్నెండేళ్లుగా ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని జాతీయ రహదారిని దాటడానికి పడుతున్న బాధలు తొలగనున్నాయి. రెండు వరుసలుగా ఉన్న హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిని 2012లో నాలుగు వరుసలుగా నిర్మించారు. అప్పట్లోనే పట్టణ ప్రజలకు ఇబ్బంది జరుగకుండా జాతీయ రహదారిపై రాకపోకలు సాగించే వాహనాలు, కింది నుంచి స్థానిక వాహనాలు రాకపోకలు సాగించే విధంగా ఫ్లైఓవర్‌ రోడ్డు నిర్మాణం చేయాలని నిర్ణయించారు. మట్టి కట్ట నిర్మించి అండర్‌ పాస్‌లు ఏర్పాటు చేస్తే చౌటుప్పల్‌ పట్టణం రెండు భాగాలుగా విడిపోతుందని, వ్యాపారాలు దెబ్బతింటాయని వ్యతిరేకించి ఆందోళనలు నిర్వహించడంతో ఆ ప్రతిపాదనను రద్దు చేశారు. అంతకు ముందున్న రోడ్డునే నాలుగు వరుసలుగా నిర్మించి రెండు చోట్ల పాదచారుల వంతెనలు ఏర్పాటు చేశారు. దేశంలో అండర్‌ పాస్‌ లేకుండా పట్టణం మధ్య నుంచి చౌటుప్పల్, చిట్యాలలో మాత్రమే జాతీయ రహదారిని నిర్మించారు. రోజుకు సగటున ఈ రోడ్డుపై 35 వేల నుంచి 40 వేల వాహనాలు ఈ రోడ్డుపై రాకపోకలు సాగిస్తున్నాయి.

ఫ్లైఓవర్‌ నిర్మాణం ఇలా...

చౌటుప్పల్‌ పట్టణంలో జాతీయ రహదారిపై 2.45 కిలోమీటర్ల పొడవు ఫ్లైఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం చేయనున్నారు. తహసీల్‌ కార్యాలయానికి వెళ్లే దారి దగ్గర్నుంచి వలిగొండ చౌరస్తా వరకు మట్టితో వంతెనను నిర్మించనున్నారు. మధ్యలో ఆర్టీసీ బస్‌స్టేషన్‌ నుంచి పోలీస్‌ స్టేషన్‌ వరకు 200 మీటర్ల పొడవు మట్టి కట్ట కాకుండా సిమెంటు పిల్లర్లతో ఎలివేటెడ్‌ కారిడార్‌ ఏర్పాటు చేయనున్నారు. బస్‌స్టేషన్, తంగడపల్లి చౌరస్తాల వద్ద జాతీయ రహదారిని దాటే అవకాశముంటుంది. సిమెంటు స్తంభాల మధ్యలో ఆహ్లాదాన్ని కల్గించేలా పూలమొక్కలు పెంచనున్నారు. భాస్కర్‌ టాకీస్‌ ఎదుట 3.5 మీటర్ల వెడల్పుతో పాదచారులు దాటేందుకు పీయూపీ ఏర్పాటు చేయనున్నారు. వలిగొండ చౌరస్తాలో 30 మీటర్ల వెడల్పుతో వెహికిల్‌ అండర్‌ పాస్‌ (వీయూపీ) నిర్మించనున్నారు.

పట్టణం ఎంతో అభివృద్ధి..

చౌటుప్పల్‌ పురపాలికను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి సహకారంతో రానున్న యాభై ఏళ్ల జనాభాను, అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆదర్శవంతంగా అభివృద్ధి చేస్తున్నామని పురపాలిక ఛైర్మన్‌ వెన్‌రెడ్డి రాజు తెలిపారు. విలేకరుల సమావేశంలో పట్టణ అభివృద్ధిని బుధవారం వివరించారు. రూ.114.40 కోట్లతో జాతీయ రహదారిపై ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని