logo

తప్పు నుంచి మెప్పు దిశగా..!

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జైళ్లలో జీవిత ఖైదు అనుభవిస్తున్న 213 మంది ఖైదీలను  సత్ప్రవర్తన పేరుతో ప్రభుత్వం విడుదల చేసింది.

Updated : 04 Jul 2024 05:15 IST

నల్గొండ జైలు నుంచి నలుగురికి విముక్తి

నల్గొండ అర్బన్, న్యూస్‌టుడే: రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జైళ్లలో జీవిత ఖైదు అనుభవిస్తున్న 213 మంది ఖైదీలను  సత్ప్రవర్తన పేరుతో ప్రభుత్వం విడుదల చేసింది. శిక్షా  కాలంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా జిల్లా జైలు నుంచి నలుగురు జీవిత ఖైదీలు బుధవారం విడుదలయ్యారు. ఖైదీల కుటుంబ సభ్యుల కోరిక మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, కేంద్ర ప్రభుత్వ సూచనలతో ఖైదీల విడుదలకు శ్రీకారం చుట్టారు. జైలు జీవితం నుంచి బయటకు వచ్చిన వారు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలని భావించిన జైళ్లశాఖ అధికారులు.. వారికి తగిన ఉపాధి కల్పించాలనే సంకల్పంతో విడుదలైన ఖైదీలకు పెట్రోల్‌ బంకులు, కుట్టుమిషన్లు, ఉపాధి మార్గాలు సైతం చూపనున్నారు. జిల్లా జైలు నుంచి విడుదలైన నలుగురితో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన మరో పది మందికి జిల్లా జైలు ప్రాంగణంలో ఉన్న పెట్రోల్‌ బంకులో ఉపాధి కల్పించనున్నారు. జైలు నుంచి ఇళ్లకు వెళ్లిన వారు రెండు రోజుల్లో తిరిగి బంకులో విధులు నిర్వర్తించనున్నారు.

సంతోషంగా ఉంది

టి.నాగయ్య, నిడమనూరు

హత్య కేసులో న్యాయమూర్తి జీవిత ఖైదు వేయడంతో 18 ఏళ్లుగా వివిధ జైళ్లలో జీవితం అనుభవిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా నాకు మరో జీవితం ప్రసాదించినట్లయింది. మిగిలిన జీవిత కాలం కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటా. ఇక చిన్న తప్పుకూడా చేయకూడదని నిర్ణయించుకున్నాను. బయటకు వెళ్లిన వెంటనే ఉపాధి కష్టంగా ఉంటుందని జైలు అధికారులు పెట్రోల్‌ బంకులో పని కల్పిస్తున్నారు. నెలకు రూ.15 వేలు జీతం ఇస్తామని చెప్పారు.

తప్పు తెలుసుకున్నాను

యు.పాండు, మెదక్‌

దొంగతనం, హత్య కేసులో జీవితఖైదుగా 18 ఏళ్లుగా జైలు జీవితం అనుభవిస్తున్నాను. జైలులో అమలు చేస్తున్న చదువు, యోగా, ధ్యానం వంటి కార్యక్రమాల మూలంగా నాలో మార్పు వచ్చింది. ప్రభుత్వ నిర్ణయంతో కొత్త జీవితంలోకి వెళ్తున్నా. ఎలాంటి తప్పులు చేయకుండా ఉంటా. తప్పు చేయాలనుకునే వారికి నా వంతుగా సూచనలు చేస్తాను. జైలు అధికారులు చూపించిన మంచి మార్గంలో పెట్రోల్‌ బంకులో పనిచేస్తూ కుటుంబ సభ్యులకు అండగా ఉంటా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు