logo

అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి

అనుమానాస్పద స్థితిలో వసతిగృహ విద్యార్థి మృతి చెందిన ఘటన మండల కేంద్రంలోని ఎస్సీ సాంఘిక సంక్షేమ వసతి గృహంలో బుధవారం చోటు చేసుకుంది.

Published : 04 Jul 2024 04:44 IST

విద్యార్థి మృతిపై వసతి గృహ విద్యార్థులను విచారిస్తున్న సూర్యాపేట ఆర్డీవో వేణుమాధవరావు, డీఎస్పీ జి.రవి

ఆత్మకూర్‌(ఎస్‌), న్యూస్‌టుడే: అనుమానాస్పద స్థితిలో వసతిగృహ విద్యార్థి మృతి చెందిన ఘటన మండల కేంద్రంలోని ఎస్సీ సాంఘిక సంక్షేమ వసతి గృహంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, వసతి గృహ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేటకు చెందిన మెల్లం శ్యామ్‌కుమార్‌(13) ఆత్మకూర్‌(ఎస్‌) ఎస్సీ సాంఘిక సంక్షేమ వసతిగృహంలో ఉంటూ, ఆదర్శ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. అర్ధరాత్రి వేళ మూత్రశాలకు వెళ్లి వచ్చిన శ్యామ్‌ అకస్మాత్తుగా అస్వస్థతకు గురై వరండాలో విరేచనాలు చేసుకున్నాడు. తనకు భయంగా ఉందని తోటి విద్యార్థులకు చెప్పడంతో తమ దగ్గర పడుకోబెట్టుకున్నారు. తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో చదువుకునేందుకు నిద్రలేచిన తోటి విద్యార్థులు.. శ్యామ్‌ను లేపడానికి ప్రయత్నించారు. ఎంతకూ కదలక పోవడంతో వసతి గృహంలో ఉన్న వంట మనిషిని పిలిచారు. అతను వచ్చి పరిశీలించి వెంటనే చికిత్స కోసం సూర్యాపేట జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లుగా నిర్ధారించారు. అర్ధరాత్రి వేళ విష పురుగు కరవడంతో చనిపోయినట్లుగా భావిస్తున్నారు. బాలుడి మృతిపై తమకు అనుమానం ఉందని బాలుడి పెద్దమ్మ సైదమ్మ  ఫిర్యాదు చేయడంతో ఎస్సై వై.సైదులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

  • బాలుడి తల్లిదండ్రులిద్దరూ గతంలో చనిపోయారు. తల్లి మాధవి ఆరేళ్ల క్రితం చనిపోగా, తండ్రి రెండేళ్ల క్రితం మృతి చెందాడు. కన్నవారిని కోల్పోయిన శ్యామ్‌ పెద్దమ్మ వద్ద ఉంటూ ఏడాది క్రితం పాఠశాలలో చేరాడు.  
  • బాలుడి అనుమానాస్పద మృతిపై విచారణ నిర్వహించేందుకు సూర్యాపేట ఆర్డీవో వేణుమాధవరావు, డీఎస్పీ జి.రవి స్థానిక వసతి గృహంలో విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాత్రి నుంచి తెల్లవారే వరకు ఏం జరిగిందో ఆరా తీశారు. కంపచెట్లతో కూడుకున్న వసతిగృహ పరిసరాలను, వసతులను పరిశీలించారు. విధులపై తీవ్రస్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ పూర్తి నివేదికను కలెక్టర్‌కు నివేదిస్తామని ఆర్డీవో తెలిపారు.

మెల్లం శ్యామ్‌కుమార్‌


సరదా కోసం వెళ్తే.. మృత్యు ఒడిలోకి

ఇషిత (అమ్ములు)

అడ్డగూడూరు, న్యూస్‌టుడే: ఓ పాప తెలియక వాహనానికి ఉన్న స్టార్ట్‌ బటన్‌ను నొక్కడంతో ఒక్కసారిగా ద్విచక్రవాహనం ముందుకు కదిలి బ్రిడ్జి కింద పడిపోవడంతో ఆ చిన్నారి మృతి చెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం చిర్రగూడూరులో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. బంధువులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మొలుగూరి శివ - ఉమారాణి దంపతులు కుమార్తె ఇషిత (అమ్ములు) (3) ఇంట్లో మారాం చేస్తుండడంతో సరదా కోసం ద్విచక్రవాహనంపై తన ముందు కూర్చోబెట్టుకొని తండ్రి అలా రోడ్డు వైపు తీసుకెళ్లారు. బ్రిడ్జి పైకి వెళ్లగానే తండ్రికి ఫోన్‌ రావడంతో వాహనాన్ని పక్కనే నిలిపి ఫోన్‌ మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో పాప తెలియక వాహనానికి ఉన్న స్టార్ట్‌ బటన్‌ను నొక్కింది. ఒక్కసారిగా ద్విచక్రవాహనం ముందుకు కదిలి నూతనంగా నిర్మాణ పనులు జరుగుతున్న బ్రిడ్జి కిందకు పడిపోయింది. ప్రమాదంలో తండ్రికి స్వల్ప గాయాలు కాగా, కూతురు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం సూర్యాపేటకు తరలిస్తుండగా ..మార్గమధ్యలో మృతిచెందింది. పాప తల్లి ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుండగా, వృత్తి రీత్యా పాఠశాలకు వెళ్లింది. తండ్రి తన కుమార్తె ఆలనా పాలనా చూస్తుండేవారు. ఈ విషయమై ఎస్సై డి.నాగరాజును వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.


పది కిలో మీటర్లు రైలు ఇంజిన్‌కు వేలాడిన వృద్ధుడి మృతదేహం

బీబీనగర్, న్యూస్‌టుడే: వృద్ధుడి మృతదేహం రైలు ఇంజిన్‌కు వేలాడుతూ సుమారు 10 కిలోమీటర్లు వెళ్లిన హృదయ విదారకర సంఘటన బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు, రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వలిగొండ మండలం దుప్పెల్లి గ్రామానికి చెందిన ఎర్ర ఫకీర్‌ (80) మతి స్థిమితం లేక ఉన్నాడు. భువనగిరి పట్టణంలో నివాసముంటున్న కుమారుడు ఎర్ర ఉపేందర్‌ నాలుగు రోజుల కిందట తండ్రిని తన వద్దకు తీసుకొచ్చుకున్నాడు. భువనగిరిలోని కుమారుడి ఇంట్లో నుంచి మంగళవారం తెల్లవారుజామున బయటకు వెళ్లిన ఫకీర్‌ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో సమాచారమిచ్చారు. ఇదిలా ఉండగా మంగళవారం సాయంత్రం వరంగల్‌ - సికింద్రాబాద్‌ మార్గంలోని బీబీనగర్‌ శివారు కొండమడుగుమెట్టు సమీపంలోని రైల్వే గేటు వద్ద రైలింజిన్‌కు వేలాడుతున్న మృతదేహాన్ని గమనించిన స్థానికులు రైల్వే సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో సదరు రైలును బీబీనగర్‌కు పది కిలోమీటర్ల దూరంలోని మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా ఘట్కేసర్‌ రైల్వే స్టేషన్‌లో ఆపి రైలు ఇంజిన్‌ ముందు భాగంలో ఇరుక్కు పోయిన మృతదేహాన్ని తీసి సికింద్రాబాద్‌ ఆసుపత్రికి శవపరీక్ష నిమిత్తం తరలించారు. మతి స్థిమితం లేని వృద్ధుడు పట్టాలు దాటుతుండగా ప్రమాదం జరిగిందా లేక తానే బలవన్మరణానికి పాల్పడ్డాడా అని తెలియరాలేదు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని