logo

నిరుద్యోగుల నిరీక్షణ!

ప్రభుత్వ కొలువులు దక్కని, ఉన్నత చదువులు చదివిన యువతకు ప్రభుత్వం జిల్లా కేంద్రంలో ప్రతినెల ఉద్యోగ మేళాను నిర్వహిస్తోంది.

Published : 04 Jul 2024 04:27 IST

జిల్లాలో ఉద్యోగ మేళాకు యువత ఎదురుచూపులు

సూర్యాపేట: ఉద్యోగ మేళాకు హాజరైన యువత (పాతచిత్రం)

సూర్యాపేట కలెక్టరేట్, న్యూస్‌టుడే: ప్రభుత్వ కొలువులు దక్కని, ఉన్నత చదువులు చదివిన యువతకు ప్రభుత్వం జిల్లా కేంద్రంలో ప్రతినెల ఉద్యోగ మేళాను నిర్వహిస్తోంది. యువత ఈ మేళాను సద్వినియోగం చేసుకుని ప్రైవేటు ఉద్యోగాలలో స్థిరపడుతుండటంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరినట్లు అవుతుంది. కాగా ఏడాది కాలంగా ఉద్యోగ మేళాలు నిర్వహించకపోవడంతో నిరుద్యోగులకు నిరీక్షణ తప్పడం లేదు. ఎప్పుడు నిర్వహిస్తారోనని జిల్లా కార్యాలయానికి వచ్చి ఆరా తీస్తున్నారు. ఈ విషయమై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత లేకపోవడంతో యువత ఎదురు చూస్తున్నారు.

3,246 మంది సద్వినియోగం..

జిల్లా కేంద్రంలో గతంలో ప్రతి నెల జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రైవేటు కంపెనీలు పాల్గొని ముఖాముఖి, అర్హతలను బట్టి వారికి ఉద్యోగాలు కేటాయించారు. ఇప్పటి వరకు గత అయిదేళ్లలో జిల్లా వ్యాప్తంగా 3,246 మంది యువత వివిధ కంపెనీలలో ఉద్యోగం పొంది స్థిరపడ్డారు.

స్థానికంగా కంపెనీలు ఉన్నా..

జిల్లా కేంద్రంలో నిర్వహించే ఉద్యోగ మేళాలో ఎక్కువగా హైదరాబాద్‌ నుంచి వచ్చిన కంపెనీలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో నిరుద్యోగులు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. జిల్లాలో ప్రైవేటు కంపెనీలు అధికంగానే ఉన్నాయి. ఈ ఉద్యోగ మేళాల్లో స్థానిక కంపెనీలలో అర్హతను బట్టి ఉద్యోగం కల్పించినట్లయితే మరికొందరు యువత సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా జిల్లా కార్యాలయాల్లో, విద్యాసంస్థల్లో, మెడికల్‌ కళాశాలల్లో, ఒప్పంద పద్ధతిన తీసుకునేందుకు ఈ మేళాల ద్వారానే తీసుకుంటే యువతకు ప్రయోజనం చేకూరుతోంది.

ఉద్యోగం కల్పిస్తే ప్రయోజనం

ప్రదీప్, సూర్యాపేట: ప్రభుత్వం స్పందించి ఉద్యోగ మేళాలు నిర్వహించాలి. స్థానికంగా ఉద్యోగం కల్పిస్తే ప్రయోజనం చేకూరుతోంది. ఆ దిశగా ఆలోచన చేస్తే నిరుద్యోగులు ఉద్యోగ మేళాలు సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంది.


త్వరలో నిర్వహిస్తాం

అక్బర్, జిల్లా ఉపాధి కల్పనాధికారి, సూర్యాపేట

ఉద్యోగ మేళాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. త్వరలో ప్రభుత్వ అనుమతితో నిర్వహిస్తాం. ఉద్యోగాలు కల్పించేందుకు నిరంతరం చర్యలు తీసుకుంటున్నాం. స్థానిక కంపెనీల విషయమై ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే నిర్వహిస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని