logo

నేరస్థులను పట్టిస్తోంది నిఘా నేత్రం

నేరాల నియంత్రణకు, నేరస్థులను పట్టుకునేందుకు, కోర్టులో శిక్ష పడేందుకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని పోలీసులు చెబుతున్నారు.

Published : 03 Jul 2024 04:10 IST

చౌటుప్పల్‌గ్రామీణం, న్యూస్‌టుడే: నేరాల నియంత్రణకు, నేరస్థులను పట్టుకునేందుకు, కోర్టులో శిక్ష పడేందుకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. చౌటుప్పల్‌ మున్సిపాలిటీతో పాటు, ప్రతి గ్రామంలోను, హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి పొడవునా కెమెరాలను ఏర్పాటు చేసి పోలీసులు పక్కాగా పర్యవేక్షిస్తున్నారు. పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో మొత్తం 435 సీసీ కెమెరాలను బిగించి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల 55 కెమెరాలు పని చేయడం లేదని గుర్తించి వెంటనే మరమ్మతులు చేయించారు. హోటళ్లు, దుకాణాలు, బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లు, పెట్రోల్‌ బంకులు, పరిశ్రమల్లో నేను సైతంలో భాగంగా 5వేల కెమెరాలను ఏర్పాటు చేయించారు. చౌటుప్పల్‌లో పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన సుమారు 20వేల మంది ఉద్యోగులు, కార్మికులు పని చేస్తారు. కెమెరాలు ఉంటే ఘటన జరిగిన వెంటనే చేధించవచ్చని పోలీసులు ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు.

ఛేదించిన కేసులు

  • చౌటుప్పల్‌ బస్టాండ్‌ వద్ద మార్చి 3న రాత్రి ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తుండగా అతని మెడలోని బంగారు గొలుసును సూర్యాపేటకు చెందిన హరకావత్‌ వెంకన్న లాక్కొని పారిపోయాడు. నిందితుడిని సీసీ కెమెరాల్లో గుర్తించారు. పట్టుకొని రిమాండ్‌కు తరలించారు.
  • తంగడపల్లిలో మార్చి 25న ఒంటరిగా వృద్ధురాలి మెడలోని 3.5తులాల గొలుసును ఓ యువకుడు లాక్కెళ్లాడు. కెమెరాల ద్వారా నిందితుడు దేవలమ్మనాగారానికి చెందిన సిలువేరు ప్రవీణ్‌గా గుర్తించి అరెస్ట్‌ చేశారు.
  • మసీదుగూడెంలో కన్నతల్లినే కుమారుడు హతమార్చాడు. ఈ విషయం కుటుంబ సభ్యులకు కూడా తెలియదు. సెల్‌టవర్‌ లొకేషన్‌తో పాటు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు.
  • హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనాలను ఢీకొని గాయపడటం, చనిపోతుంటారు. 5 నెలల్లోనే 23 వాహనాలను గుర్తించారు. జాతీయ రహదారిపై ప్రధాన కూడళ్ల వద్ద, ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో విభాగినుల మధ్యలో సీసీ కెమెరాలను బిగించారు. రాత్రి వేళ్లలో వాహనాల నంబర్లు స్పష్టంగా కనిపించేలా నాణ్యమైన కెమెరాలను ఏర్పాటు చేశారు.

తప్పుడు సమాచారం ఇచ్చినా దొరుకుతారు..

లక్కారంలోని తన దుకాణంలో చోరీ జరిగిందని రూ.లక్ష నగదు మాయమైందని యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితులను ఏపీలోని గుంతకల్లులో అరెస్ట్‌ చేసి తీసుకొని రాగా రూ.25వేల ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. సీసీ కెమెరాలను చూడగా నగదు ఎత్తుకెళ్లినట్లు తేలిపోయింది. తంగడపల్లి రోడ్డులో రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో జరిగిన ఘర్షణలో బంగారు గొలుసు మాయమైందని ఒకరు ఫిర్యాదు చేయగా అక్కడ కెమెరాలను పరిశీలించగా గొలుసు పోలేదని తెలిసింది. తప్పుడు ఫిర్యాదులు ఇచ్చిన దొరికిపోతారని పోలీసులు పేర్కొంటున్నారు.

పక్కాగా నిర్వహణ: అశోక్‌రెడ్డి, పోలీస్‌ ఇన్‌స్పెక్టర్, చౌటుప్పల్‌

డీసీపీ రాజేశ్‌చంద్ర ఆదేశాల మేరకు సీసీ కెమెరాల ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేస్తున్నాం. ప్రతి గ్రామంలో, సరిహద్దు ప్రాంతాల్లో కెమెరాలు ఏర్పాటు చేసి మానిటరింగ్‌ చేస్తున్నాం. దేవాలయాలు, మసీదులు, ప్రార్థన మందిరాలు, వ్యాపార సంస్థలు తప్పకుండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని నోటీసులు ఇస్తున్నాం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు