logo

ఆర్‌ఆర్‌ఆర్‌ భూసేకరణ వేగిరం

రాజధాని హైదరాబాద్‌తో పాటూ పరిసర ప్రాంతాలకు సంబంధించి వచ్చే 30 ఏళ్ల అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతమున్న బాహ్య వలయ రహదారి (ఓఆర్‌ఆర్‌)కి అవతల 30 కి.మీ. దూరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మించనున్న ప్రాంతీయ వలయ రహదారి (ఆర్‌ఆర్‌ఆర్‌) నిర్మాణ ప్రక్రియ ఉమ్మడి జిల్లాలో వడివడిగా సాగుతోంది.

Published : 03 Jul 2024 05:36 IST

ఉమ్మడి జిల్లాలో 100 కి.మీ. పైగానే రహదారి పనులు

ఈనాడు, నల్గొండ - న్యూస్‌టుడే, భువనగిరి : రాజధాని హైదరాబాద్‌తో పాటూ పరిసర ప్రాంతాలకు సంబంధించి వచ్చే 30 ఏళ్ల అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతమున్న బాహ్య వలయ రహదారి (ఓఆర్‌ఆర్‌)కి అవతల 30 కి.మీ. దూరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మించనున్న ప్రాంతీయ వలయ రహదారి (ఆర్‌ఆర్‌ఆర్‌) నిర్మాణ ప్రక్రియ ఉమ్మడి జిల్లాలో వడివడిగా సాగుతోంది. ప్రాజెక్టు నిర్మాణానికి త్వరితగతిన నిధులు మంజూరు చేయాలని సంబంధిత రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ర్‌ెడ్డి ఇటీవలే కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని కోరడంతో ఆయన సమ్మతించారు. మంత్రి ప్రత్యేక దృష్టితో ఉత్తర, దక్షిణ భాగాల భూ సేకరణ ప్రక్రియను వచ్చే మూడు, నాలుగు నెలల్లోనే పూర్తి చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్తర భాగానికి సంబంధించి యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్, భువనగిరి ఆర్డీవోల పరిధిలో భూ సేకరణ జరుగుతుండగా..దక్షిణ భాగానికి సంబంధించి యాదాద్రి, నల్గొండ జిల్లాల పరిధిలో భూ సేకరణ క్రతువు సాగనుంది. యాదాద్రి కలెక్టరు హనుమంత్‌ కే.జెండగే ఇటీవలే అధికారులతో సమీక్షించి సాధ్యమైనంత తొందరగా ఉత్తర భాగం భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు.

ఉమ్మడి జిల్లాలో 100 కి.మీ. వరకు

  • ఉత్తర మార్గంలో సంగారెడ్డి నుంచి నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, జగదేవ్‌పూర్, తుర్కపల్లి, యాదగిరిగుట్ట, భువనగిరి, వలిగొండ, చౌటుప్పల్‌ వరకు 158 కి.మీ.మేర రహదారిని నిర్మించనున్నారు. ఈ మార్గం ఉమ్మడి జిల్లాలో 59.33 కి.మీ. మేర ఉండనుంది. అధికారులు ప్రతిపాదించిన మేరకు ఈ మార్గం ఐదు మండలాలు, 24 గ్రామాల మీదుగా వెళుతోంది. 649.85 హెక్టార్ల భూమి అవసరం అవుతుందని అంచనా వేయగా.. ఇప్పటికే అధికారులు 599.71 హెక్టార్ల భూ సేకరణకు సంబంధించి నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఇంకా 50.06 హెక్టార్లకు నోటిఫికేషన్‌ ఇవ్వాల్సి ఉంది.
  • భువనగిరి మండలం రాయిగిరితో (కలెక్టరేట్‌కు ఎదురుగా)పాటూ చౌటుప్పల్, వలిగొండ వద్ద ఇంటర్‌ఛేంజ్‌ జంక్షన్లు రానున్నాయని గతంలోనే అధికారులు నిర్ణయించారు. అయితే రాయిగిరి వద్ద అలైన్‌మెంట్‌ను మార్చాలని రైతులు గత కొన్నాళ్లుగా ఆందోళన చేస్తున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలకు ముందు భువనగిరి ఎంపీగా ఉన్న ప్రస్తుత ఆర్‌అండ్‌బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని అలైన్‌మెంట్‌ను మార్చి తమకు న్యాయం చేయాలని కోరారు. దీంతో రైతులకు అన్యాయం జరగకుండా రహదారి నిర్మాణం చేపట్టే విధంగా చర్యలు చేపడుతామని ఆయన హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఆయనే మంత్రిగా ఉండటంతో తమకు న్యాయం దక్కుతుందని ఇక్కడి ప్రజలకు భావిస్తున్నారు. దీనిపై రైతులు న్యాయం కోసం కోర్టును ఆశ్రయించగా..అలైన్‌మెంట్‌ మార్చి దీనిపై ఉన్న స్టేను ఎత్తివేసే విధంగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు.
  • మరోవైపు దక్షిణ భాగం చౌటుప్పల్, సంస్థాన్‌ నారాయణపూర్, మర్రిగూడ, ఆమన్‌గల్, షాద్‌నగర్, కంది, సంగారెడ్డి వరకు నిర్మించనున్నారు. ఇది సుమారు 181 కి.మీ. వరకు ఉండగా.. యాదాద్రి, నల్గొండ జిల్లాల్లోని చౌటుప్పల్, నారాయణపూర్, మర్రిగూడ మండలాల్లో కలిపి సుమారు 40 కి.మీ.మేర రహదారి ఉండే అవకాశం ఉందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. 250కి పైగా హెక్టార్ల భూమి అవసరం అవుతుందని భావిస్తుండగా..మరికొన్ని రోజుల్లో దక్షిణ భాగం భూ సేకరణపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఉత్తర, దక్షిణ భాగాలను కలిపి ఉమ్మడి జిల్లాలో ఆర్‌ఆర్‌ఆర్‌ 100 కి.మీ. మేర విస్తీర్ణంలో ఉంటుందని తెలిసింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని