logo

కొత్త న్యాయచట్టాలతో బాధితులకు ఊరట

దేశవ్యాప్తంగా జులై ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త న్యాయ చట్టాలు భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌), భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్‌), భారతీయ సాక్ష్య అధినీయం (బీఎస్‌ఏ) ద్వారా బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ వెల్లడించారు.

Published : 03 Jul 2024 04:01 IST

నల్గొండ జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌

ఈనాడు, నల్గొండ : దేశవ్యాప్తంగా జులై ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త న్యాయ చట్టాలు భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌), భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్‌), భారతీయ సాక్ష్య అధినీయం (బీఎస్‌ఏ) ద్వారా బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ వెల్లడించారు. ఈ చట్టాల ద్వారా కేసుల పురోగతిని బాధితులు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని, బాధ్యులపై దర్యాప్తు అధికారి ఎలాంటి చర్యలు తీసుకున్నారో కచ్చితంగా తెలియజేయాల్సిన అవసరం ఉంటుందన్నారు. జిల్లాలోని ప్రతి పోలీసుకు కొత్త చట్టాలపై అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలోని సామాన్యులకూ న్యాయం దక్కే విధంగా పోలీసింగ్‌ ఉంటుందని స్పష్టం చేశారు. శాంతిభద్రతలతో పాటూ జిల్లాలోని పలు అంశాలపై ఆయన ‘ఈనాడు’తో మంగళవారం ప్రత్యేకంగా మాట్లాడారు.

ప్రత్యేక శిక్షణ

కొత్త చట్టాలపై జిల్లాలోని ప్రతి పోలీసు అవగాహన పెంచుకునే విధంగా శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేశాం. నెల రోజుల నుంచి ఈ క్రతువు సాగుతోంది. మూడు బ్యాచులుగా విభజించి ప్రతి పోలీసు సబ్‌ డివిజన్‌కు ముగ్గురు శిక్షకుల చొప్పున ఆ సబ్‌డివిజన్‌లో ఉన్న పోలీసులకు అవగాహన కల్పిస్తున్నారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదుతో పాటూ కేసుల దర్యాప్తు, ఇతర విషయాల్లో పోలీసులకు ఏవైనా సందేహం వస్తే వారి సందేహాల నివృత్తికి జిల్లా పోలీసు కార్యాలయంలో ఇన్వెస్టిగేషన్‌ సపోర్ట్‌ సెంటర్‌ (దర్యాప్తు సహాయ కేంద్రం) ఏర్పాటు చేశాం. టోల్‌ఫ్రీ ద్వారా వారి సందేహాలను ఈ కేంద్రంలో నమోదు చేస్తే 24 గంటల్లో పరిష్కారం చూపిస్తుంది. తొలి రోజు కొత్త చట్టాల కింద జిల్లాలో ఏడు ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేశాం. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన 90 రోజుల్లోగా కేసు పురోగతిని నేర బాధితుడికి డిజిటల్‌ రూపంలో లేదా ఇతర విధానంలోనైనా తెలియజేయాలి. ఒకవేళ వివిధ కారణాల వల్ల 90 రోజుల్లో కేసు దర్యాప్తు పూర్తవ్వకపోతే అప్పటి కేసు పురోగతి పరిస్థితి ఏంటో తెలపాలి. దీని వల్ల బాధితులకు సత్వర న్యాయం అందడానికి వీలవుతుంది.

ఏ రూపంలోనైనా ఫిర్యాదు చేయవచ్చు

బాధితుడు ఎస్‌ఎంఎస్, వాట్సప్, ఈ - మెయిల్‌ ఇతర సామాజిక మాధ్యమాలు వేటి ద్వారానైనా ఫిర్యాదు చేయవచ్చు. మూడు రోజుల్లోగా సంబంధిత పోలీసుస్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేస్తే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తారు. కేసు నమోదు చేశాక దాని ప్రతి ఇవ్వడంతో పాటూ కేసు పురోగతిని సంబంధిత పోలీసులు ఎప్పటికప్పుడు తెలియజేయడంతో దర్యాప్తులో జాప్యం చోటు చేసుకోదు.

దొంగతనాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు

దొంగతనాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. పాత నేరస్థులపై నజర్‌ పెట్టి ఇప్పటి వరకు చాలా మందిని బైండోవర్‌ చేశాం. జిల్లాలో ఏ చిన్న దొంగతనంలో భాగస్వామిగా ఉన్న పాత నేరస్థుడైనా వారిపై ఎప్పటికప్పుడు నిఘా పెడుతున్నాం. క్షేత్రస్థాయిలో పర్యటనల ద్వారా అక్కడి సమస్యలపై దృష్టి సారిస్తున్నాను. భూ తగాదాలు, ఇతర సివిల్‌ అంశాల్లో తలదూర్చవద్దని మా అధికారులు, సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలిచ్చాను. బాధ్యులకు అండగా ఉన్నా... కేసుల దర్యాప్తులో జాప్యం చేసినా శాఖ పరమైన చర్యలు తీసుకుంటాం.

గంజాయిపైనా...నిరంతర పర్యవేక్షణ

జాతీయ రహదారితో పాటూ నల్గొండ జిల్లాలో గంజాయి లభ్యత, సరఫరా మార్గాలపై ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చాం. ఇటీవలే మిర్యాలగూడలో ఓ ముఠాను పట్టుకున్నాం. వారి ద్వారా అనేక సమాచారం సేకరించాం. నల్గొండతోపాటూ మిర్యాలగూడ, దేవరకొండ లాంటి పట్టణాల్లో ఎక్కడా గంజాయి దొరక్కుండా పకడ్బందీగా నిఘా పెడుతున్నాం. ఎక్కడైనా గంజాయి సరఫరా, రవాణా లాంటివి తెలిస్తే మాకు సమాచారం ఇవ్వండి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని