logo

కస్తూర్బాల్లో కష్టాలు..

చదువులు సాగిద్దామంటే సమస్యలు దండిగా ఉంటున్నాయి. పరిష్కరిద్దామంటే నిధుల కష్టం.. ఇవి కస్తూర్బాగాంధీ బాలికల గురుకుల విద్యాలయా(కేజీబీవీ)ల్లో ఎదురవుతున్న ఇబ్బందులు.

Updated : 03 Jul 2024 05:40 IST

గరిడేపల్లి కస్తూర్బా విద్యాలయంలో ఊడిపోయిన సౌర పలకలు

గరిడేపల్లి, న్యూస్‌టుడే: చదువులు సాగిద్దామంటే సమస్యలు దండిగా ఉంటున్నాయి. పరిష్కరిద్దామంటే నిధుల కష్టం.. ఇవి కస్తూర్బాగాంధీ బాలికల గురుకుల విద్యాలయా(కేజీబీవీ)ల్లో ఎదురవుతున్న ఇబ్బందులు. చదువు మధ్యలోనే మానేసి ఆర్థిక ఇబ్బందులతో ఇంటికి పరిమితమయ్యే బాలికలకు విద్యనందించేందుకు ప్రభుత్వం కస్తూర్బాగాంధీ విద్యాలయాలను ఏర్పాటు చేసింది. ప్రతి పాఠశాలలో 200 మంది విద్యార్థినులు ఉండేలా వసతులతో భవనాలు నిర్మించింది. వసతితో పాటు భోజనం, ఇతర సౌకర్యాలు కల్పించింది. మొదట్లో ప్రారంభించిన పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించారు. అనంతరం ఏటా కొన్ని పాఠశాలలకు భవనాలు మంజూరు చేశారు.

సమస్యలివిగో..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో 56 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలున్నాయి. చింతలపాలెం మినహా అన్నింటికీ సొంత భవనాలు సమకూరుతున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల నిర్మాణాలు పూర్తయి భవనాల్లోకి వెళ్లగా, మరికొన్ని సిద్ధంగా ఉన్నాయి. ఆరంభంలోనే సొంత భవనాలు నిర్మించిన చోట అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. వర్షాకాలం, శీతాకాలంలో బాలికలకు వేడి నీటి అవసరమని గుర్తించి సోలార్‌ వాటర్‌ హీటర్లు ఏర్పాటు చేశారు. అవి ఏర్పాటు చేసిన ఆర్నెళ్లకే అవి మూలనపడ్డాయి. కోతులు సౌర పలకలను విరగకొట్టడంతో వైర్లు సైతం తెగిపోయి పనిచేయడం లేదు. తాగునీటికి ఆర్వో ప్లాంటు ఏర్పాటు చేసినా చాలా చోట్ల వివిధ కారణాలతో పనిచేయడం లేదు. దీంతో మంచినీటిని బయట కొనుగోలు చేస్తున్నారు. లోడు భారం పెరిగి నిత్యం మీటర్లు కాలిపోవడం, ప్రమాదాలకు దారి తీస్తున్నాయి.

పరిశీలించి చర్యలు తీసుకుంటాం

పూలన్, జీసీడీవో, సూర్యాపేట

కస్తూర్బా పాఠశాలల్లో చిన్నచిన్న సమస్యలను పరిష్కరించడానికి నిధులు జమ చేశాం. ఇతర పనులుంటే పరిశీలించి నిధులు సమకూర్చడంతో పాటు సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటాం.
గరిడేపల్లిలో ఊరి చివర శ్మశానం పక్కన చెరువు అంచున విద్యాలయం నిర్మించడంతో సరైన దారి లేదు. చుట్టూ కంపచెట్లు ఉన్నాయి. ఇంటర్‌ విద్యార్థులు సైతం ఇదే వసతి గృహంలో ఉండటంతో గదులు సరిపోక ఇరుకుతో ఇక్కట్లు పడుతున్నారు. కళాశాలలకు నూతన భవనాలు నిర్మించినా వినియోగంలోకి రాలేదు. తాగునీరు, విద్యుత్తు సౌకర్యం కల్పించలేదు. అందరూ ఒకే చోట ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పించాలని, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని