logo

సేంద్రియ సాగులో మేటి

ఉన్నత చదువు చదివి.. రూ.వేలల్లో వేతనానికి ఏసీ గదుల్లో పని చేసే ఉద్యోగావకాశాలు ఉన్నా.. అవన్నీ వదిలేసి వ్యవసాయంపై మక్కువ.. భూమిపై ప్రేమతో సాగు రంగంలోకి అడుగు పెట్టారు మిర్యాలగూడ పట్టణానికి చెందిన సోమా పవన్‌కుమార్‌.

Published : 03 Jul 2024 03:39 IST

సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన వరి (పాత చిత్రం)

మిర్యాలగూడ పట్టణం, న్యూస్‌టుడే: ఉన్నత చదువు చదివి.. రూ.వేలల్లో వేతనానికి ఏసీ గదుల్లో పని చేసే ఉద్యోగావకాశాలు ఉన్నా.. అవన్నీ వదిలేసి వ్యవసాయంపై మక్కువ.. భూమిపై ప్రేమతో సాగు రంగంలోకి అడుగు పెట్టారు మిర్యాలగూడ పట్టణానికి చెందిన సోమా పవన్‌కుమార్‌. కెమికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన ఈయన చదువు పూర్తయిన వెంటనే 2004లో వ్యవసాయాన్ని ప్రారంభించారు. పెద్దవూర మండలం పెద్దగూడెంలోని తమకున్న వ్యవసాయ క్షేత్రంలో పలు రకాల పంటలు పండిస్తున్నాడు. వరితో పాటు బత్తాయి, బొప్పాయి, అల్లం, పుచ్చకాయ, కూరగాయలతో పాటు చేపలు, కోళ్ల పెంపకం చేపడుతున్నారు.

పదిహేనేళ్లుగా..

2009లో ఎనిమిది గుంటల విస్తీర్ణంలో సేంద్రియ పద్ధతిలో వరి సాగు ప్రారంభించిన పవన్‌కుమార్‌.. ఏటా కొంత విస్తీర్ణం పెంచుతూ ప్రస్తుతం నాలుగున్నర ఎకరాల్లో పండిస్తున్నారు. పొలానికి పురుగు మందులకు బదులు వర్మీ కంపోస్టుతో పాటు ఆవు మూత్రం, వేపనూనె, పుల్లటి మజ్జిగ, పురుగులు రాకుండా జిగురు అట్టలు, సోలార్‌ ట్రాప్‌లు వాడుతున్నారు.
తొలుత దిగుబడి తక్కువగా వచ్చినా ప్రస్తుతం బాగానే వస్తోందని.. ఈ బియ్యం తిన్న వారు మళ్లీ కావాలంటున్నారని పవన్‌కుమార్‌ తెలిపారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో రైతులకు వర్మీ కంపోస్టు తయారీలో ఉచిత శిక్షణ అందిస్తూ.. లాభాలను వివరిస్తున్నారు.

సంఘటితంగా ముందుకు..

పెద్దవూర రైతు ఉత్పత్తిదారుల సంఘం ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన పవన్‌కుమార్‌ ప్రస్తుతం దానికి డైరెక్టర్‌గా ఉన్నారు. నాబార్డు సహకారంతో ఏర్పాటైన ఈ సంఘంలో ఐదు మండలాలు.. 35 గ్రామాలకు చెందిన 500 మంది వరకు రైతులు సభ్యులుగా ఉన్నారు. సంఘం ఆధ్వర్యంలో వర్మీ కంపోస్టు విక్రయం, రసాయన ఎరువుల దుకాణం, వివిధ బ్యాంకుల నుంచి రుణ సదుపాయం, వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా పరిశ్రమలకే విక్రయం వంటి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు.


ప్రభుత్వ ప్రోత్సాహం అవసరం

సోమా పవన్‌కుమార్, యువ రైతు, మిర్యాలగూడ

రసాయన ఎరువుల వాడకంతో పర్యావరణ కాలుష్యంతో పాటు భూసారం తగ్గుతోంది. అందుకే నా వంతుగా సేంద్రియ పద్ధతిలో పంటలు పండిస్తూనే రైతులకూ అవగాహన కల్పిస్తున్నా. ప్రభుత్వాలు వర్మీ కంపోస్టు ఎరువులను ఉచితంగా అందించి ప్రోత్సహించాలి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని